Crime News: మద్యం సీసా చెప్పిన సాక్ష్యం - 20 నెలల అనంతరం నిందితుడిని పట్టించింది, అసలు కథ ఏంటంటే?
Telangana News: పగిలిన మద్యం సీసా 20 నెలల క్రితం జరిగిన మహిళ హత్య కేసులో నిందితున్ని పట్టించింది. వేలిముద్రల ఆధారంగా రెండు కేసుల్లో నిందితుడు ఒకడే అని పోలీసులు నిర్ధారించారు.
Beer Bottle Key Evidence In Murder Case: మద్యం సీసా ఓ నిందితున్ని పట్టించింది. 20 నెలల క్రితం జరిగిన ఓ మహిళ మర్డర్ కేసును పగిలిన మద్యం సీసాపై దొరికిన వేలిముద్రల ఆధారంగా పోలీసులు ఛేదించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నగర శివారు కందుకూరు (Kandukuru) పోలీస్ స్టేషన్ పరిధిలో ఈ నెల 15న జరిగిన వృద్ధ దంపతుల జంట హత్యల కేసును ఇటీవలే రాచకొండ పోలీసులు ఛేదించి నిందితుడిని అరెస్ట్ చేశారు. నాగర్ కర్నూల్ జిల్లా పెద్దకొత్తపల్లి మండలం ముష్టిపల్లికి చెందిన మూగ (చింతబాయి) ఉషయ్య (70), అతని భార్య శాంతమ్మ (60).. రంగారెడ్డి జిల్లా కందుకూరు ఠాణా పరిధిలోని కొత్తగూడ సమీపంలో వారి స్వగ్రామానికి చెందిన మనోహరరావుకు చెందిన వ్యవసాయ క్షేత్రంలో రెండున్నరేళ్లుగా కాపలాదారులుగా పని చేస్తున్నారు. మామిడి తోటలో ఓ పక్కన షెడ్లతో పాటు నిర్మించిన గదుల్లో వీరు నివాసం ఉంటున్నారు. వీరిని మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దారుణంగా నరికి చంపారు. శాంతమ్మను మంచంపై గొంతు కోసి హత్య చేయగా.. ఉషయ్యను వారు నివాసం ఉంటోన్న వంద మీటర్ల దూరంలో మామిడి తోటలో పరుగెత్తించి మెడ భాగంపై నరికి చంపారు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు అన్ని కోణాల్లో విచారించి నిందితున్ని అదుపులోకి తీసుకున్నారు.
20 నెలల క్రితం మహిళ మర్డర్ కేసులో..
ఈ కేసులో నిందితుని గురించి పూర్తి స్థాయిలో విచారిస్తుండగా.. ఏడాదిన్నరగా పెండింగ్‌లో ఉన్న మహిళ మర్డర్ కేసుకు సంబంధించి కీలక ఆధారం పోలీసులకు లభ్యమైంది. దీని ఆధారంగా ఆ హత్య చేసింది కూడా ఇతనేనని పోలీసులు గుర్తించారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని నెల్లూరు జిల్లా ఓజిలి మండలానికి చెందిన చెంచు శైలజారెడ్డి (42), భర్త కృష్ణారెడ్డి తన ఇద్దరు పిల్లలతో కలిసి 2011లో రంగారెడ్డి జిల్లాలోని (Rangareddy) కందుకూరుకు వచ్చి దాసర్లపల్లిలో అరుణ్ ఫామ్ హౌస్‌లో పని చేస్తున్నారు. అయితే, 2023 మార్చి 3న కృష్ణారెడ్డి, పిల్లలు బయటకు వెళ్లగా.. శైలజారెడ్డి ఒక్కరే ఇంట్లో ఉన్నారు. అప్పటికే ఆమెపై కన్నేసిన దాసర్లపల్లికి చెందిన ఉప్పుల శివకుమార్.. ఫాం హౌస్‌కు వెళ్లి ఆమెను బలవంతం చేయబోయాడు. దీంతో ఆమె ఎదురు తిరిగింది. ఈ క్రమంలోనే మహిళను కత్తితో నరికి చంపాడు.
మద్యం సీసా పట్టించింది
మహిళను చంపేసిన అనంతరం అక్కడే మద్యం సీసా కనిపించగా తాగేందుకు యత్నించాడు. ఈ క్రమంలో సీసా కింద పడి పగిలిపోయింది. దానిపై నిందితుడి వేలిముద్రలు పడ్డాయి. అనంతరం అక్కడి నుంచి నిందితుడు పరారు కాగా.. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులకు సీసాపై వేలిముద్రలు తప్ప ఎలాంటి ఆధారాలు లభించలేదు. ఈ క్రమంలోనే వాటిని భద్రపరచగా.. ఇప్పటికీ పోలీసులకు చిక్కాడు. తాజాగా, కొత్తగూడలో జరిగిన వృద్ధ దంపతుల హత్య కేసులో శివకుమారే నిందితుడని పోలీసులు ఆధారాలతో సహా గుర్తించారు. 20 నెలల క్రితం జరిగిన మహిళ శైలజారెడ్డి మర్డర్ కేసులోనూ నమోదైన వేలిముద్రలతో నిందితుని వేలిముద్రలు సరిపోలగా.. 2 కేసుల్లోనూ నిందితుడు ఒకడే అని పోలీసులు తేల్చారు.
Also Read: Strange Incident: కొంప ముంచిన కోతి - అరటి పండు ఇస్తే కింద పడేసింది, సీన్ కట్ చేస్తే!