Saidabad: పోలీసులు చేతులెత్తేసిన కేసును ఛేదించిన సామాన్యుడు... భార్యను వెతికిపట్టుకున్న భర్త...
తన భార్య మిస్సింగ్ కేసు స్వయంగా ఛేదించాడో భర్త. మరో వ్యక్తి మాయమాటలు నమ్మి వెళ్లిపోయిన ఆమెను వెతికి పట్టుకున్నాడు. పోలీసులు ఏంచేయలేమని చేతులెత్తేసిన కేసులో సామాన్యుడు ఛేదించాడు.
పోలీసులు చేయలేని పనిని బాధితులే స్వయంగా రంగంలోకి దిగి పరిష్కరించుకున్నారు. ఈ సంఘటన సైదాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకుంది. మహిళ ట్రాప్ చేస విశాఖపట్నం తీసుకువెళ్లిన వ్యక్తిని పట్టుకొని హైదరాబాద్ కు తీసుకొచ్చారు. హైదరాబాద్ బాలాజీ గార్డెన్ కృష్ణానగర్ లో వివాహిత ముగ్గురు పిల్లలు భర్తతో కలిసి ఉంటోంది. హోటల్లో పనిచేసే దుర్గారావు అనే వ్యక్తి ఈ మహిళకు మాయమాటలు చెప్పి గత సంవత్సరం మే 9న తన వెంట తీసుకువెళ్లాడు. మహిళ భర్త నగరంలో వివిధ ప్రాంతాలలో వెతికినా ఫలితం లేకపోవడంతో మే 12న సైదాబాద్ పోలీసులను ఆశ్రయించాడు. తన భార్యను దుర్గారావు అనే వ్యక్తి మాయమాటలు చెప్పి తీసుకెళ్లాడని వెంటనే పట్టుకోవాలని ఫిర్యాదు చేశాడు. అప్పటి సైదాబాద్ పోలీస్ స్టేషన్ ఎస్సై సారంగపాణి దర్యాఫ్తు చేసి ఆచూకీ దొరక్కపోవడంతో ఫైల్ ను పెండింగ్ లో పెట్టారు.
భార్య కోసం స్వయంగా గాలింపు
పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగి తిరిగి అలసిపోయిన బాధితుడు.. పిల్లలు తల్లి కోసం తల్లడిల్లడం చూసి విసుగుచెంది కుటుంబ సభ్యుల సాయంతో భార్య కోసం గాలింపు మొదలుపెట్టారు. దుర్గారావు స్వగ్రామమైన పశ్చిమ గోదావరి జిల్లాకు శుక్రవారం బయలుదేరారు. అక్కడ వెతికినా ప్రయోజనం కనిపించలేదు. దుర్గారావు నడిపే వాహనం నెంబర్ బట్టి ఆ ప్రాంతానికి వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అక్కడికి వెళ్లిన తర్వాత ఈ బండి ఎక్కడైనా చలానాలు పడ్డాయా అని ఆరాతీశారు. దీంతో తీగలాగితే డొంక కదిలింది. అతను నడిపే వాహనానికి విశాఖపట్నంలో చలానాలు విధించినట్లు అది కంచర పాలెం పోలీస్ స్టేషన్ పరిధిలో నాలుగు చలానాలు పెండింగ్ లో ఉన్నట్లు తేలింది. దీంతో శనివారం నేరుగా విశాఖపట్నం చేరుకున్నారు. ఇక్కడ సైదాబాద్ పోలీసులు కంచరపాలెం పోలీసులతో మాట్లాడారు. వారి సహకారంతో ఆ ప్రాంతంలో వాహనం తిరుగుతున్నట్టుగా తేల్చి చెప్పారు. కంచరపాలెంలోని ఒక బిర్యానీ సెంటర్లో ఇక్కడి నుంచి పారిపోయిన దుర్గారావు ఆ వివాహిత పనిచేస్తున్నట్లుగా తేలింది.
Also Read: కొత్త పీఆర్సీపై రంగంలోకి వాలంటీర్లు... ప్రభుత్వ వాదనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని ఆదేశాలు
హైదరాబాద్ తరలింపు
శనివారం కావడంతో బిర్యానీ సెంటర్ తీయకపోవడంతో వాళ్ల ప్రయత్నం ఫలించలేదు. ఆదివారం ఉదయం ఆరు గంటలకే అక్కడకు చేరుకుని నిఘా పెట్టారు. దీంతో దుర్గారావు వాహనాన్ని తీసుకువచ్చి బిర్యాని సెంటర్ ముందు పార్క్ చేసి లోపలికి వెళ్లాడు. బిర్యానీ సెంటర్ నుంచి దుర్గారావు తిరిగి బయటకు వాహనం వద్దకు రాగానే వెంటనే వెళ్లి పట్టుకున్నారు. అదే బిర్యానీ సెంటర్ లో దుర్గారావుతో వచ్చిన మహిళ పనిచేస్తుండడంతో ఇరువురు పట్టుకొని కంచరపాలెం పోలీసు స్టేషన్ లో అప్పగించారు. అక్కడి పోలీసులు సైదాబాద్ పోలీసులతో మాట్లాడి వీరితో హామీ పత్రం రాయించుకొని ఇరువురినీ అప్పగించారు. ప్రస్తుతం వారిని సైదాబాద్ పోలీస్ స్టేషన్ కు తరలిస్తున్నారు. ఇక్కడ పోలీసులు వెంట లేనప్పటికీ బాధితులే రంగంలోకి దిగి మహిళ మిస్సింగ్ కేసును ఛేదించడం విశేషం.