IPL 2025: ఐపీఎల్కు సెలక్ట్ అయిన సిక్కోలు కుర్రాడు, టాలెంట్ ఉంటే ఆసాధ్యం అనేదే ఉండదు
Srikakulam News | టెక్కలికి చెందిన త్రిపురాన విజయ్ ఐపీఎల్ కు సెలెక్ట్ అయ్యాడు. కేంద్ర, రాష్ట్ర మంత్రులు రామ్మోహన్ నాయుడు, అచ్చెన్నాయుడు సైతం విజయ్ ఎంపికపై హర్షం వ్యక్తం చేశారు.
IPL Mega Auction 2025 | చిన్నతనం నుంచి క్రికెట్ అంటే ప్రాణం పెట్టి సత్తాచాటుతూ వస్తున్న టెక్కలికి చెందిన త్రిపురాన ఐపీఎల్ 2025 మెగా వేలంలో సెలక్టు అయ్యాడు. సరైన మైదానం లేదంటూ ఆటగాళ్లు కలవరపడుతున్న తరుణంలో ఐపీఎల్ కు సెలక్టు కావడం మామూలు విషయం కాదని తోటి స్నేహితులు అంటున్నారు. వేలంలో రూ.30 లక్షల బేస్ ప్రైజ్ కి ఢిల్లీ క్యాపిటల్స్ (Delhi Capitals) జట్టు కొనుగోలు చేసింది. తెలుగు రాష్ట్రాల నుంచి ఐపీఎల్ కు ఎంపికైన అతికొద్ది మందిలో విజయ్ ఒకడు.
విజయ్ ఫ్యామిలీ వివరాలు
గ్రామీణ ప్రాంతం నుంచి ఐపీఎల్‌కు విజయ్ సెలెక్ట్ కావడం వెనుక అతడి కఠోర శ్రమ అంతా ఇంతా కాదు. ఎలాంటి నేపథ్యం లేకున్నా తనకున్న సత్తా, తల్లితండ్రులు ప్రోత్సాహంతో ఈ స్టేజీకి వచ్చాడు. టెక్కలి అయ్యప్పనగర్లో నివాసం ఉంటున్న త్రిపురాన వెంకట కృష్ణరాజు, లావణ్యల కుమారుడే విజయ్. విజయ్ తండ్రి కృష్ణరాజు సమాచార శాఖలో ఉద్యోగిగా పనిచేస్తుండగా, తల్లి లావణ్య గృహిణి. టెక్కలి డిగ్రీ కాలేజీలో ప్రథమ సంవత్సరం చదువుతున్న విజయ్ చిన్నప్పటి నుంచి క్రికెట్ అంటే మక్కువతో లోకల్ బ్యాచ్లో కలిసి ముందుకు వెళ్లాడు. పదేళ్లుగా ఆటలో నిమగ్నమైన విజయ్ అంతర్ జిల్లాల నార్త్ జోన్ అండర్-14 జట్టుకి ప్రాతినిథ్యం వహించి సత్తా చాటాడు. అనంతరం కడపలోకి క్రికెట్ అకాడమీకి ఎంపికయ్యాడు. టాప్ ఆర్డర్ బ్యాటర్‌గానే కాకుండా ఆఫ్ స్పిన్ బౌలర్‌గానూ విజయ్ రాణిస్తున్నాడు.
