Crime News: ఏపీలో దారుణాలు - ఓ చోట రౌడీ షీటర్ దారుణ హత్య, మరో చోట ప్రియుడి మోజులో భర్తను చంపేసిన భార్య
Nellore News: ఏపీలో దారుణాలు జరిగాయి. నెల్లూరు జిల్లాలో ఓ రౌడీషీటర్‌ను పాత కక్షలతో కొందరు దుండగులు హతమార్చారు. అటు, కడప జిల్లాలో ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది.
Rowdy Sheeter Brutal Murder In Nellore District: ఏపీలో దారుణాలు చోటు చేసుకున్నాయి. నెల్లూరులో ఓ రౌడీషీటర్ దారుణ హత్యకు గురి కాగా.. కడప జిల్లాలో ఓ వివాహిత ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. నెల్లూరు (Nellore) నగరంలోని రామలింగాపురం బ్రిడ్జి వద్ద గుంజి రవి అనే రౌడీ షీటర్ ఆదివారం దారుణ హత్యకు గురయ్యాడు. ఓ హత్య కేసులో జైలుకు వెళ్లిన అతను ఇటీవల జైలు నుంచి విడుదలయ్యాడు. ఈ క్రమంలో పాత కక్షలతో చింటూ, కమ్మసాయి, వెంకీడాన్‌తో పాటు మరికొందరు అతన్ని కత్తులతో దారుణంగా హతమార్చారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
భర్తను చంపేసిన భార్య
అటు, కడప జిల్లాలోనూ (Kadapa District) దారుణం చోటు చేసుకుంది. ఓ మహిళ ప్రియుడితో కలిసి కట్టుకున్న భర్తనే హతమార్చింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్ధవటం మండలం లింగంపల్లి గ్రామంలో గంగయ్య, సంధ్య దంపతులు నివసిస్తున్నారు. గంగయ్య లింగంపల్లి పంపు హౌస్‌లో ఔట్ సోర్సింగ్ ఉద్యోగిగా విధులు నిర్వహిస్తున్నాడు. కాగా, అతని భార్య సంధ్య.. బాలరాజు అనే వ్యక్తితో ఇంట్లో సన్నిహితంగా ఉండడం చూసిన గంగయ్య ఆమెను మందలించాడు. దీంతో కోపం పెంచుకున్న ఆమె తమకు అడ్డుగా ఉన్న భర్తను చంపేయాలని అనుకుంది.
ఈ క్రమంలోనే ఈ నెల 22 నుంచి గంగయ్య అదృశ్యమయ్యాడు. దీనిపై బంధువులు, స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు గాలించగా రాయచోటి ఘాట్‌లో పూర్తిగా కుళ్లిన స్థితిలో ఉన్న గంగయ్య మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. స్థానికుల అనుమానంతో భార్య సంధ్య, ఆమె ప్రియుడిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. దర్యాప్తులో వారు పొంతన లేని సమాధానాలు చెబుతున్నట్లు తెలుస్తోంది. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.