TRS Harish: ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ శంకుస్థాపనకు హరీష్ ఎందుకెళ్లలేదు ? కేసీఆర్ ఆహ్వానించలేదా ?
ఢిల్లీలో టీఆర్ఎస్ భవన్ నిర్మాణం చారిత్రత్మకమైన విషయంగా పేర్కొంటూ చిన్నా చితకా నేతలంతా శంకుస్థాపనలో పాల్గొనేందుకు వెళ్లారు. కానీ హరీష్ రావు మాత్రం వెళ్లలేదు. ఎందుకని..?
తెలంగాణ రాష్ట్ర సమితి కీలక నేత, ఆర్థిక మంత్రి హరీష్ రావు ఏం చేసినా, చేయకపోయినా ఆ పార్టీలో ఎప్పుడూ హాట్ టాపిక్ అవుతూనే ఉంటుంది. ఎందుకంటే ఆయనదో ప్రత్యేక స్థానం. ఇప్పుడు కూడా ఆయనకు సంబంధించిన ఓ అంశంపై తెలంగాణ రాజకీయవర్గాల్లో విస్తృతంగా చర్చలు జరుగుతున్నాయి. అదేమిటంటే.. ఢిల్లీలో నిర్మించే టీఆర్ఎస్ భవన్ శంకుస్థాపనకు మంత్రులు అందరూ వెళ్లారు కానీ హరీష్ రావు మాత్రం వెళ్లలేదు. ఆ రోజున టీఆర్ఎస్ జెండా పండుగను తన నియోజకవర్గం సిద్ధిపేటలో నిర్వహించారు. గతంలో టీఆర్ఎస్ తరపున ఏ కార్యక్రమం చేపట్టిన ముందుగా హరీష్ ఉండేవారు. రెండు రోజులు ముందుగానే వెళ్లి అక్కడ పనులను చక్క బెట్టేవారు. కానీ ఈ సారి అసలు ఆ కార్యక్రమానికే వెళ్లలేదు.
Also Read : తెలంగాణకు ఒకే రోజు అమిత్ షా, రాహుల్ గాంధీ
అయితే టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఆహ్వానించలేదా లేకపోతే ఆహ్వానించినా హరీష్ రావు వెళ్లలేదా అన్న చర్చ టీఆర్ఎస్‌లో జరుగుతోంది. సాధారణంగా కేసీఆర్ పాల్గొనే కార్యక్రమాల్లో కేటీఆర్ అతి తక్కువగా పాల్గొంటారు. కేటీఆర్ ఢిల్లీకి వెళ్లారు కానీ హరీష్ రావు వెళ్లలేదు. అలాగే కేసీఆర్ ఆహ్వానించిన తర్వాత హరీష్ వెళ్లకపోవడం అనేది ఉండదని అది అసాధ్యమని టీఆర్ఎస్‌లో తలపండిపోయిన నేతలు చెబుతున్నారు. హరీష్‌రావును కేసీఆర్ ఆహ్వానించలేదనేది ఎక్కువ నమ్మాల్సిన విషయం అని అంటున్నారు. అయితే మంత్రులను ఇతర పార్టీ ముఖ్యనేతలను ఢిల్లీకి తీసుకెళ్లి కేసీఆర్ ఒక్క హరీష్‌ను మాత్రం ఎందుకు దూరం పెడతారనేది చాలా మందికి అర్థం కాని విషయం.
Also Read : హుజురాబాద్‌లో నిరుద్యోగులతో షర్మిల పార్టీ నామినేషన్లు
ఈటల రాజేందర్‌ను కేబినెట్ నుంచి బర్తరఫ్ చేసిన తర్వాత హరీష్ రావుకు కేసీఆర్ ప్రాధాన్యం పెంచారు. ఈటలను ఆరోగ్య శాఖ నుంచి తప్పించి వాటిని సీఎం కేసీఆరే తీసుకున్నారు. అయితే అనధికారికంగా ఆ బాధ్యతలు చూసుకోవాలని హరీష్ రావుకు సచించారు. దాంతో ఆర్థిక శాఖతో పాటు ఆరోగ్య శాఖపై కూడా సమీక్షలు చేశారు. తర్వాత ఉద్యోగాల భర్తీ అంశాన్నీ టేకప్ చేశారు. తర్వాత రాజకీయంగా కూడా కేసీఆర్ ప్రాధాన్యం పెంచారు. హుజురాబాద్ బాధ్యతలు ఇచ్చారు. దాంతో మిషన్ హుజురాబాద్‌ను హరీష్ రావు ప్రారంభించారు. చేరికలతో పాటు ఈటలపైనా తనదైన శైలిలో విరుచుకుపడుతున్నారు. అయినప్పటికీ హరీష్ రావుకు పార్టీలో తగినంత ప్రాధాన్యత ఇవ్వడం లేదని .. దానికి ఢిల్లీ టూరే సాక్ష్యమని కొంత మంది టీఆర్ఎస్ నేతలు విశ్లేషిస్తున్నారు.
Also Read : కొత్త గూడెం ఎమ్మెల్యేకు సన్ స్ట్రోక్
నిజానికి రెండో సారి టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన తర్వాత హరీష్ కు ప్రాధాన్యం పూర్తిగా తగ్గిపోయింది. మంత్రి పదవి కూడా అతి కష్టం మీద లభించింది. అప్పట్లో ఈటలకు కూడా మంత్రి పదవి ఆలస్యంగానే లభించింది. కేసీఆర్ వ్యూహాలు రచిస్తే ఉద్యమంలో ఈటల - హరీష్ వాటిని అమలు చేశారు. వారి మధ్య మంచి సాన్నిహిత్యం ఉందన్న అభిప్రాయం ఉంది. అందుకే ఈటల రాజేందర్ పద్దెనిమిదేళ్లు కలిసి పని చేశామని ఉద్యమ సహచరులమని తరచూ గుర్తు చేస్తూ ఉంటారు. ఈ పరిణామాలు టీఆర్ఎస్‌లో కొత్త చర్చకు కారణం అవుతున్నాయి.