TRS MLAs Poaching Case: ఇవాళ కూడా సిట్ ముందుకొచ్చిన నందకుమార్- ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక డెవలప్‌మెంట్!
TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ, విజయ్ లను ఇవాళ కూడా సిట్ అధికారులు విచారిస్తున్నారు. సోమవారం 8 గంటల పాటు ప్రశ్నలు అడుగుతూనే ఉన్నారు.
TRS MLAs Poaching Case: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరోసారి సిట్ విచారణకు నందకుమార్ హాజరయ్యారు. నిన్న ఆయన ఇచ్చిన సమాధానాలు ఆధారంగా మరికొన్ని ప్రశ్నలను సిట్ అధికారులు ఫ్రేమ్ చేశారు. ఇప్పటికే నందకుమార్ లీలలన్నీ ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయి. నిన్న విచారణకు నిందితుడు నందకుమార్ భార్య చిత్రలేఖ, ఓ స్వచ్చంద సంస్థ కార్యదర్శి ఎం.విజయ్ కుమార్ మాదిగ హాజరయ్యారు. ఇద్దరినీ వేర్వేరుగా విచారించింది సిట్. శుక్రవారం మొదటిసారి విచారణకు వచ్చిన చిత్రలేఖ, రెండోసారి సోమవారం రోజు లాయర్ తో కలిసి హాజరయ్యారు.
ముందు నోరు మెదపకపోయినా ఆ తర్వాత సిట్ అధికారులు అడిగిన అన్ని ప్రశ్నలకు నందకుమార్ భార్య చిత్రలేఖ సమాధానం చెప్పినట్లు తెలుస్తోంది. గతంలో పలుమార్లు సింహయాజి, రామచంద్ర భారతి తమ నివాసానికి వచ్చారని ఆమె అంగీకరించినట్లు సమాచారం. అయితే ఆ ఇద్దరితో పాటు ఢిల్లీ నుంచి మరెవరైనా వచ్చారా అనే ప్రశ్నకు మొన్నటిలాగే గుర్తులేదంటూ జవాబు చెప్పారని తెలిసింది.
8 గంటల పాటు సాగిన విచారణ..
కొన్ని సెల్ ఫోన్లు పాడయ్యాయని, మరికొన్ని కనిపించకుండా పోయాయని చిత్ర లేఖ చెప్పారట. నందకుమార్ తన వ్యాపార కార్యకలాపాలు, ప్రైవేటు పంచాయితీల లావాదేవీల ఛాటింగ్ తో ఉన్న పలు స్క్రీన్ షాట్ లను తన భార్య వాట్సాప్ నంబర్ కు పంపినట్లు అధికారులు గుర్తించారు. వాటి గురించి చిత్రలేఖను సిట్ అధికారులు ఆరా తీయగా.. నామినేటెడ్ పదవులు ఇప్పిస్తామంటూ ఎవరెవరికి హామీలు ఇచ్చారనే అంశంపై ప్రశ్నించారు. దాదాపు 8 గంటల పాటు జరిగిన విచారణలో ఆమె చెప్పిన వివరాలన్నింటినీ నమోదు చేశారు. నందకుమార్ తో ఛాటింగ్, బ్యాంకు లావాదేవీల వివరాలు దర్యాప్తులో వెలుగు చూడడంతో విజయ్ కుమార్ ను సిట్ బృందం విచారించింది. శుక్రవారం అతడి నుంచి కొంత సమాచారం సేకరించగా... సోమవారం మరిన్ని వివరాలు రాబట్టారు.
విజయ్ నుంచి నగదు తీసుకున్న నందకుమార్..
ఇతను గతంలో ఓ జాతీయ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి వద్ద పని చేశారు. అనంతరం మరో జాతీయ పార్టీకి చెందిన సీనియర్ నేత, మాజీ మంత్రి వద్ద పని చేశారు. మరో జాతీయ పార్టీ నాయకుడికి ప్రధాన అనుచరుడిగా ఉన్నారు. ఆ సమయంలోనే నంద కుమార్ తో పరిచయం ఏర్పడింది. జాతీయ స్థాయిలో నామినేటెడ్ పదవి ఇప్పిస్తానంటూ ఆశ చూపిన నందకుమార్... విజయ్ నుంచి తన బ్యాంకు ఖాతాలో నగదు జమ చేయించుకున్నట్లు తెలిసింది. అలాగే ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు నందు, రామచంద్ర భారతితో సంబంధాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. వీళ్లు ముగ్గురూ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కీలక వ్యక్తలను కలిసినట్లు ఆధారాలు సేకరించారు. అయితే రఘురామను విచారణకు రావాలని చెప్పగా.. రాలేను, మరో రోజు వస్తానని చెప్పినట్లు సమాచారం. ఇందుకు సిట్ కూడా ఒఫ్పుకున్నట్లు తెలుస్తోంది.
హాజరైతే అరెస్ట్ చేస్తారేమోననే భయంతో శ్రీనివాస్ గైర్హాజరు..
శుక్రవారం సిట్ విచారణకు హాజరు కావాలని శ్రీనివాస్ ను హైకోర్టు ఆదేశించినా ఆయన గైర్హాజరు అయ్యారు. కరీంనగర్ న్యాయవాది శ్రీనివాస్ ను ఈ కేసులో ఏ7గా చేర్చిన సంగతి తెలిసిందే. దీంతో విచారమకు హాజరైతే అరెస్ట్ చేస్తారేమోననే అనుమానంతో ఆయన గైర్హాజరైనట్లు సమాచారం. నందు, సింహయాజీలతో కలిసి శ్రీనివాస్ పలు ప్రాంతాల్లో సంచరించడానికి సంబంధించిన ఆధారాలు, నందుతో రూ.55 లక్షలకు సంబంధించిన లావాదేవీలను పోలీసులు గుర్తించినట్లు తెలిసింది.