Hindupur News : హిందూపురం వైసీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు, ప్రెస్ కబ్ల్ వద్ద ఉద్రిక్తత
Hindupur News : సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత నెలకొంది. వైసీపీ ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వర్గం, ప్రత్యర్థి వర్గం ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.
Hindupur News : సత్యసాయి జిల్లా హిందూపురంలో ఉద్రిక్తత నెలకొంది. హిందూపురం వైసీపీలో వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. స్థానిక వైసీపీ నేతలు రెండు వర్గాలుగా విడిపోయి పరస్పరం దాడులకు పాల్పడ్డారు. ఎమ్మెల్సీ మహమ్మద్ ఇక్బాల్ వ్యతిరేక వర్గం ప్రెస్ మీట్ ఏర్పాటు చేయడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రెస్ మీట్ ని అడ్డుకునే ప్రయత్నం చేశారు ఎమ్మెల్సీ ఇక్బాల్. ఎమ్మెల్సీ ఇక్బాల్ డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఇరు వర్గాలు పరస్పరం దాడులకు యత్నిస్తుండగా పోలీసులు వారిని అడ్డుకున్నారు. రండి తేల్చుకుందాం అంటూ వ్యతిరేక వర్గానికి ఎమ్మెల్సీ ఇక్బాల్ సవాల్ చేశారు. ఇరు వర్గాల నాయకులు, కార్యకర్తలు ప్రెస్ క్లబ్ కు భారీగా చేరుకున్నారు. ఎప్పుడు ఏం జరుగుతుందో అన్న టెన్షన్ వాతావరణం హిందూపూర్ లో నెలకొంది.
ఒకరిపై ఒకరు ఆరోపణలు, దాడులు
సత్యసాయి జిల్లా హిందూపురంలో వైసీపీలో వర్గ విభేదాలు రోజు రోజుకి పెరుగుతున్నాయి. ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్ వర్గం, ఎమ్మెల్సీ ప్రత్యర్థులు మరో వర్గంగా ఏర్పడి ఒకరిపై ఒకరు ఆరోపణలు చేసుకుంటూ ప్రెస్ మీట్లు ఏర్పాటు చేస్తున్నారు. హిందూపురం ఎమ్మెల్సీ వర్గం నిన్న పెట్టిన ప్రెస్ మీట్ కు ఖండించడానికి హిందూపురం రూరల్ ఎంపీపీ రత్నమ్మ స్థానిక ప్రెస్ క్లబ్ లో మీడియాతో మాట్లాడేందుకు ప్రయత్నించారు. పార్టీలో విభేదాలు ఉంటే పార్టీ పెద్దలతో మాట్లాడుకుందామని ఎమ్మెల్సీ వర్గీయులు వైసీపీ నాయకులు ఎంపీపీని వెనక్కి పంపారు. ఇదే సమయంలో ప్రెస్ క్లబ్ బయట అసమ్మతి వర్గానికి చెందిన వైసీపీ కౌన్సిలర్ ఐదో వార్డు కౌన్సిలర్ ఇర్షద్ అహ్మద్ ద్విచక్ర వాహనంలో వస్తున్న సందర్భంలో ఇరు వర్గాలు మాటమాట అనుకోవడంతో ఘర్షణ చెలరేగింది. దీంతో పోలీసులు అడ్డుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు.
ప్రెస్ క్లబ్ లోకి దూసుకొచ్చిన ఎమ్మెల్సీ అనుచరులు
ఎమ్మెల్సీ షేక్ మహమ్మద్ ఇక్బాల్, వైసీపీ సీనియర్ నేత కొండూరు వేణుగోపాల్‌రెడ్డి అనుచరుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఎమ్మెల్సీ అనుచరుల రౌడీయిజం, అక్రమాలు ఆపాలంటూ నియోజకవర్గంలోని 20 మందికి పైగా కౌన్సిలర్లు, ఎంపీపీలు, జడ్పీటీసీలు, సర్పంచ్‌లు ప్రెస్‌క్లబ్‌లో మీడియా సమావేశం నిర్వహించారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ ఇక్బాల్ వర్గీయులు ప్రెస్‌క్లబ్ లోకి దూసుకొచ్చారు. ఒక్కసారిగా రాళ్ల దాడి చేయడంతో పలువురు కార్యకర్తలకు గాయాలు అయ్యాయి. దీంతో కొద్దిసేపు తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. పోలీసులు ఎమ్మెల్సీ వర్గీయులను ప్రెస్‌క్లబ్ వద్ద నుంచి పంపించివేయడంతో పరిస్థితి చక్కబడింది.