KTR Padayatra Announced | పాదయాత్ర చేస్తానన్న కేటీఆర్..గులాబీ పార్టీ కొత్త అధినేతగా అడుగులు | ABP Desam
కేటీఆర్ పాదయాత్రను ప్రకటించారు. సమీప భవిష్యత్తులోనే కార్యకర్తల కోరిక మేరకు పాదయాత్ర చేస్తానని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ ట్విట్టర్ లో ASK KTR సెషన్ లో స్పష్టమైన ప్రకటన చేశారు. ఇదే ఇప్పుడు బీఆర్ఎస్ పార్టీలో సంచలనంగా మారింది. ఒంటరిగా ఈ యాత్ర చేస్తారా.. అలా చేస్తే పార్టీ సుప్రీం తనేనా..ఇదే ఇప్పుడు హాట్ టాపిక్.
బీఆర్ఎస్ అంటే కేసీఆర్..కేసీఆర్ అంటే బీఆర్ఎస్. మరి ఆయన రాజకీయ వారసుడు ఎవరు..కేటీఆర్, హరీశ్ రావు ఈ రెండు పేర్ల మధ్యనే ప్రధాన చర్చ నడిచేది. కేటీఆర్ తాను పాదయాత్ర చేయనున్నట్లు ప్రకటించడంతో ఇది ఎవరి నిర్ణయం అనే చర్చ మొదలైంది. ఇది కేసీఆర్ నిర్ణయమా లేదా కేటీఆర్ సొంత నిర్ణయమా అని అంతా చర్చింకుంటున్నారు. డిసెంబర్ లో జరిగిన ఎన్నికల్లో పార్టీ ఓటమి తర్వాత కేసీఆర్ రాజకీయంగా అంతగా చురుకుగా లేకపోవడం, అసెంబ్లీ బడ్జెట్ సమావేశాలకు ఒక్క రోజే హజరు కావడం , రైతు సమస్యలపై ఓ ఆందోళన కార్యక్రమంలో పాల్గొనడం మినహా ప్రస్తుతం ఆయన రాజకీయ మౌనం వహిస్తున్నారు. దీనికి వయోభారం, అనారోగ్యం, ఆపరేషన్లు అనేక కారణాలు ఉన్నాయి. ఇలాంటి టైమ్ లో పార్టీలో వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, పార్టీలో సీనియర్ నేత హరీశ్ రావులే అన్నీ తామై పార్టీ కార్యక్రమాలు చక్కబెడుతున్నారు. కాంగ్రెస్, బీజేపీ పార్టీల విమర్శలకు వారే దీటుగా స్పందిస్తున్నారు.