KTR: వనదేవతలకు కేటీఆర్ నిలువెత్తు బంగారం సమర్పణ.. ఓబుళాపూర్ జాతరకు హాజరు
వన దేవతలకు కేటీఆర్ నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఓబుళాపూర్‌లో జరుగుతున్న సమ్మక – సారలమ్మ జాతరను కేటీఆర్ సందర్శించారు.
రాజన్న సిరిసిల్ల జిల్లాలో పర్యటిస్తున్న ఐటీ, మున్సిపల్ శాఖ మంత్రి కేటీఆర్ మేడారం వనదేవతల మొక్కు తీర్చుకున్నారు. సిరిసిల్ల జిల్లా ఓబుళాపూర్‌లో జరుగుతున్న సమ్మక – సారలమ్మ జాతరను కేటీఆర్ సందర్శించారు. ఈ సందర్భంగా వన దేవతలకు కేటీఆర్ నిలువెత్తు బంగారం సమర్పించి, మొక్కులు చెల్లించుకున్నారు. సమ్మక్క – సారలమ్మకు మంత్రి ప్రత్యేక పూజలు చేశారు. అక్కడ జాతరకు వచ్చిన భక్తులను కేటీఆర్ పలకరించారు. ఏర్పాట్ల గురించి ఆరా తీశారు. కేటీఆర్‌తో సెల్ఫీలు దిగేందుకు కొంత మంది యువతీ యువకులు పోటీ పడ్డారు. మంత్రికి కరచాలనం ఇచ్చేందుకు భక్తులు ఆసక్తి చూపారు. కేటీఆర్ కూడా వారితో సరదాగా మాట్లాడారు.
రాజన్న సిరిసిల్ల జిల్లా ఓబులాపూర్ లో జరుగుతున్న సమ్మక్క - సారలమ్మ జాతరకు హాజరై వన దేవతలను దర్శించుకున్న మంత్రి శ్రీ @KTRTRS. pic.twitter.com/KExe8bGpsx
— TRS Party (@trspartyonline) February 18, 2022
అంతకుముందు కేటీఆర్ సిరిసిల్ల జిల్లాలో రైతు వేదిక సందర్భంగా మాట్లాడారు. తంగళ్లపల్లి మండలం బద్దెనపల్లిలో కేటీఆర్ రైతు వేదికను ప్రారంభించి ప్రసంగించారు. దేశంలో ఎక్కడా లేని విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 2,603 రైతు వేదికలను సీఎం కేసీఆర్ నాయకత్వంలో నిర్మించాం అని కేటీఆర్ తెలిపారు. రాజన్న సిరిసిల్ల జిల్లాలోని నీటి సంరక్షణ విధానాలు భారతదేశానికే దిక్సూచిగా మారాయని అన్నారు. యువ ఐఏఎస్‌లకు ఈ విధానాలు పాఠాలుగా మారడం పట్ల సంతోషం వ్యక్తం చేస్తున్నానని కేటీఆర్ పేర్కొన్నారు.
ప్రభుత్వం నిర్మించిన రైతు వేదికల ద్వారా రైతులను సంఘటితం చేస్తున్నామని కేటీఆర్ చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయానికి, రైతులకు మద్దతుగా ముందుకు వెళ్తుందని అన్నారు. ఈ రైతు వేదికల్లో స్థానిక రైతుబంధు సమితి అధ్యక్షులు, వ్యవసాయ విస్తరణ అధికారులు పరస్పరం సంప్రదించుకుంటూ.. సరైన పంటలపై అధ్యయనం చేస్తారని తెలిపారు. వ్యవసాయంలో జరుగుతున్న మార్పులు, ఏ రకమైన పంట వేస్తే లాభసాటిగా ఉంటుంది.. మార్కెట్‌లో డిమాండ్ ఉన్న పంటలపై చర్చిస్తారని అన్నారు.
ఒక ఆలోచనతో కూడిన అర్థవంతమైన వ్యవసాయం కోసం దేశంలో ఎక్కడా లేని విధంగా 5 వేల ఎకరాలకు ఒక క్లస్టర్ ఏర్పాటు చేసి వ్యవసాయ విస్తరణ అధికారులను నియమించామని తెలిపారు. దేశంలో ఎక్కడా లేని కార్యక్రమాలు అమలు చేస్తున్నామని అన్నారు. రైతుబంధు, రైతుబీమా, 24 గంటల నాణ్యమైన విద్యుత్‌ను రైతులకు ఇస్తున్నామని అన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లాకు గోదావరి జలాలు తరలి రావడంతో ఒకట్రెండు కాదు.. 6 మీటర్లు భూగర్భ జలాలు మీదకు వచ్చాయి అని మంత్రి కేటీఆర్ స్పష్టం చేశారు.