KCR Medaram : కేసీఆర్ మేడారం ఎందుకు వెళ్లలేదు ?
కేసీఆర్ మేడారం వెళ్తారని, మొక్కులు చెల్లిస్తారని అధికారికంగా ప్రకటించినా వెళ్లలేదు. అదే సమయంలో వాయిదా వేసుకున్నారని కూడా ఎలాంటి ప్రకటనా చేయలేదు.
తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ( CM KCR ) మేడారం పర్యటనకు వెళ్లలేదు. కేసీఆర్ శుక్రవారం మేడారంకు వెళ్లి సమ్మక్క- సారలమ్మలకు ( Sammakka - Saralamma )మొక్కులు చెల్లిస్తారని ప్రభుత్వ వర్గాలు అధికారికంగా ప్రకటించాయి. అధికారులు ఏర్పాట్లు చేశారు. కానీ కేసీఆర్ మేడారం ( Medaram ) వెళ్లలేదు. కనీసం ఎందుకు వెళ్లలేదో కూడా మీడియాకు.. ప్రజలకు సమాచారం ఇవ్వకపోవడం అందర్నీ ఆశ్చర్య పరుస్తోంది. రెండేళ్లకోసారి జరిగే సమ్మక్క - సారలమ్మ జాతరకు ముఖ్యమంత్రి హాజరు కావడం సంప్రదాయంగా వస్తోంది. ఈ సారి కూడా సీఎం కేసీఆర్ వెళ్లేందుకు షెడ్యూల్ ఖరారు చేసుకున్నారు.
వనదేవతలకు కేటీఆర్ నిలువెత్తు బంగారం సమర్పణ.. ఓబుళాపూర్ జాతరకు హాజరు
హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో మేడారానికి వస్తారని అధికారులు తెలిపారు. కేసీఆర్ మేడారంలో సుమారు మూడు గంటలకుపైగా గడుపుతారని, నిలువెత్తు బంగారం సమర్పించి మొక్కులు తీర్చుకుంటారని వెల్లడించారు. సీఎం వెంట ప్రభుత్వ సీఎస్ సోమేశ్‌కుమార్, డీజీపీ మహేందర్‌రెడ్డి కూడా ఉంటారని ఈ మేరకు ఏర్పాట్లపై మంత్రులు ఎర్రబెల్లి దయాకర్‌రావు, ( ErrabellI ) ఇంద్రకరణ్‌రెడ్డి, జిల్లా కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు పలుమార్లు సమీక్షలు ( Reviews ) కూడా నిర్వహించారు. ట్రాఫిక్ నియంత్రణ, భక్తులకు ఇబ్బందులు కలగకుండా ఉండేందుకు చేపట్టాల్సిన చర్యలపై వివిధ శాఖల అధికారులకు సూచనలు కూడా చేశారు.
తీరా సమయం వచ్చే సరికి కేసీఆర్ పర్యటనకు వెళ్లలేదు. ఉదయం కూడా కేసీఆర్ మేడారంకు వస్తారనే అనుకున్నారు. కానీ సమయం గడిచే కొద్దీ గందరగోళం ఏర్పడింది. షెడ్యూల్ ప్రకారం ఉదయం పదకొండున్నర గంటల కల్లా కేసీఆర్ అక్కడకు చేరుకోవాలి. అయితే సీఎం బయలు దేరినట్లు కానీ ఆయన పర్యటనకు వస్తారని కానీ.. రారని కానీ మేడారంలో ఎదురు చూస్తున్న మంత్రులకు సమాచారం రాలేదు. చివరికి కేసీఆర్ రావడం లేదని తేలిపింది.
అధికారికంగా ఖరారైన ముఖ్యమంత్రి పర్యటన ( CM Tour ) వాయిదా పడితే కారణాలను సీఎంవో వర్గాలు ప్రకటిస్తూ ఉంటాయి. ఇటీవల ప్రధాని మోదీ పర్యటనలో కేసీఆర్ పాల్గొనలేదు. ఈ సందర్భంగా ఆయనకు జ్వరం వచ్చిందని మీడియాకు సమాచారం ఇచ్చారు. ఈ రోజు అలాంటి కారణాలు కూడా మీడియాకు.. ప్రజలకు చెప్పలేదు. దీంతో సీఎం పర్యటన హఠాత్తుగా ఎందుకు ఆగిపోయిందా అన్న చర్చ టీఆర్ఎస్ ( TRS ) వర్గాల్లో జరుగుతోంది.