KRMB GRMB Meet: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉపసంఘాల సమావేశం... నేడు హైదరాబాద్ లో భేటీ... గెజిట్ నోటిఫికేషన్ అమలుపై చర్చ
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉపసంఘాల సమావేశం ఇవాళ జరగనుంది. హైదరాబాద్ లో ఉదయం 11 గంటలకు గోదావరి బోర్డు ఉపసంఘం, మధ్యాహ్నం ఒంటి గంటకు కృష్ణా బోర్డు ఉపసంఘం సమావేశం కానున్నాయి.
గెజిట్ నోటిఫికేషన్ అమలుపై కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల ఉపసంఘాలు ఇవాళ భేటీ కానున్నాయి. గతంలో బోర్డుల సంయుక్త సమావేశంలో తీసుకున్న నిర్ణయానికి అనుగుణంగా సమన్వయ కమిటీ స్థానంలో ఉప సంఘాలు ఏర్పాటుచేశారు. ఈ ఉపసంఘాల మొదటి సమావేశం ఇవాళ హైదరాబాద్ జలసౌధలో నిర్వహిస్తున్నారు. ఉదయం 11 గంటలకు గోదావరి బోర్డు ఉపసంఘం, మధ్యాహ్నం ఒంటి గంటకు కృష్ణా బోర్డు ఉపసంఘం సమావేశం కానున్నాయి. గోదావరి ఉపసంఘానికి బోర్డు సభ్యకార్యదర్శి, కృష్ణా ఉపసంఘానికి బోర్డు సభ్యుడు కన్వీనర్‌గా ఉన్నారు. బోర్డు సభ్యులు, రెండు రాష్ట్రాల అంతర్రాష్ట్ర వ్యవహారాల సీఈలు, జెన్ కో అధికారులు ఉపసంఘంలో సభ్యులుగా ఉన్నారు. గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణ, ఇతర అంశాలపై భేటీలో చర్చిస్తారు.
చీఫ్ ఇంజినీర్ల కేటాయింపు
కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల పరిధికి సంబంధించి గెజిట్ నోటిఫికేషన్ అమలు కార్యాచరణపై కేంద్ర ప్రభుత్వం దృష్టి సారించింది. నోటిఫికేషన్ అమలు కోసం బోర్డులకు కేంద్ర జలశక్తిశాఖ ఇంజినీర్లను కేటాయించింది. రెండు బోర్డులకు ఇద్దరు చొప్పున చీఫ్ ఇంజినీర్లను కేటాయించింది. గోదావరి నదీ యాజమాన్య బోర్డుకు ఎం.కె.సిన్హా, జి.కె.అగర్వాల్‌ను, కృష్ణా నదీ యాజమాన్య బోర్డుకు టి.కె.శివరాజన్, అనుపమ్ ప్రసాద్‌లను చీఫ్ ఇంజినీర్లుగా కేటాయించారు. నోటిఫికేషన్‌లో పేర్కొన్న ప్రాజెక్టులను బోర్డుల అధీనంలోకి తీసుకునే ప్రక్రియలో చీఫ్ ఇంజినీర్లు కీలకపాత్ర పోషించనున్నారు.
తెలుగు రాష్ట్రాల అభ్యంతరాలు
గెజిట్ నోటిఫికేషన్ లోని అంశాలపై తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. ప్రత్యేకించి తెలుగు రాష్ట్రాల్లో కృష్ణా, గోదావరి నదీ పరివాహక ప్రాంతం పరిధిలో ప్రతి ప్రాజెక్టు, కాల్వలను నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి తేవటంపై ప్రభుత్వాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. 2 నెలల్లో ఒక్కో రాష్ట్రం ఒక్కో బోర్డుకు రూ.200 కోట్లు డిపాజిట్ చేయడం సాధ్యంకాదని చెబుతున్నాయి. 15 రోజులకోసారి అప్పటి అవసరం ఎంతో చెప్తే దానికి తగ్గట్లుగా విడుదల చేస్తామని తెలిపాయి. కృష్ణానదిపై ఉన్న ప్రధాన ప్రాజెక్టులు బోర్డు పూర్తి అజమాయిషీలో రెండో షెడ్యూలులో ఉంటే సరిపోతుందని, ప్రకాశం బ్యారేజి, పోతిరెడ్డిపాడు కింద ఉన్న కాల్వలు, ప్రాజెక్టులు అవసరం లేదని ఏపీ ఇప్పటికే కేంద్రజల్‌శక్తి మంత్రిత్వశాఖకు లేఖ రాసింది.
Also Read: Krmb Grmb Meet: కృష్ణా, గోదావరి నదీ యాజమాన్య బోర్డుల కీలక సమావేశం... దిల్లీలో కేంద్రజల్‌శక్తి కార్యదర్శితో భేటీ... గెజిట్ అమలుపై చర్చ