Secunderabad: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఎయిర్‌పోర్ట్ తరహా భద్రత- ప్లాట్‌ఫామ్‌పైకి ప్రయాణికులకు మాత్రమే ఎంట్రీ.. ఎప్పటి నుంచి అంటే..!
Telangana: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ ఆధునికీకరణ తర్వాత చాలా మార్పులు జరగనున్నాయి. ముఖ్యంగా భద్రతకు అధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. ఎయిర్‌పోర్టు తరహా వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నారు.
Secunderabad Railway Station Modernization: సికింద్రాబాద్ రైల్వేస్టేషన్... దక్షిణ మధ్య రైల్వేలో ప్రధాన స్టేషన్. నిత్యం లక్షలాది మంది ప్రయాణికులతో రద్దీగా ఉంటుంది. ప్లాట్‌ఫామ్‌లు కూడా కిక్కిరిసి ఉంటాయి. ఎవరు వస్తున్నారో.. ఎవరు వెళ్తున్నారో.. ఎవరు ప్రయాణికులో... ఎవరు కాదో కూడా తెలియని పరిస్థితి. ఈ విధానం త్వరలోనే మారబోతోంది. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ రూ.700 కోట్ల రూపాయల వ్యయంతో అత్యాధునిక హంగులతో సరికొత్తగా రూపుదిద్దుకుంటోంది. రీడెవలప్‌మెంట్‌లో భాగంగా... ఎన్నో మార్పులు జరగబోతున్నాయి. ముఖ్యంగా... భద్రతకు అధిక ప్రాధాన్యం ఇస్తున్నారు. అందుకోసం సరికొత్త వ్యవస్థను తీసుకొస్తున్నారు. అంతేకాదు.. ఇంకా ఎన్నెన్నో మార్పులు చేయబోతున్నారు. అవేంటో తెలుసుకుందామా..!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో త్వరలోనే బ్యాగేజీ స్క్రీనింగ్ వ్యవస్థ...
ఎయిర్‌పోర్టుల్లో.. బ్యాగేజీ స్క్రీనింగ్ అనేది తప్పనిసరి. ప్రయాణికులు తెచ్చిన లగేజ్‌ని చెక్ చేసిన తర్వాతే... వారికి ఎంట్రీ ఉంటుంది. కానీ.. రైల్వేస్టేషన్లలో అలా ఉండదు. ముఖ్యంగా సికింద్రాబాద్ రైల్వేస్టేషన్ (Secunderabad Railway).. ఎప్పుడూ రద్దీగానే ఉంటుంది. ప్లాట్‌పామ్‌లపై.. ఎప్పుడూ ప్రయాణికులు వేచి ఉంటారు. మరి వారి భద్రత విషయం ఏంటి..? చేతిలో బ్యాగ్‌తో వచ్చినవారంతా ప్రయాణికులు కానవసరం లేదు...? ఇటీవల... గంజాయి, డ్రగ్స్ అక్రమ రవాణా రైళ్లు మార్గంలో కూడా జరుగుతోంది. అందుకే... ఏ బ్యాగ్‌లో ఏముందో తెలుసుకోవడం ముఖ్యం. ఇవన్నీ ఆలోచించి... సికింద్రాబాద్ ఆధునికీకరణ పనుల్లో భాగంగా... భద్రతకు పెద్దపీట వేస్తున్నారు. ప్రయాణికుల లగేజ్‌ను చెక్ చేసిన తర్వాతే.. స్టేషన్‌లోకి అనుమతించబోతున్నారు. సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌కు రెండు ప్రవేశ మార్గాలు ఉన్నాయి. ఒకటో నెంబర్, 10వ నెంబర్ ప్లాట్‌ఫామ్ నుంచి స్టేషన్‌లోకి ఎంట్రీ ఉంటుంది. ఒక్కో మార్గంలో 3 కోట్ల రూపాయల చొప్పున... రెండు మార్గాల్లో ఆరు కోట్ల రూపాయలతో బ్యాగేజీ స్క్రీనింగ్ వ్యవస్థ (Baggage screening system) ను ఏర్పాటు చేయబోతున్నారు. ప్రయాణికులు రెండు మార్గాల్లో.. ఏ వైపు నుంచి వచ్చినా... లగేజ్ చెక్ (Luggage checking) చేసుకోనిదే లోపలికి వెళ్లనివ్వరు. ట్రైన్ టైమ్ అయిపోతున్నా సరే... లగేజీ చెకింగ్ తర్వాతే.. స్టేషన్‌లోకి ఎంట్రీ ఉంటుంది. కనుక.. ఎయిర్‌పోర్టు(Airport)లో ఫ్లయిట్ టైమ్ కంటే.. గంట, రెండు గంటల ముందు వెళ్లినట్టు... సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో కూడా ఈ విధానాన్ని పాటించాల్సిందే. ఎక్కాల్సిన రైలు సమయం కంటే... ముందుగా వస్తేనే... చెకింగ్ ప్రొసీజర్ పూర్తి చేసుకుని.. ప్లాట్‌ఫామ్‌కి చేరుకోగలరు.
ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లేందుకు కూడా... కండిషన్స్ ఉన్నాయి..!
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ప్రస్తుతం... టికెట్ ఉన్నవారు నేరుగా ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లిపోతారు. టికెట్ లేని వారు... కౌంటర్ల దగ్గర టికెట్ కొనుక్కుని.. ప్లాట్‌ఫామ్‌పైకి వెళ్లిపోతారు. కానీ... ఆధునికీకరణ పనులు పూర్తయిన తర్వాత... అలా కుదరదు. అంతా కొత్త రూల్స్... కొత్త విధానాలే. ఎంట్రీ పాయింట్ దగ్గర బ్యాగేజీ చెకింగ్ అయిపోయాక... వెయిటింగ్ హాల్లో (waiting hall) ఉండాలి. రైలు వచ్చేందుకు పదిహేను నిమిషాల ముందు.. స్టేషన్‌లో అనౌన్స్‌మెంట్ ఇస్తారు. అచ్చం ఎయిర్‌పోర్టుల్లో మాదిరిగానే. రైలు వస్తోందని అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాతనే ప్లాట్‌ఫామ్(Platform)పైకి వెళ్లాలి. అది కూడా టికెట్ ఉన్న వారు మాత్రమే.
ప్లాట్‌ఫామ్‌పైకి ప్రయాణికులకు మాత్రమే అనుమతి...
సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో ఇప్పటి వరకు... ప్లాట్‌ఫామ్‌పైకి ఎవరు వెళ్తున్నారు.. వారి ప్రయాణికులు ఎంత మంది. వారి కోసం వచ్చిన బంధువులు ఎంత మంది... అనేది తెలియదు. కానీ ఆధునికీకరణ తర్వాత.. కొత్త రూల్స్ అమలు చేయబోతున్నారు. ప్లాట్‌ఫామ్‌పైకి ప్రయాణికులను మాత్రమే అనుమతిస్తారు. బ్యాగేజీ స్క్రీనింగ్ అయిపోయి... వెయిటింగ్ హాల్లో.. ఎదురుచూసి.. రైలు అనౌన్స్‌మెంట్ వచ్చిన తర్వాత... ట్రైన్ టికెట్ ఉన్నవారిని మాత్రమే ప్లాట్‌ఫామ్‌కి వెళ్లనిస్తారు. వారితో వచ్చే బంధువులకు ఎంట్రీ ఉండదు. అంటే.. ఊరు వెళ్లే తమ వారికి వెయిటింగ్ హాల్ నుంచే సెండాఫ్ ఇవ్వాల్సి ఉంటుంది. ఇది కూడా ఎయిర్‌పోర్టు తరహాలోనే ఉంది కదూ.
సికింద్రాబాద్ రైల్వేష్టేషన్ ఆధునికీకరణ ఎప్పుడు పూర్తవుతుంది..?
మొత్తం రూ.700 కోట్లతో సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌ను ఆధునికీకరిస్తున్నాయి. ప్రస్తుతం 30శాతం పూర్తయినట్టు తెలుస్తోంది. 2026 నాటికి సరికొత్త రూపుతో... ప్రజలకు అందుబాటులోకి రానుంది సికింద్రాబాద్ రైల్వేస్టేషన్. ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా... రీడెవలప్‌మెంట్ పనులను శరవేగంగా కొనసాగిస్తున్నారు అధికారులు.
Also Read: ఏం జరుగుతున్నా బయటకు రాని కేసీఆర్ - కవితకు బెయిల్ వచ్చిన తర్వాతనే తెర మీదకు వస్తారా ?