Fake Notes: యూట్యూబ్ వీడియోల ద్వారా లెర్నింగ్ - శ్రీకాకుళం జిల్లాలో నకిలీ నోట్ల కలకలం, 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు
Andhra News: శ్రీకాకుళం జిల్లాలో ఫేక్ కరెన్సీ చెలామణి వ్యవహారం కలకలం రేపుతోంది. వేర్వేరు ప్రాంతాల్లో 2 ముఠాలను అరెస్ట్ చేసిన పోలీసులు దీనిపై మరింత లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Fake Notes Rocket Busted In Srikakulam: శ్రీకాకుళం జిల్లాలో (Srikakulam District) నకిలీ నోట్ల చెలామణీ కలకలం రేపింది. శుక్రవారం వేర్వేరు ప్రాంతాల్లో 2 ముఠాలను పోలీసులు అరెస్ట్ చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆంధ్రా - ఒడిశా సరిహద్దు మెళియాపుట్టి మండలం సంతలక్ష్మీపురం గ్రామానికి చెందిన తమ్మిరెడ్డి రవి వద్ద దాదాపు రూ.50 వేల ఫేక్ కరెన్సీ (Fake Currency) స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు తెలిపిన వివరాలతో పలాస, మెళియాపుట్టి, వజ్రపుకొత్తూరు మండలాలకు చెందిన కుసిరెడ్డి దుర్వాసులు, తమ్మిరెడ్డి ఢిల్లీరావు, దాసరి కుమారస్వామి, దాసరి రవికుమార్, దుమ్ము ధర్మారావులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.57.25 లక్షల నకిలీ నోట్లతో పాటు తయారీకి వినియోగించిన కలర్ ప్రింటర్, 4 సెల్ ఫోన్లు, స్కూటీని స్వాధీనం చేసుకున్నారు. యూట్యూబ్ వీడియోల ద్వారా నకిలీ నోట్ల తయారీని తెలుసుకోవడం సహా ఒడిశా నుంచి తెచ్చి చెలామణి చేయాలని చూసినట్లు వివరించారు.
పెనసాం కూడలి వద్ద..
మరోవైపు, నకిలీ నోట్లను బైక్‌పై తరలిస్తుండగా ఇద్దరిని జి.సిగడాం మండలం పెనసాం కూడలి వద్ద పట్టుకున్నట్లు సీఐ అవతారం తెలిపారు. ఎచ్చెర్ల మండలం కొత్తదిబ్బలపాలేనికి చెందిన గనగళ్ల రవి, లావేరు గ్రామవాసి రాజేశ్ కలిసి అడ్డదారిలో సంపాదించాలనే ఉద్దేశంతో ఒడిశాలోని పర్లాఖెముండి, గుణుపురం ప్రాంతాల నుంచి ఫేక్ నోట్స్ తెచ్చి చెలామణి చేశారు. నిందితులను పట్టుకున్న పోలీసులు వీరు ఇచ్చిన సమాచారంతో ఈ ముఠా వెనుక ఉన్న సూత్రధారులు ఎవరన్న దానిపై కూపీలాగే పనిలో ఉన్నారు. ఉభయ గోదావరి జిల్లాలకు లావేరు ఎస్ఐ లక్ష్మణ రావు ఆధ్వర్యంలో బృందం వెళ్లినట్టు విశ్వసనీయంగా తెలిసింది. దీని వెనుక ఉన్న మొత్తం మాఫియాను కూకటివేళ్లతో సహ పెకిళించాలని ఎస్పీ మహేశ్వరరెడ్డి భావిస్తున్నట్టు సమాచారం. ఈ కేసును ఆయన ప్రత్యేకంగా పర్యవేక్షిస్తూ ఎప్పటికప్పుడు దర్యాప్తు వివరాలను అడిగి తెలుసుకుంటున్నారు.
రాజేష్ మిత్రులతో పాటు నగరానికి చెందిన ఓ రౌడీ షీటర్ ప్రమేయం కూడా ఈ వ్యవహారంలో కీలకమని ఆయన పోలీసులకు సమాచారం ఇచ్చాడన్న ప్రచారం సాగుతోంది. అయితే ఇంటెలిజెన్స్ వర్గాలు దీనిపై కొంత డేటాను సేకరించి ఉన్నతాధికారులకు ఇప్పటికే నివేదికను అందించాయట. సాంకేతిక ఆధారంగా పోలీసులు మరో కోణంలో కూడా దర్యాప్తును వేగవంతం చేశారు. రాజేష్, రవిలకు ఈ నకిలీ నోట్లు ఎక్కడి నుంచి వచ్చాయి, అవి తీసుకునేటప్పుడు వీరితో ఇంకెవరెవరు ఉన్నారు, ఎవరికి ఈ నకిలీ నోట్లను ఇవ్వాలని భావిస్తున్నారన్న కోణాల్లో పోలీసు దర్యాప్తు ముందుకెళుతోంది.
అనేక ఆరోపణలు..
జర్నలిస్ట్‌గా చెలామనీ అవుతున్న ఎన్ని రాజేష్‌పై అనేక ఆరోపణలున్నాయి. నగర పరిధిలో ఎక్కడ భవన నిర్మాణాలు ప్రారంభమైనా రాజేష్‌తో పాటు మరికొందరు జర్నలిస్టులు అక్కడ వాలిపోయి బిల్డింగ్ ఇన్‌స్పెక్టర్ల అవతారం ఎత్తేస్తారట. టౌన్ ప్లానింగ్ అధికారుల మాదిరిగా భవన యజమానులను భయపెట్టి ముక్కు పిండి మరీ సొమ్ములు లాక్కుంటారని సమాచారం. తాము డిమాండ్ చేసినంత ఇవ్వకుంటే టౌన్ ప్లానింగ్ అధికారులకు రాజేష్ ముఠా ఫిర్యాదు చేసి భవన నిర్మాణం ముందుకు కదలకుండా అడ్డుపడతారట. నగరంలో వీరి బాధితులు కోకొల్లలు. అయితే బెదిరింపులు, బ్లాక్ మెయిలింగ్‌తో పాటు దొంగ నోట్లను కూడా రాజేష్ చెలామణీ చేస్తూ పోలీసులకు పట్టుబడటంపై నగరంలో పెద్ద చర్చ నడుస్తోంది.
Also Read: CM Ramesh: ఉపాధి పేరుతో విదేశాల్లో మోసపోయిన యువత విషయంలో కేంద్రం ఏ చర్యలు తీసుకుంటోంది?