Cabinet approves Reservation for BC | బీసీలకు 42 శాతం రిజర్వేషన్
సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన సమావేశమైన తెలంగాణ మంత్రిమండలి కీలక నిర్ణయం తీసుకుంది. స్థానిక సంస్థల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్ అమలు చేసేందుకు ఆమోదం తెలిపింది. అనంతరం రెండు ప్రైవేటు యూనివర్శిటీల ఏర్పాటుకు కూడా ఓకే చెప్పింది. ఇందులో తెలంగాణ విద్యార్థులుకు 50 శాతం రిజర్వేషన్లు కేటాయించాలని తీర్మానం చేసింది.
మార్చి నెలలో జరిగిన అసెంబ్లీ సమావేశాల్లోనే బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లును ప్రభుత్వం ఆమోదించింది. విద్య, ఉద్యోగాలతోపాటు స్థానిక సంస్థల్లోనూ బీసీలకు 42 శాతం రిజర్వేషన్స్ ప్రాతినిధ్యం కల్పించే 2 బిల్లులను ఆమోదించింది.
పంచాయతీ ఎన్నికల అంశంపై హైకోర్టు నెలాఖరులోపు రిజర్వేషన్స్ ఖరారు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. వీటన్నింటినీ చర్చించిన మంత్రివర్గం స్థానిక సంస్థల ఎన్నికల్లో 42 శాతం బీసీలకు రిజర్వేషన్లు కల్పించాలని నిర్ణయం తీసుకుంది. సుప్రీంకోర్టు తీర్పులకు అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే బీసీ డెడికేటేడ్ కమిషన్ నియమించింది.
బీసీ రిజర్వేషన్ల పెంపునకు అనుగుణంగా రాష్ట్రంలో అమల్లో ఉన్న పంచాయతీరాజ్ చట్టం-2018 సవరణకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. త్వరలోనే ఈ చట్టంలో చేయాల్సిన సవరణలకు అవసరమైన చర్యలు చేపడుతుంది ప్రభుత్వం.



















