(Source: ECI/ABP News/ABP Majha)
Vizianagaram: బీసీ హాస్టల్లో నిద్రిస్తుండగా పాముకాటు - చికిత్స పొందుతూ ఓ విద్యార్థి మృతి, ఒకరి పరిస్థితి విషమం
BC Hostel Kurupam Vizianagaram: నిద్రిస్తున్న విద్యార్థులకు పాముకాటు వేయడంతో విషాదం చోటుచేసుకుంది. ఓ విద్యార్థి మృతిచెందగా, మరో విద్యార్థి పరిస్థితి విషమంగా ఉంది.
Kurupam Students Snake Bite: విజయనగరం జిల్లా కురుపాం మండలం కేంద్రంలో గురువారం అర్ధరాత్రి విషాదం చోటుచేసుకుంది. పాముకాటుకు గురై ఓ విద్యార్థి చనిపోవడం స్థానికంగా కలకలం రేపుతోంది. మరో ఇద్దరు చిన్నారులను సైతం పాము కాటు వేసింది. మహాత్మా జ్యోతిరావుపూలే బీసీ హాస్టల్లోకి అర్ధరాత్రి వెళ్లిన పాము అక్కడ నిద్రిస్తున్న ముగ్గురు విద్యార్థులను ముఖంపై కాటేసింది. పాము కాటుతో ఈ ముగ్గురు విద్యార్థులు అపస్మారక స్థితిలోకి వెళ్లిపోయారు. ఇది గమనించిన తోటి విద్యార్థులు హాస్టల్ సిబ్బందికి వెంటనే సమాచారం ఇచ్చారు.
అప్రమత్తమైన హాస్టల్ సిబ్బంది పాముకాటుకు గురైన విద్యార్థులను 108 అంబులెన్స్ సహాయంతో పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన చికిత్స కోసం విజయనగరంలోని తిరుమల ఆస్పత్రికి తరలించారు. పాముకాటుకు గురైన ముగ్గురు విద్యార్థులు ఎనిమిదవ తరగతి చదువుతున్న మంతిని రంజిత్, ఈదుబుల్లి వంశీ జీగారం, వంగపండు నవీన్ లుగా గుర్తించారు. ముగ్గురు విద్యార్థులు అపస్మారక స్థితిలో ఉండటంతో వారి తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు.
ఓ విద్యార్థి మృతి
పాము కాటుకు గురైన ముగ్గురు విద్యార్థుల్లో మంతిని రంజిత్ అనే విద్యార్థి చికిత్స పొందుతూ చనిపోయినట్లు (Student Dies With Snake Bite In Kurupam) జాయింట్ కలెక్టర్ డా మహేష్ కుమార్ తెలిపారు. పాముకాటుకు గురైన వారిలో మరో విద్యార్థిని వెంటిలెటర్ పై ఉంచి చికిత్స అందిస్తున్నారు. మరో విద్యార్ధి ఆరోగ్యం ప్రస్తుతం నిలకడగా ఉందని తెలిపారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న విద్యార్థులను ఉప ముఖ్యమంత్రి పాముల పుష్పశ్రీవాణి పరామర్శించారు.
విషపూరిత పాము కావడంతో సీరియస్..
జ్యోతిరావుపూలే హాస్టల్ నుంచి పాముకాటుకు గురైన ముగ్గురు విద్యార్థులను ఉదయం 6:45 కు తీసుకొచ్చారు. రంజిత్ అనే విద్యార్థి ఇక్కడి తెచ్చేలోపు చనిపోయాడు. నవీన్ పరిస్థితి విషంగా ఉండగా వెంటిలెటర్ మీద చికిత్స అందిస్తున్నామని డాక్టర్ తెలిపారు. వంశీకి ఏ సమయంలోనైనా పరిస్థితి విషమించే అవకాశం ఉంది. మొదట కురుపాం సీహెచ్‌యూకు వెళ్లారు. అక్కడి నుంచి పార్వతీపురం ఏరియా ఆసుపత్రికి తీసుకొచ్చారు. పరిస్థితి మెరుగవకపోవడంతో తిరుమల మెడికవర్ ఆసుపత్రికి తీసుకొచ్చినట్లు వివరించారు. క్రైట్ బైట్ అనే విషపూరిత పాము కరవడం వల్ల ప్రాణహాని సంభవించినట్లు తెలుస్తోంది. విద్యార్థులకు మెరుగైన వైద్యం అందించాలని డిప్యూటీ సీఎం పుష్ప శ్రీవాణి సూచించినట్లు తెలిపారు.
Also Read: AP CM YS Jagan: పోలవరం పరిశీలనకు కేంద్ర మంత్రి గజేంద్రసింగ్ షెకావత్, సీఎం జగన్
Also Read: Weather Updates: అల్పపీడనం ఎఫెక్ట్ - ఏపీలో మూడు రోజులపాటు వర్షాలు, తెలంగాణలో వాతావరణం ఇలా