Boat Accident: గోదావరిలో పడవ బోల్తా - ఒకరు గల్లంతు, బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం
Konaseema News: అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో గోదావరి వరద ఉద్ధృతికి ఓ బోటు బోల్తా పడింది. ఈ ఘటనలో గన్నవరం మండలానికి చెందిన ఓ వ్యక్తి గల్లంతయ్యాడు. అధికారులు అతని కోసం గాలింపు చేపట్టారు.
Boat Capsized In Konaseema District: డా.బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా (Konaseema District) పి.గన్నవరం (Gannavaram) మండలం ఊడిమూడి లంక వద్ద గోదావరి నదిలో ఆదివారం పడవ బోల్తా పడింది. ఈ ఘటనలో ఒకరు గల్లంతు కాగా.. ఐదుగురు సురక్షితంగా బయటపడ్డారు. వరద ప్రభావిత లంక గ్రామాలకు వాటర్ ప్యాకెట్లు తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఆ సమయంలో ఆరుగురు పడవలో ఉండగా.. వరద ప్రవాహానికి పడవ ఒక్కసారిగా బోల్తా పడింది. ఐదుగురు లైఫ్ జాకెట్లు ధరించడంతో సేఫ్‌గా బయటపడ్డారు. వారిని స్థానిక మత్స్యకారులు రక్షించారు. లైఫ్ జాకెట్ ధరించని ఊడిమూడికి చెందిన విజయ్ కుమార్ (26) అనే యువకుడు నదిలో గల్లంతయ్యాడు. అతని కోసం పోలీస్, రెవెన్యూ, అధికారులు గాలింపు చేపట్టారు.
ప్రభుత్వం ఆర్థిక సాయం
ఈ ఘటనపై సీఎం చంద్రబాబు (CM Chandrababu) విచారం వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి రూ.5 లక్షల ఆర్థిక సాయం ప్రకటించారు. నదిలో వరద ఉద్ధృతి తగ్గేంత వరకు లంక గ్రామాల ప్రజలు, గోదావరి పరీవాహక ప్రాంత వాసులు అప్రమత్తంగా ఉండాలని సీఎం సూచించారు. అధికార యంత్రాంగం సైతం అలర్ట్‌గా ఉంటూ ప్రజలకు సాయం అందించాలని నిర్దేశించారు.
వరదల్లో లంక గ్రామాలు
కాగా, గత వారం రోజులుగా కురుస్తోన్న వర్షాలతో గోదావరికి వరద పోటెత్తుతోంది. శనివారం ధవళేశ్వరం వద్ద రెండో ప్రమాద హెచ్చరికను అధికారులు జారీ చేశారు. భారీ వర్షాల ధాటికి తాత్కాలికంగా వేసిన గట్టు తెగిపోగా.. నాలుగు గ్రామాల ప్రజలు పడవలపైనే రాకపోకలు సాగిస్తున్నారు. ఆయా గ్రామాలకు వాటర్ ప్యాకెట్స్ తీసుకెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. గోదారి ఉగ్ర రూపంతో లంక గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. అటు, అధికార యంత్రాంగం బాధిత గ్రామాల ప్రజలు సహాయం చేస్తోంది. కోనసీమ జిల్లాలోనూ పలు గ్రామాల ప్రజలు వరదలతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
మరోవైపు, భారీ వర్షాలతో అల్లూరి జిల్లాలో వాగులు, వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. ముంచంగిపుట్టు మండల పరిధిలో భారీ వర్షాలకు లక్ష్మీపురం పంచాయతీ ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. నిత్యావసర సరుకులు తెచ్చుకునేందుకు సైతం వీలులేక దాదాపు 30 గ్రామాల గిరిజనులు అవస్థలు పడుతున్నారు. అటు, రాజమండ్రి మున్సిపల్ కార్పొరేషన్ 45వ డివిజన్‌లోని ఇందిరా కాలనీ జల దిగ్బంధంలో చిక్కుకుంది. వర్షంతో డ్రైనేజీలు పొంగి పొర్లి మురికి నీటితో జనం తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తమ సమస్యలను అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు.
ట్రాక్టర్‌పై కలెక్టర్
అటు, ప.గో జిల్లా ఆచంట మండలం అయోధ్యలంకలో గోదావరి వరద ముంపునకు గురైన బీసీ కాలనీ, మర్రిమూల గ్రామాలను జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి ఆదివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. కోడేరు రేవు నుంచి పడవపై చేరుకున్న ఆమె వరద పరిస్థితిని సమీక్షించారు. అక్కడి మెడికల్ క్యాంపులను పరిశీలించారు. వరద బాధిత గ్రామాల ప్రజలను పరామర్శించి ధైర్యం చెప్పారు. తాగునీటికి ఇబ్బంది పడుతున్నామని, ప్రతి సంవత్సరం వరద సమయంలో పిల్లలు పాఠశాలలకు వెళ్లడానికి వీలు లేకుండా ఉందని గ్రామస్థులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. పుచ్చలంక నుంచి మర్రిమూలకు బ్రిడ్జి ఏర్పాటుతో సమస్య తీరుతుందని కలెక్టర్‌కు విన్నవించారు. సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామని ఆమె చెప్పారు. వరద ముంపునకు గురైన ప్రతి కుటుంబానికి 25 కేజీల బియ్యం, బంగాళదుంపలు, ఉల్లిపాయలు, నూనె, కందిపప్పు వంటి నిత్యావసరాలు అందజేస్తామన్నారు. పశుగ్రాసానికి కొరత లేకుండా అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు.