MP Bandi Sanjay: కామన్ మ్యాన్ లా గుడారాల్లో బండి సంజయ్.. కనీసం టీవీ కూడా లేదట
బీజేపీ తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ కొన్ని రోజులపాటు సామాన్యుడిలా గుడారాల్లో జీవితం గడపనున్నారు. కనీసం టీవీ కూడా లేకుండా జీవించనున్నారు.
బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ పాదయాత్రకు సిద్ధమయ్యారు. ఆగస్టు 24 నుంచి బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్ర ప్రారంభం కానుంది. ఈ యాత్రలో అత్యంత సామాన్యమైన జీవితాన్ని గడిపేందుకు సిద్ధమయ్యారు ఆయన. నిద్ర, బోజనం, వసతి ఏర్పాట్లన్నీ అత్యంత సాధాసీదాగా ఉండేలా చూసుకుంటున్నారు. పాదయాత్ర కొనసాగినన్ని రోజులు గుడారాలు వేసుకుని అందులోనే నిద్రించాలని నిర్ణయించారు. తనతోపాటు పాదయాత్ర చేసే ముఖ్యులు సైతం గుడారాల్లోనే బస చేసేలా ఏర్పాట్లు చేయనున్నారు. గుడారాల్లో మంచం, ఫ్యాన్ చదవడానికి పత్రికలు మాత్రమే ఉండేలా ప్లాన్ చేశారు.
ఇప్పటి వరకూ చూసుకుంటే.. పాదయాత్రలు చేసిన వివిధ రాజకీయ పార్టీల ప్రముఖులు తమ వసతి, భోజనం, నిద్ర వంటివి పక్కాగా ఉండేలా ప్లాన్ చేశారు. రాత్రి విడిది కోసం ఆధునిక హంగులతో ఉండేలా చూసుకుంటారు. ఏ రోజుకారోజు పాదయాత్ర ముగిసిన వెంటనే.. ఆయా వాహనాల్లోకి వెళ్లి ఫ్రెష్ అయి.., భోజనం చేసి అందులోనే నిద్రించేవారు. బండి సంజయ్ పాదయాత్రలో మాత్రం సామాన్యుడిలా ఉండాలని నిర్ణయించారట.
Also Read: Minister KTR: 'నాన్న నన్ను ఐఏఎస్ చేయాలనుకున్నారు'.. 'ఆ పని చేసే వరకూ కేసీఆర్ వదిలిపెట్టరు'
'నా పాదయాత్ర ముఖ్య ఉద్దేశం జనంలోనే ఉంటూ జనం బాధలు పంచుకోవడం. జనంతో కలిసిపోయి వారి కష్టనష్టాలు పంచుకోవాలంటే వారి సొంత మనిషిలా ఉండాలి. అందుకే సామాన్య జనం ఏ విధంగా గడుపుతారో.. నేను కూడా పాదయాత్ర కొనసాగినన్ని రోజులు అట్లాగే ఉండాలని నిర్ణయించుకున్నా. అందుకు అనుగుణంగా ఏర్పాట్లు చేయండి' అని వసతి ఏర్పాట్లు పర్యవేక్షిస్తున్న పాదయాత్ర కమిటీ సభ్యులకు సూచించారు.
పాదయాత్రలో నడిచేందుకు సిద్ధంగా ఉన్న యువత, కార్యకర్తల, నాయకుల పేర్లను జిల్లాల నుంచి తెప్పించుకునే పనిలో పాదయాత్ర కమిటీ నిమగ్నమైంది. వారందరికీ అవసరమైన గుడారాలు వేయడం.. కష్టమైనందున ప్రతి రోజు పాదయాత్ర ఎక్కడ ముగుస్తుందో...అక్కడికి సమీపంలోని ఫంక్షన్ హాల్ లేదా విద్యా సంస్థల్లో బస ఏర్పాటు చేసే ఆలోచనలో ఉన్నారు.
తొలిదశ ‘ప్రజా సంగ్రామ యాత్ర’ 40 రోజులు సాగనుంది. కొద్దిరోజులు గ్యాప్ ఇచ్చి మలిదశ పాదయాత్ర చేపట్టాలని సంజయ్ భావిస్తున్నారు. ఏడాది పొడవునా పాదయాత్ర చేస్తూ జనం మధ్యలో ఉండేలా తన షెడ్యూల్ ప్లాన్ చేసుకుంటున్నారు. ‘జనంతోనే ఉంటా. జనం బాధలు వింటా. జనానికి అండగా ఉంటా. జనం సమస్యలే ఎజెండాగా ప్రజాస్వామ్యయుతంగా ఉద్యమ కార్యాచరణను రూపొందిస్తా. అంతిమంగా తెలంగాణ భవిష్యత్తు మార్చేలా పాదయాత్రను కొనసాగిస్తా’ అని సంజయ్ చెబుతున్నారు.
Also Read: CM Jagan Review: పెళ్లిళ్లకు 150 మందికే అనుమతి.. లక్షణాలు కనిపిస్తే.. వెంటనే ఆ పని చేయాలి