Telangana Assembly Session: అక్టోబర్ 5 వరకు అసెంబ్లీ సమావేశాలు... ఎమ్మెల్యేలకు క్లబ్ నిర్మిస్తామన్న సీఎం కేసీఆర్... 12 అంశాలపై చర్చించాలని కాంగ్రెస్ జాబితా
తెలంగాణ బీఏసీ సమావేశం సీఎం కేసీఆర్ అధ్యక్షతన జరిగింది. అక్టోబర్ 5 వరకు ఎనిమిది రోజులు సమావేశాలు నిర్వహించాలని ప్రభుత్వం స్పీకర్ కు ప్రతిపాదించింది.
తెలంగాణ శాసనసభ సమావేశాలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఇటీవల మృతి చెందిన మాజీ శాసనసభ్యులకు సంతాప తెలిపే తీర్మానాన్ని స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి సభలో ప్రవేశపెట్టారు. దివంగత మాజీ ఎమ్మెల్యేలు కుంజా బుజ్జి, కేతిరి సాయిరెడ్డి, అజ్మీరా చందూలాల్, కుంజా భిక్షం, మేనేని సత్యనారాయణరావు, మాచర్ల జగన్నాథం, రాజ్యయ్యగారి ముత్యంరెడ్డి, బొగ్గారపు సీతారామయ్య, చేకూరి కాశయ్య మృతికి శాసనసభ సంతాపం తెలిపింది. సంతాప తీర్మానాల అనంతరం శాసనసభ సోమవారానికి వాయిదా పడింది.
దేశానికి ఆదర్శవంతంగా తెలంగాణ
తెలంగాణ శాసనసభ వాయిదా అనంతరం ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్ రావు అధ్యక్షతన బీఏసీ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కీలక అంశాలపై చర్చజరిగింది. నూతన రాష్ట్రంగా తెలంగాణ అన్ని రంగాల్లో ఆదర్శంగా నిలిచినట్టు అసెంబ్లీ నిర్వహణలో కూడా దేశానికి ఆదర్శవంతంగా కార్యకలాపాలను నిర్వహించాలని బీఏసీ సమావేశంలో సభ్యులు కోరారు. గొప్ప సంప్రదాయాలు నెలకొల్పడానికి ఎటువంటి చర్యలు చేపట్టాలో స్పీకర్ ఆలోచన చేయాలన్నారు. వీలైనన్ని ఎక్కువ రోజులు అసెంబ్లీని నడిపించాలన్నారు. అన్ని అంశాలపై విస్తృతంగా చర్చించాలని సభ్యులు కోరారు. చర్చలు సజావుగా సాగేందుకు ప్రతిపక్షాల సలహాలను సూచనలను కూడా తీస్కోవాలని సూచించారు. ప్రభుత్వం తరఫున సూచించిన అంశాలనే కాకుండా ప్రతిపక్షం చర్చించాలనుకున్న సబ్జెక్టులను కూడా పరిగణలోకి తీసుకుని చర్చించాలని బీఏసీ సమావేశంలో సభ్యులు కోరారు. ఇందులో భాగంగా ఐటీ పరిశ్రమలు, హరితహారం, వ్యవసాయంతోపాటు పాతబస్తీ అభివృద్ధి, మైనారిటీలు అంశాలతో పాటు కాంగ్రెస్ పార్టీ సూచించిన అంశాలను కూడా సభలో చర్చించాలని కోరారు.
Also Read: ఏ పథకానికీ లేని చట్టబద్ధత ‘దళిత బంధు’కు ఎందుకు? గతంలో చట్టబద్ధత కల్పించిన "బంగారు తల్లి" ఏమయింది ?
హైదరాబాద్ లో ఎమ్మెల్యేలకు క్లబ్
తెలంగాణ శాసనసభ వ్యవహారాల సలహా సంఘం (బీఏసీ) సమావేశం ముగిసింది. స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో సీఎం కేసీఆర్, సీఎల్పీ నేత భట్టి విక్రమార్క తదితరులు హాజరయ్యారు. 8 రోజు పాటు సమావేశాలు నిర్వహించాలని టీఆర్ఎస్ ప్రభుత్వం స్పీకర్‌కు ప్రతిపాదించింది. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్‌లో ఎమ్మెల్యేలకు క్లబ్ నిర్మిస్తామని చెప్పారు. దిల్లీలోని కాన్‌స్టిట్యూషన్ క్లబ్ తరహాలో దీన్ని నిర్మిస్తామన్నారు. ఎమ్మెల్యేల ప్రోటోకాల్ కచ్చితంగా పాటించాలన్నారు. అభివృద్ధి, సంక్షేమ పథకాలను అసెంబ్లీ వేదికగా ప్రజలకు చేరవేయాలన్నారు. అర్ధవంతమైన, ముఖ్యమైన అంశమైతే సమయం ఇవ్వాలని సూచించారు. కొత్తగా నిబంధనలు, విధివిధానాలు రూపొందించుకోవాలన్నారు. తెలంగాణ శాసనసభ దేశానికే ఆదర్శంగా నిలవాలని సీఎం కేసీఆర్ తెలిపారు. సభ్యుల సంఖ్య తక్కువైనా విపక్షాలకు సమయం కేటాయిస్తున్నామని కేసీఆర్ అన్నారు.
అక్టోబర్ 5 వరకు సమావేశాలు
అనంతరం సీఎల్పీ నేత భట్టి విక్రమార్క మాట్లాడుతూ చాలా అంశాలపై చర్చ చేపట్టాల్సి ఉందన్నారు. 20 రోజుల పాటు అసెంబ్లీ జరపాలని కోరారు. ఈ మేరకు 12 అంశాలపై చర్చించాలని కోరుతూ స్పీకర్‌కు జాబితా అందజేశారు. దీనిపై స్పీకర్ స్పందిస్తూ అన్ని పక్షాల నుంచి జాబితా రావాలన్నారు. ఆ జాబితాలు వచ్చాక పనిదినాలు నిర్ణయిద్దామని చెప్పారు. అయితే ప్రాథమికంగా సమావేశాలను అక్టోబర్ 5 వరకు నిర్వహించాలని స్పీకర్ నిర్ణయించినట్లు సమాచారం. బీఏసీ సమావేశానికి ఆహ్వానం అందలేదని బీజేపీ ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు.
Also Read: తెలంగాణ అసెంబ్లీ వాయిదా.. ముగిసిన బీఏసీ భేటీ, కాంగ్రెస్ కొత్త డిమాండ్