YS Viveka Murder: వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్
వైఎస్ వివేకా హత్య కేసులో సీబీఐ మరో ఛార్జిషీట్ వేసింది. పులివెందుల కోర్టులో నిందితుడు శివశంకర్ రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది.
మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు దర్యాప్తు కొనసాగుతూనే ఉంది. తాజాగా నిందితుడు దేవిరెడ్డి శివశంకర్‌రెడ్డిపై సీబీఐ ఛార్జిషీట్ దాఖలు చేసింది. పులివెందుల కోర్టులో సీబీఐ అధికారులు ఈ మేరకు మరో ఛార్జిషీట్ వేశారు. వివేకా హత్య కేసులో శివశంకర్‌రెడ్డిని ఐదో నిందితుడిగా సీబీఐ గుర్తించింది. శివశంకర్ రెడ్డి కడప సెంట్రల్ జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్నాడు. గతేడాది నవంబర్ 17వ తేదీన శివశంకర్‌ను హైదరాబాద్‌లో సీబీఐ అరెస్టు చేసింది. వివేకా హత్య కేసులో గతంలో ఒక ఛార్జిషీట్‌ను సీబీఐ దాఖలు చేసింది. మొదటి ఛార్జిషీట్‌లో ఎర్ర గంగిరెడ్డి, సునీల్ యాదవ్, ఉమా శంకర్‌రెడ్డి, దస్తగిరి పేర్లను సీబీఐ పేర్కొంది.
సీబీఐ రంగంలోకి
తెలుగు రాష్ట్రాల్లో సంచలమైన వివేకా హత్య కేసులో దర్యాప్తు సుదీర్ఘకాలంగా జరుగుతోంది. సీబీఐ రంగంలోకి దిగిన తర్వాత విచారణ కాస్త ముందుకు సాగింది. అయినా కేసు తారుమారు చేసేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయన్న అనుమానాలు తగ్గలేదు. వివేకా హత్య కేసు విషయంలో సీబీఐ అధికారుల విచారణ చివరి దశకు చేరినట్లు తెలుస్తోంది. శివశంకర్ రెడ్డినే ప్రధాన సూత్రధారిగా తెలుస్తూ కోర్టుకు వివరాలు సమర్పించినట్లు సమాచారం. శివశంకర్ రెడ్డి బెయిల్ పిటిషన్ ను కూడా కోర్టు గతంతో తిరస్కరించింది.
రూ.40 కోట్ల సుపారీ..!
సీబీఐ విచారణలో వివేకా గుండెపోటు, రక్తపువాంతులతో చనిపోయాడంటూ తప్పుడు సాక్ష్యాలు చెప్పారని తెలింది. బాత్రూం, బెడ్ రూంలో రక్తపు మరకల్ని చేరిపేసి ఆధారాలు లేకుండా చేసినట్లు గుర్తించింది. వివేకా శరీరంపై గాయాలను జై ప్రకాశ్ రెడ్డి అనే కాంపౌండర్ తో కట్లు కట్టించారని సీబీఐ తెలిపింది. వివేకా హత్య కేసులో శివశంకర్ రెడ్డి ప్రమేయం ఉందని అతడ్ని సీబీఐ హైదరాబాద్ లో అరెస్టు చేసింది. హత్యకు నెల రోజుల ముందు నుంచే పక్కా ప్లాన్ చేసినట్లు భారీ మొత్తంలో డబ్బులిస్తానని చెప్పి సునీల్ యాదవ్, గజ్జల ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరిలకు శంకర్ రెడ్డి ఆఫర్ ఇచ్చినట్లు సీబీఐ దర్యాప్తులో తేలింది. హత్య అనంతరం ఘటనాస్థలంలో జనాలను నియంత్రించేందుకు పులివెందుల సీఐతోనూ శివశంకర్ రెడ్డి సంప్రదింపులు జరిపినట్లు విచారణలో తెలింది. వివేకా హత్యకు రూ.40 కోట్ల వరకూ ఇస్తామని సునీల్ యాదవ్, ఉమాశంకర్ రెడ్డి, షేక్ దస్తగిరిలకు ఎర్రగంగిరెడ్డి చెప్పారని వాచ్ మన్ రంగన్న సీబీఐ వాంగ్మూలంలో తెలిపారు. అడ్వాన్స్ గా కోటి రూపాయలు ఇచ్చినట్లు తెలిసింది. ఈ కేసులో అప్రూవర్ గా మారిన దస్తగిరిపైనా శివశంకర్ రెడ్డి బెదిరింపులకు పాల్పడినట్లు సీబీఐ దర్యాప్తు తేలింది.
Also Read: పోలీసులు, ఇంటలిజెన్స్ వైఫల్యంపై సీఎం జగన్ సీరియస్.. అరగంట పాటు వివరణ ఇచ్చిన డీజీపీ ?