Hyderabad: కస్తూర్బా ట్రస్టు నుంచి 14 మంది అమ్మాయిల పరార్, పటిష్ఠ భద్రత నడుమ మాస్టర్ ప్లాన్!
ఈ విషయాన్ని ఉదయం గుర్తించిన మేనేజర్ రామకృష్ణ నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పారిపోయిన వారిలో ఎక్కువగా మహారాష్ట్ర, బెంగాల్‌కు చెందిన మహిళలు ఉన్నారు.
హైదరాబాద్ శివారులో కస్తూర్బా ట్రస్టు నుంచి ఏకంగా 14 మంది అమ్మాయిలు ఒకేసారి పారిపోవడం కలకం రేపుతోంది. గండిపేట మండలం హైదర్షాకోట్‌లో కస్తూర్బాగాంధీ స్మారక ట్రస్ట్ ఉంది. ఈ కస్తూర్బా గాంధీ స్మారక ట్రస్టు నుంచి 14 మంది యువతులు శుక్రవారం అర్థరాత్రి పరార్ అయ్యారు. ఉదయాన్నే ఈ విషయం గుర్తించిన స్మారక ట్రస్టు మేనేజర్ వెంటనే ఈ విషయాన్ని నార్సింగి పోలీసులకు తెలియజేశారు. దీంతో వారు కేసు నమోదు చేశారు.
పోలీసులు వెల్లడించిన వివరాల ప్రకారం.. హైదరాబాద్ నగరంలో వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో వేర్వేరు నేరాల్లో పట్టుబడిన యువతులు, మహిళలను కస్తూర్బా గాంధీ స్మారక ట్రస్ట్‌లో చేర్చుతారని చెప్పారు. ఆ క్రమంలోనే పట్టుబడ్డ యువతులు, మహిళలను పూర్తి భధ్రత మధ్య కస్తూర్బా గాంధీ స్మారక ట్రస్టులో ఓ హాలులో 18 మందిని ఉంచారు. అయితే, శుక్రవారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో పలువురు మహిళలు బాత్ రూంలో కిటికి ఊచలను కట్ చేసి 15 మంది పారిపోయేందుకు యత్నించారని పోలీసులు చెప్పారు. అలా చేస్తుండగా.. ఓ యువతికి గాయాలు కావడంతో ఆమె అక్కడే ఉండిపోయిందని అన్నారు. మిగతా 14 మంది యువతులు పరారైనట్లుగా పోలీసులు వెల్లడించారు.
ఈ విషయాన్ని ఉదయం గుర్తించిన మేనేజర్ రామకృష్ణ నార్సింగి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. పారిపోయిన వారిలో ఎక్కువగా మహారాష్ట్ర, బెంగాల్‌కు చెందిన మహిళలు ఉన్నారు. వీరి కోసం రెండు పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చేస్తున్నట్లుగా పోలీసులు వెల్లడించారు. అయితే, ఇనుప గ్రిల్స్‌ను ఎలా కత్తిరించారనే కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. కట్ చేసేందుకు ఏం వాడారనే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నారు.