TSPSC Paper Leak: టీఎస్పీఎస్సీ కేసులో మరో అరెస్టు, ఇప్పటిదాకా 15 మంది - అన్ని జిల్లాలకీ పాకిన క్వశ్చన్ పేపర్?
తిరుపతయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో, ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా జరిగిన మొత్తం అరెస్టులు 15కు చేరాయి.
తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (టీఎస్పీఎస్సీ)కి చెందిన ప్రభుత్వ ఉద్యోగ నియామకాల పరీక్ష పేపర్ల లీకేజీ వ్యవహారంలో ప్రత్యేక దర్యాప్తు టీమ్ (సిట్) అధికారులు మరొకరిని అరెస్టు చేశారు. తిరుపతయ్య అనే వ్యక్తిని అదుపులోకి తీసుకోవడంతో, ఈ వ్యవహారంలో ఇప్పటిదాకా జరిగిన మొత్తం అరెస్టులు 15కు చేరాయి. మరోవైపు, నేడు రెండో రోజు సీసీఎస్ నుంచి సిట్ ఆఫీసుకు తరలించి విచారణ జరుపుతోంది. ఏ1 ప్రవీణ్, ఏ2 రాజశేఖర్, ఏ4 డాక్య, ఏ5 కేతావత్ రాజేశ్వర్‌లను మూడు రోజుల కస్టడీకి కోర్టు ఇటీవల అప్పగించింది. దీంతో నేడు రెండోరోజు వారిని సిట్ అధికారులు విచారిస్తున్నారు. ఏ10 షమీమ్, ఏ11 సురేష్, ఏ12 రమేష్‌లను ఆరు రోజుల పాటు కస్టడీకి ఇవ్వాలని ఇటీవల సిట్ పిటిషన్ దాఖలు చేసింది. ఈ పిటిషన్‌పై నేడు కోర్టులో విచారణ జరగనుంది.
ఈ కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న ప్రవీణ్, రాజశేఖర్, డాక్యా నాయక్, రాజేశ్వర్, రేణుక తదితరులను తొలుత అదుపులోకి తీసుకొని సిట్ విచారణ చేయగా కీలక వివరాలు వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. పరీక్ష పేపర్లు కొందరు వ్యక్తులకు మాత్రమే లీక్ కాలేదని, దాదాపు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకూ ఇవి చేరాయని తెలిసింది. క్వశ్చన్ పేపర్ కొన్న అభ్యర్థులు అందుకు తాము ఖర్చు పెట్టిన మొత్తాన్ని తిరిగి రాబట్టుకోవాలనే దురుద్దేశంతో ఆ పేపర్‌ను మరొకరికి భారీ మొత్తానికి అమ్మారని తేలింది. ఇలా ప్రతి ఒక్కరూ ఇంకొకరికి విక్రయిస్తూ వెళ్లడంతో ఇది మల్టీ లెవెల్ మార్కెటింగ్ మాదిరిగా సాగిందని సిట్ అధికారుల దర్యాప్తులో వెల్లడి అయింది. ఇలా చైన్ సిస్టమ్‌లో సాగిన ప్రశ్నపత్రాల లీకేజీ కుంభకోణంలో కోట్లాది రూపాయలు చేతులు మారినట్లు అధికారులు భావిస్తున్నారు.
ప్రధాన నిందితులైన ప్రవీణ్, రాజశేఖర్, ఢాక్యా నాయక్, రాజేశ్వర్‌లను సిట్ అధికారులు కస్టడీలోకి తీసుకొని విచారణ చేస్తున్న సమయంలోనే మరికొన్ని కొత్త పేర్లు వెలుగులోకి వస్తున్నాయి. శనివారం సాయంత్రం రంగారెడ్డి జిల్లా ఫరూఖ్‌నగర్ మండలంలోని నేరళ్లచెరువు గ్రామానికి చెందిన రాజేందర్ కుమార్ అనే యువకుడిని సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ఇతని ద్వారా తిరుపతయ్య అనే మరో పేరు బయటికి వచ్చింది. రాజేందర్ కుమార్ మహబూబ్ నగర్‌లోని విశ్వేశ్వరయ్య ఇంజనీరింగ్ కాలేజీలో బి.టెక్ పూర్తి చేశాడు. గవర్నమెంట్‌లోనే ఓ డిపార్ట్ మెంట్‌లో కాంట్రాక్ట్ పద్ధతిలో సివిల్ ఇంజినీర్‌గా పని చేస్తుండేవాడు. కొన్నాళ్లకు ఉపాధి హామీలో క్వాలిటీ కంట్రోల్ అధికారిగా చేరాడు.
అదే సమయంలో మహబూబ్ నగర్ జిల్లా బాల్‌నగర్ మండలం గండేడుకు చెందిన తిరుపతయ్యతో పరిచయం అయినట్లు సమాచారం. రాజేందర్ అసిస్టెంట్ ఇంజనీరు పోస్టుకు ప్రిపేర్ అయ్యేందుకు దిల్‌సుఖ్ నగర్‌లో కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లో చేరగా, తాను పరీక్ష పశ్నపత్రాన్ని ముందుగానే ఇస్తానని, ఇందుకు రూ.10 లక్షలివ్వాలని తిరుపతయ్య చెప్పినట్లు తెలిసింది. దీంతో రాజేందర్‌కుమార్ ముందుగా రూ.5 లక్షలు ఇచ్చి, మిగతా డబ్బు ఫలితాల తర్వాత ఇస్తానని ఒప్పందం చేసుకున్నట్లు సమాచారం. నవాబ్‌పేట్ మండలంలో ఉపాధి హామీ పథకంలో పనిచేస్తున్న ప్రశాంత్ నుంచి తిరుపతయ్య ఈ పేపర్‌ను తెచ్చి ఇచ్చినట్లు సమాచారం. తాజాగా నేడు జరుపుతున్న విచారణలో మరిన్ని వివరాలు బయటికి వచ్చే అవకాశం ఉంది.