AP News : కూతురు కనిపించట్లేదని పీఎస్ కు వెళ్తే, చావమని సలహా ఇచ్చి మహిళా ఎస్సై!
SI Varalaxmi Issue: కూతురు కనిపించడం లేదంటూ స్థానిక పీఎస్ కు వెళ్లారు తల్లిదండ్రులు. త్వరగా తమ కూతురు వెతికిపెట్టమంటూ అక్కడి మహిళా ఎస్సైను కోరారు. భరోసా ఇవ్వాల్సిన ఆమె చావమంటూ సలహా ఇచ్చింది.
SI Varalaxmi Issue: వారి కూతురు కనిపించకుండా పోయింది. ఏం చేయాలో పాలుపోని వాళ్లు బంధువులు, స్నేహితులందరికీ చెప్పి వెతికారు. అయినా లాభం లేకపోవడంతో స్థానిక పీఎస్ కు వెళ్లారు. అక్కడున్న మహిళా ఎస్సైను చూసి తమకెలాగైనా సాయం చేస్తుందనుకున్నారు. బాధనంతా చెప్పి త్వరగా తమ కూతురి జాడను కనుక్కోవాలని కోరారు. అదే ఆమెకు కోపాన్ని కల్గించింది. అధికారి అన్న అహంతో బూతులు మాట్లాడుతూ.. రచ్చ రచ్చ చేసింది. అది ఎవడితో పోయిందో మీరే వెతుక్కోమని చెప్పింది. ఇదేంటని ప్రశ్నిస్తే.. ఎక్కడికైనా వెళ్లి పురుగుల మందు కాగి చావమంటూ ఆ తల్లిదండ్రులు ఓ సలహా కూడా ఇచ్చింది. అసలే కూతురు కనిపించడం లేదనే బాధలో ఉన్న తమతో పోలీసు అధికారిణి ఇలా మాట్లాడడం తట్టుకోలేక కన్నీరుమున్నీరవుతున్నారు. ఏం చేయాలంటూ అధికారులను ప్రశ్నిస్తున్నారు.
అసలేం జరిగిందంటే..?
శ్రీసత్య సాయి జిల్లా నల్ల చెరువు ఎస్సై వరలక్ష్మీ... ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారితో దురుసుగా ప్రవర్తించింది. దీంతో ఆ కుంటుంబ సభ్యులు అంతులేని ఆవేదనను అనుభవిస్తున్నారు. తమ కూతురు కనిపించడం లేదు అని ఫిర్యాదు చేసేందుకు వచ్చిన వారిని నోటికి వచ్చినట్లు తిట్టింది. సాటి మహిళ అని కూడా చూడకుండా బూతులు తిడ్తూ నరకం చూపించింది. నువ్వు ఎవరితో పోయావో.. నీ కూతురు ఎవడితో పోయిందో నాకెలా తెల్సంటూ బాధితులపై తిట్ల దాడి చేసింది. నీ కూతురు కనిపించకపోతే మమ్మల్ని ఏం చేయమంటావ్ అని ఎస్సై వరలక్ష్మి అన్నట్లు బాధిత మహిళ చెబుతోంది. మీరిద్దరూ వెళ్లి విషం తాగి చావండంటూ బెదిరిస్తోందని దంపతులు విలపిస్తున్నారు. తమ కూతురు కనిపించడం లేదని ఆరు నెలల క్రితం ఫిర్యాదు చేశామని.. ఇప్పటికీ పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
గతంలోనూ ఎస్సై వరలక్ష్మిపై ఆరోపణలు..!
తమ కూతురు జాడను తెలుసుకునేందుకు తామే స్వయంగా లక్షల రూపాయలు ఖర్చు చేశామని.. అయినా ఎక్కడుందో తెలయలేదని కన్నీటి పర్యంతం అయ్యారు. అసలు బతికి ఉందో లేదో కూడా సమాచారం లేదంటూ ఆవేదన చెందుతున్నారు. అయితే నల్ల చెరువు ఎస్సై వరలక్ష్మిపై గతంలోనూ అనేక ఆరోపణలు వచ్చాయి. ఇప్పుడు, బాలిక మిస్సింగ్ కేసులోనూ ఎస్సై వరలక్ష్మిపై ఆరోపణలు వస్తున్నాయి. పైగా బాధితులతో మాట్లాడిన ఆడియో రికార్డింగ్ ను ఎస్సై తన ఫన్ నుంచే సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం గమనార్హం.
ఎస్సై వరలక్ష్మిని విధుల నుంచి తొలగించాలి..!
ఈ విషయం తెలిసన వాళ్లతో పాటు, ఆడియో విన్న ప్రతీ ఒక్కరూ మహిళా ఎస్సై వరలక్ష్మిని విధుల్లోంచి తొలగించాలని కోరుతున్నారు. భాదితుల నుంచి ఫిర్యాదు తీస్కొని వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. అమ్మాయి కనిపించడం లేదని ఫిర్యాదు చేసి ఆరు నెలలు అయినా స్పందించకపోవడం ఏంటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అదృశ్యం అయిన అమ్మాయిపై ఏమైనా అఘాయిత్యం జరిగినా, ఆమెకు మరేం జరిగినా ఊరుకునేది లేదంటూ బాధితుల బంధువులు చెబుతున్నారు.