Sircilla Santhosh Tragedy | కన్నీళ్లు పెట్టిస్తున్న చేనేత కార్మికుడి మరణం | ABP Desam
నేతన్నల దీన స్థితికి అద్దం పట్టే ఘటన ఇది. రాజన్న సిరిసిల్ల జిల్లా ముస్తాబాద్ కు చెందిన సంతోష్ అనే చేనేత కార్మికుడు అనారోగ్యంతో కన్ను మూశాడు. ఆయనకు భార్య శారద, ఓ కొడుకు, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. ఇంటిపెద్ద దిక్కుగా ఉన్న సంతోష్ చనిపోతే ఆయన్ను వాళ్లుంటున్న అద్దె ఇంటిలో పెట్టే పరిస్థితులు లేకపోవటంతో పడిపోయే స్థితిలో ఉన్న తమ పాత ఇంటికి తీసుకువచ్చారు. అక్కడ కూడ శవాన్ని పెట్టే పరిస్థితి కనిపించకపోవటంతో ఏం చేయలేని స్థితిలో ఇలా రాత్రంతా అంబులెన్స్ లోనే శవాన్ని ఉంచారు. చలిలోనే ముగ్గురు పిల్లలతో ఆ తల్లి ఉండిపోయింది. ఇరుగు పొరుగు వారు వచ్చి వాళ్ల పరిస్థితి తెలుసుకుని తలో కొంత సాయం చేసి వెళ్లారు. నేతన్నల దీనస్థితికి ఈ ఘటన ఉదాహరణ అని...ముగ్గురు పిల్లలతో తన భర్త కు సరైన అంత్యక్రియలు నిర్వహించలేని స్థితిలో ఉన్న ఆ కుటుంబాన్ని ఆదుకోవాలంటూ సంతోష్ వరుసకు సోదరుడయ్యే వ్యక్తి చేసిన ఈ వీడియో వైరల్ గా మారుతోంది. ఘటన గురించి తెలుసుకున్న పోలీసులు, స్థానిక అధికారులు వచ్చి సమాచారం తెలుసుకున్నారు. అంత్యక్రియల కోసం కొంత డబ్బు సాయం చేశారు. ఇందిరమ్మ ఇళ్లు లాంటి ప్రభుత్వ పథకాలు వీరికి కల్పించాలని స్థానికులు కోరుతున్నారు.





















