AP Volunteer: వామ్మో వాలంటీరు! పెళ్లికి వెళ్తున్నానని చెప్పి రూ.3 కోట్లతో మహిళ పరారీ
Ward volunteer Chit Fund Fraud : పొదుపు, చిట్టీల పేరుతో కోట్ల రూపాయాలు వసూలు చేసిన వార్డు వాలంటీరు.. ఆ నగదుతో పరారైంది. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పోలీసులు, అధికారులు ఎన్నిసార్లు హెచ్చరించినా తీరు మారడం లేదు. అత్యాశకు పోతే ఏం జరుగుతుందో మరోసారి రుజువైంది. పొదుపు, చిట్టీల పేరుతో కోట్ల రూపాయాలు వసూలు చేసిన వార్డు వాలంటీరు.. ఆ నగదుతో పరారైంది. విజయనగరం జిల్లా సాలూరు పట్టణంలో ఈ మోసం జరిగింది.
పోలీసుల కథనం ప్రకారం.. విజయనగరం జిల్లా సాలూరులోని చిట్లువీధికి చెందిన మానాపురం రమ్య వార్డు వాలంటీరుగా పని చేస్తోంది. గత కొన్నేళ్లుగా తల్లి అరుణతో కలిసి వార్డు వాలంటీరు మానాపురం రమ్య పొదుపు, చిట్టీల వ్యాపారం చేస్తున్నట్లు సమాచారం. స్థానికంగా ఏళ్ల తరబడి ఉండటంతో చుట్టుపక్కల వారికి వీరిపై నమ్మకం ఉంది. గత కొంతకాలం నుంచి వీరు తమ రూటు మార్చారు. తక్కువ సమయంలో ఎక్కువ సంపాదించాలని, అది ఏ రూపంలోనైనా సరేనని ప్లాన్ వేసుకున్నారు.
ఒకటికి రెండు రెట్లు, నాలుగు రెట్లు నగదు ఇస్తానని చిరు వ్యాపారులు, రోజువారీ కూలీలు, మురికవాడల్లోని వారికి చెప్పి నమ్మించింది. రూ.10 వేలు కడితే అదనంగా రూ.4 వేలు మీ చేతికొస్తాయి, రూ.20 వేలు కట్టినవారికి వడ్డీతో కలిపి ఏడాది తరువాత రూ.80 వేలు సొంతం చేసుకోవచ్చు అని వార్డు వాలంటీరు రమ్య, ఆమె తల్లి చెప్పిన మాటల్ని నమ్మారు. పైగా గత కొన్నేళ్లుగా చిట్టీల వ్యాపారం చేస్తున్నారు కనుక వీరిపై ఎవరికీ అనుమానం రాలేదు. రోజు, వారం, నెల ప్రాతిపదికన దాదాపు 2 వేల మంది దగ్గర రూ.3 కోట్ల వరకు నగదు వసూలు చేసినట్లు సమాచారం.
డిసెంబర్‌తో గడువు ముగిసింది
గత ఏడాది డిసెంబర్ నెలతో గడువు ముగియనుండగా, కొందరి చేతికి నగదు రావాల్సి ఉంది. తమ డబ్బులు ఇవ్వాలని జనవరి నుంచి రమ్య, ఆమె తల్లిని చిట్టీలు కట్టినవారు పదే పదే అడుగుతున్నారు. 150 మంది వరకు గడువు తీరిందని, డబ్బులు వడ్డీతో సహా తిరిగివ్వాలని గట్టిగా నిలదీయడంతో ప్లాన్ వేసుకున్నారు. మొదట బ్యాంకులో ఎక్కువ మొత్తంలో నగదు ఇవ్వడం లేదని మాయమాటలు చెప్పారు. విడతల వారీగా డబ్బులు చెల్లిస్తున్నామని చెప్పిన వార్డు వాలంటీర్ కుటుంబం.. పది రోజుల కిందట వివాహానికి వెళుతున్నామని చెప్పి వెళ్లారు. ఎంతకీ రాకపోవడంతో అనుమానం వచ్చి బాధితులు పోలీసులను ఆశ్రయించడంతో వార్డు వాలంటీరు చిట్టీల మోసం వెలుగుచూసింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేపట్టారు.
Also Read: Vijayawada Crime: బ్యూటీషియన్ ముసుగులో గంజాయి దందా, ప్రియుడి అరెస్టుతో గుట్టురట్టు
Also Read: Hyderabad: కస్తూర్బా ట్రస్టు నుంచి 14 మంది అమ్మాయిల పరార్, పటిష్ఠ భద్రత నడుమ మాస్టర్ ప్లాన్!