Chittor Visaranai : చేయని నేరం ఒప్పుకోవాలని దళిత మహిళకు చిత్రహింసలు - చిత్తూరులో మరో "విశారణై" , జై భీమ్ తరహా ఘటన
" విశారణై" , జై భీమ్ లాంటిలు ఎన్ని వస్తున్నా... నేరం ఒప్పుకోవాలని అమాయకులపై పోలీసులు పెట్టే చిత్రహింసలు మాత్రం ఆగడం లేదు. జైలర్ ఇంట్లో డబ్బులు దొంగతనం చేశావని ఒప్పుకోవాలని నడవలేని రీతిలో కొట్టారు. కానీ ఆమె నేరం చేయలేదని తేలింది.
చేయని నేరం ఒప్పుకోవాలని పోలీసులు చిత్ర హింసలు పెడితే ఎవరికైనా ఎలా ఉంటుంది ? . ఆ బాధలు తట్టుకోలేక అంగీకరించాలని అనిపిస్తుంది. అది పోలీసులకూ తెలుసు. అందుకే వారు నిందితులపై అదే ప్రయోగం చేస్తారు. అనేక కేసుల్లో ఏ తప్పూచేయని వారిని తీసుకొచ్చి ఇలా చిత్రహింసలు పెట్టి నేరం అంగీకరింపచేశారనే ఆరోపణలు వస్తూనే ఉన్నాయి. అలాంటివి సంచలనం అవుతూనే ఉ్నాయి. పోలీసులపై విమర్శలు పెరుగుతూనే ఉన్నాయి. వారి తీరుపై "విశారణై" , జై భీమ్ లాంటి సినిమాలు వస్తూనే ఉన్నాయి. కానీ పోలీసుల తీరు మాత్రం మారడం లేదు. దానికి చిత్తూరు జిల్లాలో ఓ దళిత మహిళపై వారు చూపిన కాఠిన్యమే సాక్ష్యం.
Also Read: బాయ్ ఫ్రెండ్‌తో కలిసి యువతి షికారు.. ఆకతాయిల ఎంట్రీతో కథలో ట్విస్ట్...
చిత్తూరు జైలు సూపరింటెండెంట్ వేణుగోపాల్ రెడ్డి ఇంట్లో ఇటీవల రూ.2 లక్షలు చోరీ అయింది. ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశారు. తమకు పని నిమిషిపైనే అనుమానం ఉందన్నారు. పోలీసులు వచ్చి ఇంట్లో పని చేసే ఉమామహేశ్వరిని కనీస విచారణ చేయకుండా తీసుకెళ్లిపోయారు. మహిళ అని చూడకుండా ధర్డ్ డిగ్రీ ప్రయోగించారు. ఆమె ఇంట్లో సోదాలు చేశారు. కానీ ఎక్కడా సొత్తు దొరకలేదు. ఈ లోపు క్లూస్ టీం జైలర్ ఇంట్లో ఆధారాలు సేకరించింది. అక్కడ వేలి ముద్రలు దొరికాయి. కానీ అవి ఉమా మహేశ్వరివి కావని తేలింది.
దీంతో పోలీసులు నాలిక కరుచుకున్నారు. దొంగ ఆమె కాదని నిర్ధారణ అయింది. కానీ అప్పటికే ఆమెను అత్యంత దారుణంగా హింసించారు. కానీ ఏ మాత్రం ప్రాయశ్చిత్తం లేకుండా పోలీసులు ఆస్పత్రి ఖర్చులు ఇస్తాం... తాము ఇలా కొట్టామని ఎవరికైనా చెబితే ఏం జరుగుతుందో తెలుసుగా అని హెచ్చరించి పంపించారు. కానీ తనకు జరిగిన అన్యాయాన్ని ఆమె మీడియాకు చెప్పుకున్నారు. ఇప్పుడు ఆమె నడవలేని పరిస్థితుల్లో ఉన్నారు.
Also Read: ఈ చదువులు వద్దు.. ఒత్తిడి తట్టుకోలేక బీటెక్ స్టూడెంట్ ఆత్మహత్య, సూసైడ్ నోట్‌లో ఏముందంటే..!
ఈ విషయం బయటకు చెప్పినందుకు పోలీసులు మళ్లీ తనను హింసిస్తారని భయపడుతున్నా.. తనలాగా మరొకరికి అన్యాయం జరగకూడదన్న ఉద్దేశంతో ఆమె మీడియా ముందు చెప్పుకున్నారు. ఈ ఘటనపై ఆమె తనకు న్యాయం చేయాలని కోరుతున్నారు. ఉమామహేశ్వరి ఆరోపణలపై పోలీసులు ఇంకా స్పందించలేదు.