Guntur News: కాటేసిన పాము కోసం 2 గంటలు వెతికాడు - చివరకు వెంటాడిన మృత్యువు, గుంటూరు జిల్లాలో ఘటన
Andhra News: తనను కాటేసిన పామును చంపిన తర్వాతే తాను ఆస్పత్రికి వెళ్లి చికిత్స తీసుకుంటానని ఓ మయన్మార్ విద్యార్థి ప్రాణాలు కోల్పోయాడు. ఈ ఘటన గుంటూరు జిల్లాలోని ఏఎన్‌యూ క్యాంపస్‌లో జరిగింది.

Mayanmar Student Died Due To Snake Bite In ANU Campus: తనను కాటేసిన పామును చంపిన తర్వాతే తాను ఆస్పత్రికి వెళ్తానన్న ఓ యువకుడి మొండి పట్టుదల అతని ప్రాణాలు బలిగొంది. గుంటూరు జిల్లాలో ఈ షాకింగ్ ఘటన చోటు చేసుకుంది. పూర్తి వివరాల ప్రకారం.. జిల్లాలోని ఏఎన్‌యూ క్యాంపస్‌లో యమన్మార్‌కు చెందిన కొండన్న (38) అనే విద్యార్థి ఎంఏ బుద్ధిజం చదివేందుకు గత నెలలోనే ఇక్కడకు వచ్చారు. క్యాంపస్‌లోని అంతర్జాతీయ విద్యార్థుల వసతి గృహంలో ఉంటూ చదువుకుంటున్నారు. శనివారం రాత్రి 10 గంటలకు ఆ దేశానికే చెందిన మరో స్నేహితుడితో కలిసి బయటకు వెళ్లారు. వీరిద్దరూ వర్శిటీ ప్రాంగణంలో ఓ పుట్ట వద్ద పుట్టగొడుగులు సేకరిస్తుండగా కొండన్నను పాము కాటేసింది.
పాము కోసం వెతుకుతూ..
పాము కాటు వేసిన వెంటనే కొండన్న వెంటనే ఆస్పత్రికి వెళ్లకుండా దాని కోసం వెతుకుతూ దాదాపు 2 గంటల సమయం వృథా చేశారు. పామును పట్టి చంపిన తర్వాతే తాను ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలని భావించారు. కాగా, యమన్మార్‌లో ఎవరినైనా పాము కాటు వేస్తే దాన్ని చంపి ఆ తర్వాతే దాంతో పాటే ఆస్పత్రికి వెళ్తారు. వైద్యులు ఆ పాము జాతిని బట్టి వైద్యం చేస్తారు. ఈ క్రమంలో రాత్రి 10:30 గంటలకు రక్తపింజర పాము కరిస్తే.. 12 గంటల వరకూ దాని కోసం ఇద్దరూ వెతుకులాడారు. చివరకు ఆ పాము దొరకడంతో దాన్ని చంపి వెంటనే మంగళగిరిలోని ఎన్నారై ఆస్పత్రికి వెళ్లారు. అయితే, వైద్యులు వెంటనే చికిత్స మొదలు పెట్టినప్పటికీ ఆలస్యం కావడంతో కొండన్న ప్రాణాలు కోల్పోయారు.
మయన్మార్‌లోని క్యూహా బుద్ధిజం విశ్వవిద్యాలయంలో డిగ్రీ పూర్తి చేసిన కొండన్న.. ఉన్నత విద్య కోసం ఇక్కడకు వచ్చారు. సోమవారం నుంచి తరగతులు ప్రారంభం కానుండగా.. ఎంతో ఆశతో భారత్‌కు వచ్చిన విద్యార్థి ఇలా మృతి చెందడంతో తోటి విద్యార్థులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. అటు, మయన్మార్ విద్యార్థి మృతి ఘటన వర్శిటీ బయట కాలువ గట్టుపై జరిగిందని రిజిస్ట్రార్ ఆచార్య సింహాచలం తెలిపారు. దీనిపై ముందుగా పెదకాకాని పోలీసులకు ఫిర్యాదు చేశామని.. పోలీసులు ఆ ప్రాంతం దుగ్గిరాల పోలీస్ స్టేషన్ పరిధిలోకి వస్తుందని చెప్పడంతో అక్కడికి బదిలీ చేసినట్లు ఆదివారం రాత్రి వెల్లడించారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

