US Crime News: అమెరికాలోని జిమ్‌లో భారతీయ యువకుడిపై దాడి, చికిత్స పొందుతూ మృతి
Indian Student Dies: అమెరికాలో జిమ్‌లో దాడికి గురైన భారతీయ యువకుడు మృతి చెందాడు.
Indian Student Dies:
జిమ్‌లో దాడి..
US Crime News: అమెరికాలోని ఓ జిమ్‌లో భారతీయ యువకుడిపై ఇటీవల దాడి జరిగింది. ఓ వ్యక్తి పదునైన ఆయుధంతో తలపై దాడి చేయడం వల్ల తీవ్ర గాయాలతో ఆసుపత్రిలో చేరాడు. అక్టోబర్ 29న ఈ ఘటన జరిగింది. అప్పటి నుంచి హాస్పిటల్‌లోనే ప్రాణాలతో పోరాడుతున్న బాధితుడు చివరకు మృతి చెందాడు. వాల్పరైసో యూనివర్శిటీలో (Valparaiso University) కంప్యూటర్ సైన్స్ స్టూడెంట్ వరుణ్ రాజ్‌పై ( Varun Raj Pucha) జార్డన్ (Jordan Andrade) అనే వ్యక్తి దాడి చేశాడు. రక్తపు మడుగులో పడి ఉన్న బాధితుడిని ఆసుపత్రిలో చేర్చారు. అప్పటి నుంచి చికిత్స కొనసాగుతోంది. అయినా ఫలితం లేకుండా పోయింది. వరుణ్ రాజ్ చనిపోయినట్టు యూనివర్సిటీ అధికారికంగా ప్రకటించింది. వరుణ్ మృతి పట్ల విచారం వ్యక్తం చేసింది.
"వరుణ్ రాజ్ చనిపోయాడని చెప్పడానికి చాలా విచారిస్తున్నాం. మా యూనివర్సిటీ మంచి విద్యార్థిని కోల్పోయింది. వరుణ్ కుటుంబానికి, మిత్రులందరికీ ప్రగాఢ సంతాపం"
- వాల్పరైసో యూనివర్సిటీ
కొనసాగుతున్న విచారణ..
ఈ దాడి చేసిన వ్యక్తిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. తనపై దాడి చేస్తాడేమో అన్న భయంతోనే అలా చేశానని నిందితుడు పోలీసులకు వివరించాడు. కానీ సరిగ్గా ఆ సమయంలో ఏం జరిగిందన్నది ఇంకా స్పష్టత రాలేదు. పోలీసులు నిందితుడిని విచారిస్తున్నారు. అయితే జిమ్ నిర్వాహకులు మాత్రం వరుణ్ రాజ్ చాలా సైలెంట్‌గా ఉంటాడని, ఎవరితోనూ పెద్దగా మాట్లాడడని చెబుతున్నారు.
ఇదీ జరిగింది..
అమెరికాలోని ఇండియానాలో (Indiana Crime News) ఈ దారుణ ఘటన వెలుగు చూసింది. భారత్‌కి చెందిన ఓ 24 ఏళ్ల విద్యార్థి జిమ్ చేస్తుండగా గుర్తు తెలియని వ్యక్తి దాడి చేశాడు. కత్తితో పొడిచాడు. ఇండియానాలో ఓ పబ్లిక్ జిమ్‌లో వర్కౌట్స్ చేస్తుండగా ఈ దాడి జరిగినట్టు వివరించారు. అయితే...ఈ దాడికి కారణమేంటన్నది మాత్రం ఇంకా తెలియలేదు. నిందితుడు జోర్డాన్ అండ్రాడ్ ఘటన ఎలా జరిగింది పోలీసులకు వివరించాడు. మసాజ్ కోసం అక్కడికి వెళ్లానని, వరుణ్ తనపై దాడి చేసేందుకు ప్రయత్నించాడని చెప్పాడు. తనను తాను రక్షించుకోవడం కోసమే కత్తితో దాడి చేశానని అన్నాడు. ఉదయం 9 గంటల ప్రాంతంలో ఈ దాడి జరిగినట్టు పోలీసులు (US Police) చెప్పారు. ఘటనా స్థలానికి చేరుకునే సమయానికి మసాజ్ చైర్‌పై బాధితుడు రక్తపు మడుగులో పడి ఉన్నాడు. తలకు తీవ్ర గాయమైంది. అదే రూమ్‌లో నుంచి ఓ కత్తిని స్వాధీనం చేసుకున్నారు. ఈ కత్తి నిందితుడిదేనని ప్రాథమికంగా నిర్ధరణకు వచ్చారు. పూర్తి స్థాయిలో విచారణ కొనసాగిస్తున్నట్టు పోలీసులు వెల్లడించారు.
"వరుణ్ ఇండియానాలోని ఓ పబ్లిక్ జిమ్‌లో వర్కౌట్ చేస్తుండగా ఓ వ్యక్తి ఉన్నట్టుండి దాడి చేశాడు. కత్తితో దారుణంగా పొడిచాడు. స్థానికులు గుర్తించి వెంటనే దగ్గర్లోని ఆసుపత్రికి తరలించారు. అప్పటికే లోతైన గాయాలయ్యాయి"
- పోలీసులు
Also Read: నితీశ్ వ్యాఖ్యలపై అమెరికన్ సింగర్ ఆగ్రహం,అందుకే మోదీ బెస్ట్ లీడర్ అంటూ ప్రశంసలు