Breaking News Live: చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగుబాటు
తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సహా దేశ వ్యాప్తంగా అక్టోబరు 20న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ లైవ్ బ్లాగ్ అప్ డేట్ అవుతూ ఉంటుంది. తాజా సమాచారం కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.
LIVE
Background
యాదాద్రి ఆలయం విమాన గోపురానికి తిరుమల తరహాలో బంగారు తాపడం చేయించాలని సీఎం కేసీఆర్ నిర్ణయించారు. దీని కోసం 125 కిలోల బంగారం అవసరమవుతుందన్నారు. యాదాద్రికి తొలి విరాళంగా తమ కుటుంబం నుంచి కిలో 16 తులాల బంగారం ఇస్తున్నట్లు కేసీఆర్ ప్రకటించారు. చినజీయర్‌స్వామి జీయర్ పీఠం నుంచి కిలో బంగారం ఇస్తున్నట్లు సీఎం తెలిపారు. మంత్రి మల్లారెడ్డి కిలో బంగారం, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కిలో బంగారం ఇస్తామన్నారని పేర్కొన్నారు. నాగర్ కర్నూల్ ఎమ్మెల్యే మర్రి జనార్థన్‌రెడ్డి 2 కిలోల బంగారం, కావేరీ సీడ్స్ తరఫున భాస్కర్‌రావు కిలో బంగారం ఇస్తామన్నారని కేసీఆర్ అన్నారు. మంత్రి హరీష్ రావు కిలో బంగారం ఇస్తానని తెలిపారు.
మరోవైపు, తెలంగాణ యాదాద్రి ఆలయం పునః ప్రారంభం ముహూర్తం ఖరారు అయ్యింది. మంగళవారం యాదాద్రిలో పర్యటించిన సీఎం కేసీఆర్ ముహూర్తం తేదీని ప్రకటించారు. వచ్చే ఏడాది మార్చి 28న మహాకుంభ సంప్రోక్షణ ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. మహా కుంభ సంప్రోక్షణ కోసం వివిధ పీఠాలకు ఆహ్వానం పంపనున్నట్టు చెప్పారు. మహాకుంభ సంప్రోక్షణకు ఎనిమిది రోజుల ముందు మహా సుదర్శనయాగం ఉంటుందని పేర్కొన్నారు.
Also Read: టీఆర్ఎస్ పార్టీలో చేరిన మోత్కుపల్లి నర్సింహులు.. కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన సీఎం కేసీఆర్
నాలుగేళ్ల క్రితమే ఆలోచన
యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయాన్ని సందర్శించిన అనంతరం యాదాద్రిలో సీఎం కేసీఆర్ మీడియా సమావేశంలో మాట్లాడారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో తెలంగాణ అన్ని రంగాల్లో నిర్లక్ష్యానికి గురైందన్నారు. గతంలో తెలంగాణలో పుష్కరాలు కూడా నిర్వహించలేదు. ఉద్యమ సమయంలో గోదావరి పుష్కర శోభ ప్రపంచానికి తెలియజేశామని సీఎం కేసీఆర్ అన్నారు. జోగులాంబ అమ్మవారి శక్తిపీఠానికి ప్రాచుర్యం కల్పించామన్నారు.
యాదాద్రి అభివృద్ధికి నాలుగైదేళ్ల క్రితమే నిర్ణయం తీసుకున్నామన్నారు. యాదాద్రి వైభవాన్ని నలుదిక్కులా చాటేందుకు ఆలయాన్ని పునర్నిర్మాణం చేపట్టామన్నారు. చినజీయర్ స్వామి సూచనలతో అభివృద్ధి పనులు చేపట్టినట్లు సీఎం కేసీఆర్ తెలిపారు. చినజీయర్‌స్వామి సూచనలతో సిద్ధాంతులు, వాస్తు నిపుణులతో చర్చలు జరిపి ఆలయ పునర్నిర్మాణం చేశామన్నారు. అంతర్జాతీయ ప్రమాణాలతో టెంపుల్ సిటీ నిర్మాణం జరిగిందని సీఎం కేసీఆర్ వివరించారు.