వేలంలో తీసుకున్న ఢిల్లీ క్యాపిటల్స్
ఢిల్లీ క్యాపిటల్స్ తరఫున ఐపీఎల్లో ఆడనున్న త్రిపురాన విజయ్ సక్సెస్ వెనుక జిల్లా క్రికెట్ సంఘం, కోచ్లు, మెంటార్లు చేసిన కృషి ఒక్కసారి గుర్తుచేసుకోవాలి. టెక్కలికి చెందిన డిగ్రీ ఫస్టియర్ విద్యార్థి త్రిపురాన విజయ్‌ని వేలంలో ఢిల్లీ కేపిటల్స్ ఫ్రాంచైజీ రూ.30 లక్షలకు కొనుగోలు చేసింది. ఈ యువకుడు ఎప్పటికైనా దేశం తరఫున ఆడతాడన్న నమ్మకం మొదట కలిగింది జిల్లా క్రికెట్ సంఘానికే. జిల్లాలో క్రికెట్ కు ప్రాధాన్యం, సహకారం లేని సమయంలో విజయ్ లాంటి ఒక ప్లేయర్ను తయారుచేసి ఐపీఎల్‌కు పంపడమంటే చిన్న విషయం కాదు.
క్రికెట్లో ఆల్ రౌండ్ ప్రతిభ
క్రికెట్లో ఆల్ రౌండర్ ప్రతిభ కనబరుస్తున్న విజయ్ నిలకడగానే ముందుకు సాగాడు. 2022-23, 2024-25 ధపాలు రంజీ పోటీల్లో పాల్గొని ఆంధ్ర జట్టుకి ఎంపికయ్యాడు. అండర్-19 విభాగంలో ఏసిఏ నార్త్ జోన్ పోటీలలో రాణించి ఉత్తమ ఆల్ రౌండర్ గుర్తింపు పొందాడు. అప్పుడే విజయ్ పై అందరి దృష్టి మళ్లింది. అంతర్ రాష్ట్ర అండర్-25 వన్డే క్రికెట్ టోర్నీలోను రాణించడంతో సెలక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. 2021-22 అంతరాష్ట్ర అండర్ -23 క్రికెట్ టోర్నీలో రాణించి బీసీసీఐ బెంగుళూరులో నిర్వహిస్తున్న నేషనల్ క్రికెట్ అకాడమీ (National Cricket Academy)కి ఎంపికవ్వడంతో శిక్షణ ఇచ్చారు. ఆంధ్ర ప్రీయర్ లీగ్ (ఏపిఎల్) టీ-20 క్రికెట్ పోటీలలోని మూడు సీజన్లలో రాణించి విజయ్ ప్లేయర్ నిలిచారు. తదుపరి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును అందుకున్నాడు..
స్టేడియం లేని శ్రీకాకుళం ప్రాంతం నుంచి వచ్చి అంతర్జాతీయ ఆటగాళ్లు సైతం పాల్గొనే ఐపీఎల్ క్రికెట్ కు సెలక్ట్ కావడం గొప్ప మైలురాయి. జిల్లా క్రికెట్ సంఘంపై ఆధిపత్యానికి కోర్టుల్లో సుదీర్ఘ కాలం కేసు నడిచిన తర్వాత ఏడేళ్లు కిందా మీదా పడిన తర్వాత 2023 ఏప్రిల్లో అంబుడ్స్మన్ ద్వారా ప్రస్తుతం ఉన్న క్రికెట్ సంఘం చేతికి పగ్గాలు వచ్చాయి. కానీ ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (Andhra Cricket Association) నుంచి 2024 ఏప్రిల్ వరకు నిధులు విడుదల కాలేదు. కానీ జిల్లాలో ఎంతో మంది క్రికెటర్లు ఉన్నారని, వారి భవిష్యత్తు కోసం ఏదో చేయాలన్న తపనతో 2023లోనే జిల్లా క్రికెట్ సంఘం సీనియర్స్, అండర్ 23, అండర్19, అండర్16 కోసం ఎంపికలు నిర్వహించింది.
ప్రాక్టీస్ కోసం నిధులు లేకున్నా..
