Road Accident: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం, మంత్రాలయం వేదపాఠశాల విద్యార్థులు ముగ్గురు మృతి

Mantralayam Vedapathashala Students Death | మంత్రాలయం: కర్ణాటకలో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. తీర్థయాత్రకు వెళ్తున్న వాహనం బోల్తా పడిన ఘటనలో కర్నూలు జిల్లా మంత్రాలయం వేదపాఠశాలకు చెందిన ముగ్గురు విద్యార్థులు, డ్రైవర్ మృతిచెందారు. మంత్రాలయం నుంచి వేదపాఠశాల విద్యార్థులు మంగళవారం రాత్రి కర్ణాటకలోని హంపి క్షేత్రాన్ని సందర్శించేందుకు తమ వాహనంలో బయలుదేరారు. హంపిలోని నరహరి తీర్థుల ఆరాధనకు మొత్తం 14 మంది వేదపాఠశాల విద్యార్థులు కర్ణాటక క్షేత్రానికి వెళ్తున్నారు. మార్గం మధ్యలో సింధనూరు సమీపంలో వీరు ప్రయాణిస్తున్న వాహనం ప్రమాదవశాత్తూ బోల్తాపడింది. ఈ రోడ్డు ప్రమాదంలో ముగ్గురు విద్యార్థులు సుజేంద్ర, అభిలాష, హైవదనతో పాటు డ్రైవర్ శివ సైతం అక్కడికక్కడే మృతిచెందారు. వాహనంలోని మరికొందరు విద్యార్థులకు గాయాలుకాగా, వారికి సమీపంలోని సింధనూరు ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారని సమాచారం. ఘటనా స్థలానికి చేరుకుని పోలీసులు పరిశీలించారు. కేసు నమోదు చేసుకుని విచారణ చేపట్టారు.
(ఇది బ్రేకింగ్ న్యూస్. ప్రస్తుతం దీనిని అప్‌డేట్ చేస్తున్నాం. లేటేస్ట్ అప్‌డేట్ కోసం రిఫ్రెష్ చేయండి)





















