Nellore Crime: నెల్లూరు జిల్లాలో ఘోరప్రమాదం... కల్వర్టును ఢీకొట్టిన కారు... మామ, కోడలు మృతి
నెల్లూరు జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. కుమారుడిని హాస్టల్ లో చేర్చి తిరిగి వస్తున్న సమయంలో కారు ప్రమాదం జరిగింది. ప్రమాదంలో ఇద్దరు మృతి చెందారు.
నెల్లూరు జిల్లా కోవూరు వద్ద జాతీయ రహదారిపై సోమవారం అర్ధరాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఈ ఘటనలో ఇద్దరు అక్కడికక్కడే మృతిచెందారు. మరో ఇద్దరి తీవ్రగాయాలయ్యాయి. నెల్లూరులోని హరినాథపురానికి చెందిన పార్లపల్లి మహేంద్ర అనే వ్యక్తి తన కుమారుడిని పశ్చిమ గోదావరి జిల్లా తణుకులో ఉన్న రెసిడెన్షియల్ స్కూల్ హాస్టల్ లో చేర్పించి తిరిగి ఇంటికి పయనమయ్యారు. కుటుంబ సభ్యులంతా కలసి కారులో తణుకు వెళ్లి తిరిగి నెల్లూరు వస్తున్నారు.
కోవూరులో ప్రమాదం
కోవూరులోని ఏసీసీ కల్యాణ మండపం వద్దకు రాగానే కారు అదుపుతప్పి కల్వర్టును ఢీకొంది. దీంతో కారులో ఉన్న మహేంద్ర తండ్రి పార్లపల్లి సుధాకర్ రావు(76), మహేంద్ర భార్య అపర్ణ(30) అక్కడిక్కడికే మరణింంచారు. వీరితో పాటు కారులో ఉన్న మహేంద్రకి, అతని తల్లికి కూతురుకి గాయలయ్యాయి. వెంటనే స్పందించిన కోవూరు పోలీసులు క్షతగాత్రులను నెల్లూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఘటనపై కోవూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
కొడుకును చంపిన తండ్రి
మొక్కై వంగనిది మానై వంగునా అనేది సామెత. చిన్నవారిగా ఉన్నప్పుడే పిల్లలకు మంచి బుద్ధులు నేర్పించాలి. పెద్దయ్యాక బలాదూర్ గా తయారైతే దానికి ఫలితం అనుభవించాల్సి ఉంటుంది. అయితే ఆ తండ్రి పెద్దయిన తర్వాత కూడా కొడుక్కి సుద్ధులు చెప్పాడు. తీరు మార్చుకోని కారణంగా చివరకు తానే హతమార్చాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి.
నెల్లూరు జిల్లా ఇందుకూరు పేట మండలం కుడితిపాళెంలో జరిగిన దారుణం ఇది. కన్నతండ్రే కొడుకుని దారుణంగా హత్య చేశాడు. స్థానికంగా నివసించే అశోక్ అనే రౌడీ షీటర్ గ్రామంలో అందరితో గొడవలు, తగాదాలు పడుతుండేవాడు. కొడుకు ప్రవర్తన మార్చుకోవాలని తండ్రి పెంచలయ్య చాలా కాలంగా చెబుతూ వచ్చాడు. కానీ రోజు రోజుకీ అశోక్ ఆగడాలు ఎక్కువయ్యాయి. చివరకు తండ్రితో కూడా నిత్యం గొడవలు పడుతుండేవాడని తెలుస్తోంది. అంతే కాదు తండ్రి అని కూడా గౌరవించకుండా అతనిపై దాడి చేసేవాడు.
మద్యం మత్తులో తండ్రిపైనే దాడి చేయబోగా.. అతను తప్పించుకుని కొడుకునే హతమార్చాడు. కన్నకొడుకుని తన చేతులతోనే మట్టుబెట్టాడు. కర్రతో తలపై కొట్టి చంపేశాడు. హత్యకు ఉపయోగించిన కర్రను పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు