Chittoor Crime News : చిత్తూరు జిల్లాలో తెగించిన ఉద్యోగులు - అవినీతిపై విచారణకు వచ్చిన అధికారుల ముందే వాటాలపై ఘర్షణ !
చిత్తూరు జిల్లాలో ఎమ్మార్వో ఆఫీసుల్లో అవినీతి తరచూ బయటపడుతోంది. పెనుమూరులో విచారణకు వచ్చిన అధికారుల ముందే లంచాల్లో వాటాలపై వాదులాడుకున్నారు సిబ్బంది.
Chittoor Crime News : చిత్తూరు జిల్లాలో తహశీల్దార్ల అవినీతి వీడియో సాక్ష్యాలతో దొరికినా లక్ష్య పెట్టడం లేదు. విచారణాధికారులు వస్తే.. తమ బాగోతాలు మొత్తం నేరుగా బయట పెట్టుకుంటున్నారు. తాజాగా.. పెనుమూరు తాసిల్దార్ కార్యాలయంలో అవినీతి బాగోతం మరోసారి వెలుగు చూసింది. రైతు నుంచి లంచం డిమాండ్ పెనుమూరు తాహశీల్దార్ రమణి పై విచారణ కు ఉన్నతాధికారులు ఆదేశించారు. ఆమెపై విచారణకు బృందం తహశీల్దార్ కార్యాలయానికి వచ్చింది. ఆ బృందం ముందే డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వో అవినీతి సొమ్ముపై వాదులాడుకోవడం ప్రారంభించారు. ఇద్దరూ వాదన పెట్టుకుని పంచాయతీని అవినీతిపై విచారణకు వచ్చిన అధికారుల ముందే పెట్టారు.
డిప్యూటీ తహశీల్దార్‌కు డబ్బులిచ్చానని విచారణాధికారుల ఎదుట వీఆర్వో ఆరోపణలు
డిప్యూటీ తాసిల్దార్ ,వీఆర్వోల మధ్య అవినీతి సొమ్ము పంపకంలో తేడాలు వచ్చాయి. తాను లక్షా డెబ్బై వేల రూపాయలు తాను డీటీ కి ఇచ్చినట్టు వీఆర్వో దొరస్వామి ఆరోపించాడు. తను ఇచ్చిన డబ్బు తిరిగి ఇవ్వాల్సిందిగా డిటి కిషోర్ ను కార్యాలయంలో అందరి ముందే నిలదీశాడు.. కాణిపాకంలో ప్రమాణం చేసేందుకు కూడా సిద్ధమని బల్లగుద్ది మరీ చెప్పారు..కె.వి పల్లె విఆర్వో గా పని చేసిన దొరస్వామి ఈ మధ్యనే బదిలీపై ఐరాల వెళ్లారు.. తాసిల్దార్ రమణి ఓ రైతును ఐదు వేలు లంచం డిమాండ్ చేస్తుండగా తీసిన వీడియో వైరల్ మారింది.. తాజాగా మళ్లీ అదే పెనుమూరు తాసిల్దార్ కార్యాలయంలో మరో అవినీతి వ్యవహారం గుట్టురట్టు కావడం చర్చనీయాంశంగా మారింది.
రూ. ఐదువేలు లంచం కోసం డిమాండ్ చేసి వీడియోలో దొరికిపోయిన తహశీల్దార్ రమణి
ప్రస్తుతం పెనుమూరు తలహశీల్దార్‌ను కలెక్టరేట్‌కు అటాచ్ చేశారు. చిత్తూరు జిల్లాలో తహశీల్దార్ల అవినీతి పలు విధాలుగా తెరపైకి వస్తోంది. ఓ రైతు తన భూమిని ఆన్ లైన్ చేయలేదన్న మనోవేదనతో కార్యాలయంలోనే గుండెపోటుతో మరణించాడు. ఇటీవల అధికారుల చుట్టూ తిరిగి తిరిగి విసిగిపోయిన ఓ మాజీ సర్పంచ్ ఏకంగా తహసీల్దార్ కార్యాలయంలో, అందరూ చూస్తుండగా గుమ్మానికి ఉరేసుకోబోయాడు. తమ గ్రామంలో పొలాలకు వెళ్లే దారిని కొందరు కబ్జా చేయడంతో పొలాలకు వెళ్లలేకపోతున్నామని ఎన్ని సార్లు చెప్పినా పట్టించుకోకపోవడంతో విసిగెత్తిన గోపాలప్ప మంగళవారం శాంతిపురం తహసీల్దార్ కార్యాలయానికి చేరుకున్నారు. అనంతరం గుమ్మానికి తాడు బిగించి ఆత్మహత్యకు యత్నించారు. దీంతో అక్కడున్న సిబ్బంది, అధికారులు గోపాలప్పను అడ్డుకుని విషయం కనుక్కున్నారు.
అవినీతిని సహించే ప్రశ్నే లేదన్న ఉపముఖ్యమంత్రి నారాయణ స్వామి
ఈ వ్యవహారాలు జిల్లాకు చెందిన మంత్రి నారాయణస్వామి దృష్టికి వెళ్లాయి. అవినీతి క్యాన్సర్ లాంటిదని ఎవరు అవినీతి చేసినా ఉపేక్షించేది లేదన్నారు. అయితే పట్టుబడుతున్న ఎమ్మర్వోలు.. ఇతరులపై కనీసం కేసులు కూడా పెట్టడం లేదు. సస్పెండ్ కూడా చేయడంలేదు. బదిలీ చేసి ఊరుకుంటున్నారు. దీంతో అవినీతి పరులైన అధికారులకు భయం లేకుండా పోయిందన్న విమర్శలు ఎదురవుతున్నాయి.