Nellore News: రూ.కోటి కొట్టేసి.. బిచ్చగాళ్లకు రూ.500 నోట్లు పంచేశారు.. కానీ పానీపూరి ఫోన్ కాల్ పట్టించేసింది
నెల్లూరు జిల్లాలో ఇటీవల జరిగిన ఓ భారీ చోరీని పోలీసులు చాకచక్యంగా చేధించారు. ఇందులో ట్విస్ట్ ఏంటంటే దొంగలు పుణ్యక్షేత్రాలకు వెళ్లి బిచ్చగాళ్లకు రూ.500 నోట్లు పంచిపెట్టారు.
నెల్లూరు జిల్లాలో రూ.కోటీ 26 లక్షలు కొట్టేసిన నిందితుల్ని పోలీసులు చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి కోసం 4 రాష్ట్రాల్లో గాలించారు. వారం రోజులపాటు శ్రమించి నిందితులను పట్టుకున్నారు. ఈ కేసు విచారణలో ఆసక్తికర విషయాలు వెలుగుచూశాయి. పానీపూరీ బండి నడిపే వ్యక్తి నుంచి చేసిన ఫోన్ కాల్ నిందితుల్ని పట్టించింది.
సంస్థ ఉద్యోగులే చోరీ
నెల్లూరు జిల్లాలో ఇటీవల భారీ చోరీ జరిగింది. ఏకంగా రూ. కోటీ 26 లక్షల సొత్తుని ముగ్గురు దొంగలు దోచుకెళ్లింది. రైటర్స్ సేఫ్ గార్డ్ ప్రైవేట్ ఏజెన్సీ వివిధ సంస్థల డబ్బును బ్యాంకుల్లో నిత్యం డిపాజిట్ చేస్తుంది. సదరు సంస్థ ఉద్యోగులైన షేక్ రబ్బాని, రఫి, మస్తాన్ ఆగస్ట్ 31వతేదీన దొంగతనానికి పాల్పడ్డారు. అక్కడి నుంచి అసలు కథ మొదలైంది. ముందుగా నెల్లూరు నుంచి జొన్నవాడ పారిపోయిన వీళ్లు అక్కడ కొంత నగదును దాచిపెట్టారు. ఆ తర్వాత ఏఎస్ పేట వెళ్లారు. అక్కడి నుంచి కావలి, కావలి నుంచి ఒంగోలు వెళ్లి బంధువుల ఇంట్లో మరి కొంత నగదు ఉంచారు. ఒంగోలు రైల్వే స్టేషన్ లో జీటీ ఎక్స్ ప్రెస్ ఎక్కి భోపాల్ పారిపోయారు.
బిచ్చగాళ్లకు రూ.500 నోట్లు
మధ్యప్రదేశ్ లోని భోపాల్ నుంచి రాజస్థాన్ లోని అజ్మీర్ వెళ్లారు. అక్కడి నుంచి జైపూర్ ఆ తర్వాత మహారాష్ట్రలోని నాగపూర్ వచ్చారు. అక్కడి నుంచి తెలంగాణలోని ఆదిలాబాద్ వచ్చారు. ఆదిలాబాద్ నుంచి గుంటూరు, గుంటూరు నుంచి కావలి, ఏఎస్ పేట ఆ తర్వాత నెల్లూరు టౌన్ కి చేరుకున్నారు. తీరా నెల్లూరు వచ్చాక పోలీసులు వారిని చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి కోసం పోలీసులు మొత్తం 4 రాష్ట్రాల్లో గాలించారు. ఈ నాలుగు రాష్ట్రాల్లో నిందితులు వివిధ పుణ్యక్షేత్రాలకు వెళ్లడం, అక్కడ బిచ్చగాళ్లకు ఒక్కొకరికి రూ.500 నోట్లు ఇవ్వడం విశేషం. కనపడిన బిచ్చగాళ్లందరికీ డబ్బులు పంచుకుంటూ వెళ్లారు.
పట్టించిన ఫోన్ కాల్
దొంగతనం చేసిన వెంటనే నిందితులు తమ ఫోన్లను స్విచాఫ్ చేశారు. భోపాల్ లో ఓచోట పానీపూరీ తిని, ఆ బండి నడిపే వ్యక్తి ఫోన్ నుంచి నెల్లూరుకి ఫోన్ చేశారు. ఈ ఫోన్ కాల్ తో పోలీసులు నిందితులున్న చోటును తెలుసుకున్నారు. చివరికి చాకచక్యంగా పట్టుకున్నారు. వీరి నుంచి రూ. కోటీ 11లక్షల 20 వేలు రికవరీ చేసినట్లు నెల్లూరు ఎస్సీ విజయరావు తెలిపారు. విచారణలో ప్రతిభ చూపిన పోలీసులకు రివార్డులందించారు.
Also Read: Saidabad Girl Rape: సైదాబాద్ చిన్నారి హత్యాచార కేసు.. నిందితుడు ఎక్కడ.. సాయం చేసింది అతడి ఫ్రెండేనా?