AP News : విహార యాత్రలో విషాదం, వాగులో ముగ్గురు విద్యార్థినులు గల్లంతు
AP News : అల్లూరి జిల్లా విషాద ఘటన చోటుచేసుకుంది. విహార యాత్రకు వచ్చిన ముగ్గురు విద్యార్థినులు వాగులో గల్లంతయ్యారు.
AP News : అల్లూరి సీతారామరాజు జిల్లాలో విషాద యాత్ర విషాదం నింపింది. చింతూరు మండలం సోకిలేరు వ్యూ పాయింట్ వద్ద ముగ్గురు విద్యార్థినులు వాగులో గల్లంతయ్యారు. స్నానం చేస్తూ 10వ తరగతి చదువుతున్న ముగ్గురు విద్యార్థినులు గల్లంతయ్యారు. బాపట్ల జిల్లా చీరాలలోని ఓ ప్రైవేట్ పాఠశాల నుంచి విద్యార్థులు విహార యాత్రకు వచ్చినట్లు తెలుస్తోంది. గల్లంతైన విద్యార్థినులో గుమ్మడి జయశ్రీ, సువర్ణ కమల, గీతాంజలి ఉన్నారు. వీరిలో ఇద్దరు విద్యార్థినుల మృత దేహాలు లభ్యమయ్యాయి. 26 మంది విహార యాత్రకు వచ్చినట్లు సమాచారం. మరొకరి మృతదేహం కోసం చింతూరు పోలీసులు గాలిస్తున్నారు.
తల్లిదండ్రుల ఆందోళన
బాపట్ల జిల్లా వేటపాలెంలో విషాదం నెలకొంది. వేటపాలెంలోని ఓ ప్రైవేట్ హైస్కూల్ లో 10వ తరగతి చదువుతున్న 20 మంది విద్యార్దులు భద్రచలం, అరకు విహరయాత్రకు స్కూల్ యాజమాన్యం తీసుకువెళ్లింది. అయితే భద్రచలానికి 50 కిలోమీటర్ల దూరంలోని అల్లూరి జిల్లా చింతూరు సోకిలేరు వాగులో విహారయాత్రకు వెళ్లిన ముగ్గురు బాలికలు గల్లంతైయ్యారు. గల్లంతైన వారిలో ఇద్దరి విద్యార్థునుల మృతదేహాలు లభ్యమయ్యాయి. మరొక విద్యార్థిని ఆచూకీ లభ్యం కాలేదు. విద్యార్థిని కోసం గాలింపు చర్యలు చేపట్టారు. గల్లంతైన విద్యార్థినులు గుమ్మడి జయశ్రీ(14), సువర్ణ కమల(14), గీతాంజలిగా గుర్తించారు. తల్లిదండ్రులకు స్కూల్ యాజమన్యం ప్రమాద ఘటన సమాచారం తెలపకపోవడంతో బాలికల కుటుంబసభ్యులు స్కూల్ యాజమాన్యం ఇంటి వద్ద ఆందోళనకు దిగారు. స్కూల్ యాజమాన్యాన్ని నిలదీశారు. దీంతో కొద్దిసేపు ఉద్రికత్త చోటుచేసుకుంది. తమ పిల్లలు ప్రమాదవశాత్తు చనిపోయిన సంఘటనను తమకు స్కూల్ యాజమాన్యం తెలపలేదని మీడియాలో వార్తలు చూస్తే తమకి తెలిసిందన్నారు. నిర్లక్ష్యంగా వ్యవహరించిన స్కూల్ యాజమన్యంపై చర్యలు తీసుకోవాలని బాధిత కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు.
స్నానానికి దిగి తాతా మనవడు మృతి
విజయనగరం జిల్లా లచ్చరాయిపురం గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. చెరువులో స్నానానికి దిగిన తాతా, మనవళ్లు చెరువులో మునిగిపోయారు. స్నానానికి వెళ్లినవారు ఎంతసేపటికీ ఇంటికి రాకపోవడంతో స్థానికులు చెరువులో గాలించారు. దీంతో తాతా మనవళ్ల మృతదేహాలు దొరికాయి. లచ్చరాయిపురం గ్రామానికి చెందిన బోర రాము, బోర గౌతం తాతామనవళ్లు భవాని మాలవేసుకున్నారు. గ్రామానికి సమీపంలోని చెరువులో స్నానం చేసేందుకు తాతామనవడు వెళ్లారు. చెరువు లోతుగా ఉండటంతో స్నానానికి దిగిన ఇద్దరూ గల్లంతయ్యారు. స్నానానికి వెళ్లినవారు తిరిగి రాకపోవటంతో తోటి వారు, స్థానికుల సాయంతో చెరువులో గాలించారు. దీంతో వారిద్దరి మృతదేహాలు లభించాయి. తాతామనవళ్ల మృతితో గ్రామంలో విషాదం అలుముకుంది. ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతం అయ్యారు. మృతదేహాలను పోస్టుమార్టం కోసం రాజాం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు పోలీసులు.
షాద్ నగర్ లో విషాదం
రంగారెడ్డి జిల్లాలోని షాద్‌నగర్ లో విషాదం చోటుచేసుకుంది. మున్సిపాలిటీలోని సోలిపూర్‌లోని ఓ నీటిగుంటలో పడి ముగ్గురు చిన్నారులు మృతి చెందారు. గ్రామానికి చెందిన అక్షిత్ గౌడ్, ఫరీద్, పర్వీన్ చేపలు పట్టేందుకు నీటి గుంటలోకి దిగారు. నీటి గుంట లోతు ఎక్కువగా ఉండటంతో ముగ్గురు చిన్నారులు అందులో మునిగిపోయారు. స్థానికులు వారి మృతదేహాలను బయటకు తీశారు. అప్పటివరకు కళ్లముందే ఆడుకున్న చిన్నారులు విగతజీవులుగా మారడంతో తల్లిదండ్రులు విలపిస్తున్నారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : Student Commits Suicide : శివుడు పిలుస్తున్నాడని యువకుడు ఆత్మహత్య, మళ్లీ పుడతా అంటూ సూసైడ్ నోట్!
Also Read : Loan App Racket: సరికొత్త పంథాలో లోన్ యాప్ చీటర్స్, అలాంటి ఫోన్ కాల్స్ తో జాగ్రత్త సుమీ!