Bus Accidents: ఏపీలో బస్సు ప్రమాదాలు - పంట పొలాల్లోకి దూసుకెళ్లిన లగ్జరీ బస్సు, ప్రయాణికులు సేఫ్
Andhra News: కృష్ణా జిల్లా తోట్లవల్లూరులో ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. ఐలూరు సమీపంలో అదుపు తప్పి కరకట్టపై నుంచి పంట పొలాల్లోకి దూసుకెళ్లింది.
Bus Accident In Krishna District: ఏపీలో ఆదివారం వరుస బస్సు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. అదృష్టవశాత్తు ప్రయాణికులు ఎలాంటి ప్రమాదం జరగలేదు. కృష్ణా జిల్లా తోట్లవల్లూరులోని ఆర్టీసీ బస్సుకు పెను ప్రమాదం తప్పింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. కృష్ణా ఎడమ కరకట్టపై నుంచి సూపర్ లగ్జరీ బస్సు అదుపు తప్పి పంట పొలాల్లోకి దూసుకెళ్లిన ఘటన ఐలూరు గ్రామ పరిధిలో జరిగింది. అవనిగడ్డ నుంచి విజయవాడ వెళ్తున్న సూపర్ లగ్జరీ బస్సు ఐలూరు గ్రామ సమీపంలో రోడ్డుపై గుంతలు ఉండడంతో అదుపు తప్పింది. కరకట్ట మీద నుంచి పెద్ద చెట్టును ఢీకొని.. పంట పొలాల్లోకి దూసుకెళ్లి ఆగింది. ప్రమాద సమయంలో బస్సులో 37 మంది ప్రయాణికులు ఉన్నారు. బస్సు ముందు భాగం పాక్షికంగా దెబ్బతింది.
బస్సు చెట్టును ఢీకొని పెద్ద శబ్ధం రాగా.. అక్కడ పొలాల్లో పని చేస్తోన్న రైతులు, కూలీలు వెంటనే బస్సు వద్దకు పరిగెత్తుకుని వచ్చి సహాయక చర్యలు చేపట్టారు. ప్రయాణికులకు స్వల్ప గాయాలు మినహా ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు. సమాచారం అందుకున్న ఎస్సై అర్జునరాజు తన సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రయాణికులను మరో బస్సులో విజయవాడకు పంపించారు. దీనిపై విచారణ చేస్తున్నారు.
మరో ప్రమాదం
మరోవైపు, ప.గో జిల్లా పెంటపాడు మండలం ముదునూరు వద్ద పల్లె వెలుగు బస్సు ఆదివారం ప్రమాదానికి గురైంది. బస్సు స్టీరింగ్‌లో సమస్య తలెత్తి ప్రమాదం జరిగిందని డ్రైవర్ తెలిపారు. ప్రమాదం సమయంలో బస్సులో 25 మంది ప్రయాణికులు ఉండగా.. ఎవరికీ ఎలాంటి అపాయం జరగలేదు. లేడీ కండక్టర్‌తో పాటు ఓ ప్రయాణికునికి స్వల్ప గాయాలయ్యాయి.