BRS vs Congress In Kosgi: రేవంత్ రెడ్డి ఇలాకాలో కాంగ్రెస్, బీఆర్ఎస్ నేతల పరస్పర రాళ్లదాడి, ఉద్రిక్తత
Kosgi MLA Protests Police Inaction: మొన్న అచ్చంపేటలో జరిగిన సీన్ తాజాగా కొడంగల్ నియోజకవర్గంలోనూ రిపీట్ అయింది. బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడులకు దిగారు.
Kodangal News: కొడంగల్ : మొన్న అచ్చంపేటలో జరిగిన సీన్ తాజాగా కొడంగల్ నియోజకవర్గంలోనూ రిపీట్ అయింది. టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి (Revanth Reddy) నియోజకవర్గం కొడంగల్ లో బీఆర్ఎస్, కాంగ్రెస్ కార్యకర్తలు పరస్పరం రాళ్లదాడికి దిగారు. నియోజకవర్గంలోని కోసిగి మండలం సజ్జకాం పేట గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ నేతలు ప్రచారానికి వెళ్లారు. అదే టైంలో కాంగ్రెస్ శ్రేణులు అక్కడికి చేరుకున్నాయి. బీఆర్ఎస్ కార్పొరేటర్ సోమశేఖర్ రెడ్డి వాహనాల్లో డబ్బు తరలిస్తున్నారని కాంగ్రెస్ నేతలు ఆరోపించారు. ఆ వాహనాలను అడ్డుకోవడంతో బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణుల మధ్య (BRS and Congress activists attack in Kosgi) గొడవ రాళ్ల దాడికి దారితీసింది. రాళ్ల దాడిలో రెండు పార్టీలకు చెందిన కొందరు కార్యకర్తలు గాయపడ్డారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి లాఠీఛార్జ్ చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. గాయపడిన వారిని చికిత్స కోసం కోసిగి లోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
ఇటీవల నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట నియోజకవర్గంలోనూ బీఆర్ఎస్ ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, బీఆర్ఎస్ నేతలు నగదును వాహనాల్లో తరలిస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ అభ్యర్థి వంశీకృష్ణ, ఆయన మద్దతుదారులు అడ్డుకున్నారు. బీఆర్ఎస్, కాంగ్రెస్ శ్రేణులు పోటాపోటీగా నినాదాలు చేసుకోవడం, చివరకు రాళ్లదాడికి దారితీసింది. ఈ క్రమంలో ఎమ్మెల్యే గువ్వల బాలరాజు స్వల్పంగా గాయపడటం తెలిసిందే. మాజీ ఎమ్మెల్యే వంశీకృష్ణ విసిరిన రాయి గువ్వల బాలరాజుకు తాకిందని కాంగ్రెస్ కార్యకర్తలు ఆరోపించారు. గువ్వల బాలరాజుపై రెండోసారి సైతం దాడి జరిగింది.
రేవంత్ రెడ్డిపై ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి ఆరోపణలు
తాజా దాడుల ఘటనపై బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థి, ఎమ్మెల్యే పట్నం నరేందర్ రెడ్డి స్పందించారు. ఓటమి భయంతోనే కొడంగల్లో రేవంత్ రెడ్డి దాడులు చేయిస్తున్నారని ఆరోపించారు. హైదరాబాద్, కర్నూల్ నుంచి గుండాలను తీసుకొని వచ్చి వాళ్ళతో బీఆర్ఎస్ పార్టీ కార్ల అద్దాలు ధ్వంసం చేయించారని.. వాళ్లతోనే బీఆర్ఎస్ పార్టీ మీద దుష్ప్రచారం చేయిస్తున్నారంటూ మండిపడ్డారు. రేవంత్ రెడ్డి అధికార దాహంతో, దురాశతో దౌర్జన్యాలను చేయిస్తున్నారని.. ప్రశాంతంగా ఉన్న కొడంగల్ పల్లెలలో వాతావరణాన్ని పాడుచేస్తున్నారని ఘాటుగా స్పందించారు.
రాళ్ల దాడిలో నలుగురు బీఆర్ఎస్ పార్టీ కార్యకర్తలకు గాయాలు కాగా, వారిని ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నామని చెప్పారు. దొంగ తానే దొంగ దొంగ అన్నట్టు గత వారం రోజులుగా తామే సమస్యలను సృష్టించి అది మా పార్టీ మీద నెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. రేవంత్ రెడ్డి చర్యలు ప్రజాస్వామ్యానికి గుడ్డలు పెట్టు అని, ఆయన ఎన్ని జిమ్మిక్కులు చేసిన గెలిచేది బీఆర్ఎస్ పార్టీ అని రేవంత్ రెడ్డి తెలుసుకోవాలని హితవు పలికారు.