Hyderabad News: ఆస్పత్రికి వెళ్తే దంపతులపై పడిన వృక్షం - భర్త మృతి, భార్యకు తీవ్రగాయాలు
Telangana News: హైదరాబాద్ లో తీవ్ర విషాద ఘటన చోటు చేసుకుంది. ఆస్పత్రికి చికిత్స కోసం వెళ్తున్న దంపతులపై వృక్షం కూలి భర్త మృతి చెందగా.. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి.
Tree Fell Down On Couple In Hyderabad: మృత్యువు ఏ క్షణాన ఏ వైపు నుంచి వస్తుందో ఎవరూ ఊహించలేం. తాజాగా, అలాంటి విషాద ఘటన హైదరాబాద్ (Hyderabad)లో మంగళవారం చోటు చేసుకుంది. చికిత్స కోసం ఆస్పత్రికి వచ్చిన దంపతులపై అకస్మాత్తుగా ఓ చెట్టు విరిగిపడగా.. భర్త స్పాట్ లోనే ప్రాణాలు కోల్పోయాడు. భార్యకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదానికి సంబంధించిన దృశ్యాలు సీసీ టీవీలో రికార్డవ్వగా వైరల్ గా మారాయి. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సికింద్రాబాద్ బొల్లారం కంటోన్మెంట్ ఆస్పత్రికి (Bollaram Contonment Hospital) చికిత్స నిమిత్తం రవీందర్, సరళాదేవి దంపతులు మంగళవారం వచ్చారు. ఈ క్రమంలో ఆస్పత్రి ఆవరణలోని ఓ వృక్షం ఒక్కసారిగా వారిపై కూలింది. ఈ ప్రమాదంలో భర్త రవీందర్ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోగా.. భార్య సరళాదేవికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఆమెను మెరుగైన వైద్యం కోసం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆస్పత్రికి తరలించారు. సరళాదేవి ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్నట్లు గుర్తించారు. ఈ ఘటనతో స్థానికులు ఒక్కసారిగా భయాందోళనకు గురయ్యారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.