Also Read: యాదాద్రి లక్ష్మినరసింహస్వామిని దర్శించుకున్న కేసీఆర్.. ఆలయంలో పనులు పరిశీలన
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగుబాటు
చత్తీస్‌గఢ్‌లోని సుక్మా జిల్లాలో 43 మంది మావోయిస్టులు లొంగిపోయారు. ఎస్పీ సునీల్ దత్ శర్మ మరియు సీఆర్పీఎఫ్ అధికారుల ముందు 43 మంది మావోయిస్టులు లొంగిపోయారు. మావోయిస్ట్ పార్టీలో చురుకుగా పనిచేసేవారు ఒకేసారి భారీ సంఖ్యలో లొంగిపోవడం మావోయిస్టులకు గట్టి దెబ్బగా చెప్పవచ్చు. లొంగిపోయిన వారిలో ఒక మావోయిస్ట్ పై లక్ష రూపాయలవరకు రివార్డు ఉండగా.. మిగతా మావోయిస్టులలలో కొందరిపై రూ.10 వేల రివార్డు ఉంది. వీరంతా కుకనార్ గాడిరాస్, పుల్బాజీ, చింతగుప్ప పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాలకు చెందినవారని ఎస్పీ తెలిపారు.
గంజాయి సాగుచేసే వారికి రైతు బంధు, రైతు భీమా బంద్.. సీఎం కేసీఆర్ కీలక నిర్ణయం
గంజాయి సాగుచేసే వారికి రైతు బంధు, ఇతర ప్రభుత్వ పథకాలు బంద్ అని అధికారులు తెలిపారు. గంజాయి సాగు చేసే వారికి రైతు భీమా సైతం రద్దు చేస్తామని సీఎం కేసీఆర్ నిర్ణయం తీసుకున్నారు.
తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్ పర్సన్‌గా పద్మజ ప్రమాణ స్వీకారం
తిరుపతి స్మార్ట్ సిటీ కార్పొరేషన్ లిమిటెడ్ చైర్ పర్సన్‌గా నారుమల్లి పద్మజ ప్రమాణస్వీకారం చేశారు. భాద్యతలు స్వీకరించిన పద్మజా అనంతరం మీడియాతో మాట్లాడారు. దేశంలోని 100 స్మార్ట్ సిటీలలో తిరుపతి ముందు వరసలో ఉండేలా కృషి చేస్తామన్నారు. తిరుపతిని ప్రత్యేక స్మార్ట్ సిటీగా తీర్చిదిద్దడంతో పాటు ఆదర్శవంతంగా నిలుపుతామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నేత భూమన కరుణాకర్ రెడ్డితో పాటు ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు.
రూ.4 కోట్ల హవాలా సొమ్ము పట్టివేత
హైదరాబాద్ - విజయవాడ జాతీయ రహదారిపై పోలీసులు వాహన తనిఖీలు చేపడుతుండగా.. ఓ కారులో అక్రమ సొమ్ము బయటపడింది. దాదాపు రూ.4 కోట్ల హవాలా డబ్బును చిట్యాల పోలీసులు పట్టుకున్నారు. కారులో ఉన్న ఇద్దరిని అదుపులోకి తీసుకున్న విచారణ చేపట్టారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి వెళుతున్న ఓ కారులో ఈ డబ్బు పట్టుబడిందని పోలీసులు చెప్పారు.
తెలంగాణ వ్యక్తికి అమెరికాలో ఉన్నత పదవి.. కేటీఆర్ ప్రశంసలు
కరీంనగర్ జిల్లా మూలాలున్న భారత వ్యక్తి వినయ్ తుమ్మలపల్లికి అమెరికాలో ఉన్నత స్థానం దక్కింది. ప్రభుత్వ అధీనంలో ఉన్న యూఎస్టీడీఏ (అమెరికా వాణిజ్య అభివృద్ధి సంస్థ)కు ఆయన్ను డిప్యూటీ డైరెక్టర్, సీఓఓగా అధ్యక్షుడు జో బైడెన్ నియమించారు. ఒబామా హయాంలో వినయ్ తుమ్మలపల్లిని బెలిజికి అమెరికా రాయబారిగా నియమించారు. తాజాగా వినయ్ తుమ్మలపల్లికి ఉన్నత పదవి దక్కడంపై మంత్రి కేటీఆర్ కూడా హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా శుభాకాంక్షలు తెలుపుతూ ట్వీట్ చేశారు.
Many congratulations Vinay Thummalapally Garu 👏 https://t.co/PEaCPDEUFX
— KTR (@KTRTRS) October 20, 2021