వీరందరికీ శిక్షణ ఇప్పించడం కోసం కళింగపట్నం, టెక్కలి తీసుకువెళ్లి ఆటలో మెళకువలు నేర్పించడానికి ఒక్కో సెలక్షన్కు రూ.1.25 లక్షలు ఖర్చవుతుంది. అప్పటికే ఏసీఏ నుంచి నిధులు రాకపోవడంతో జిల్లా క్రికెట్ సంఘంలో ట్రెజరర్గా ఉన్న మదీనా సైలానీ తన పలుకుబడిని ఉపయోగించి భోజనాలు, డ్రింక్స్, అల్పాహారం వంటివి అప్పుచేసి తెచ్చి నిధులు సమకూర్చేవారు. జిల్లా దాటితే అయ్యే ఖర్చులు భరించడంతో పాటు వీరందర్నీ రాష్ట్రస్థాయిలో బెస్ట్ ప్లేయర్లుగాతీర్చిదిద్దడం కోసం ఎక్కడెక్కడో ఉన్నా ఒక్కచోటకు చేరి శిక్షణను అందించారు. ఇందులో కె.రవిచలం ఒకప్పటి సినీహీరో, కమ్ కేరక్టర్ ఆర్టిస్ట్. చలం కుమారుడు తను. ఎక్కడో ఉన్న ఈయన, మరెక్కడో ఉన్న జిల్లా క్రికెట్ సంఘం అధ్యక్షుడు పుల్లెల వై.ఎన్.శాస్త్రి, ఇలియాజ్ జిల్లా క్రికెట్ ప్లేయర్స్ మీదే శతశాతం దృష్టి సారించారు. దాని ఫలితమే ఇప్పుడు విజయ్ ఐపీఎల్కు ఎంపిక కావడం. అండర్ 23 రంజీ జట్టుకు విజయ్ వైస్ కెప్టెన్‌గా వ్యవహరిస్తున్నారు. సోమవారం జరిగిన రంజీ మ్యాచ్లో నాలుగు ఓవర్లు వేసి 8 పరుగులు ఇచ్చి, నాలుగు వికెట్లు తీసుకున్నాడు విజయ్.
ఇతర ప్రాంతాలకు తీసుకెళ్లి ట్రైనింగ్
రాష్ట్రంలో ఎక్కడ ఎంపికలు జరిగినా, మన జిల్లా ప్లేయర్లు కష్టమ్మీద హాజరవుతున్నారు. ఇక్కడ చీఫ్ కోచ్ సుదర్శన్తో పాటు నలుగురు కోచ్లను టెక్కలి ఐతమ్ గ్రౌండ్స్, కళింగపట్నం గ్రౌండ్స్కు క్రీడాకారులతో పాటు తీసుకువెళ్లి శిక్షణ ఇప్పించడంతో విజయ్ లాంటివారు రాటుదేలారు. గతంలో ఉన్న క్రికెట్ సంఘం కార్యాలయంలోనే జాబితా తయారుచేసి గ్రౌండ్లోకి ప్లేయర్లను దించడం వల్ల ఇంతవరకు ఫలితాలు కనపడలేదు. ప్రస్తుతానికి ఆంధ్రా క్రికెట్ అసోసియేషన్ (ACA) నుంచి నిధులు వస్తున్నా జిల్లాలో గ్రౌండ్లు లేకపోవడంతో స్థానిక ఆర్ట్స్ కళాశాల, ఉమెన్స్ కళాశాలలో మైదానాలను డెవలప్ చేయడానికి జిల్లా క్రికెట్ సంఘం ఒప్పందం కుదుర్చుకుంది. ఇది పూర్తయితే జిల్లా నుంచి ఎస్బీఎన్పీ ప్రసాద్, నంబాళ్ల సుశాంత్, మొదలవలస పూర్ణచంద్ర, జున్నారావు లాంటి అనేకమంది క్రికెటర్లు ఐపీఎల్ లాంటి వాటికి ఆడతారని జిల్లా క్రికెట్ సంఘం ఆశాభావం వ్యక్తం చేస్తుంది.
Also Read: IPL 2025 Auction: సంచలనాలు సృష్టించినా సైడ్ చేశారు, ఐపీఎల్‌లో అమ్ముడుపోని స్టార్ క్రికెటర్లు