Breaking News: హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్.. మరో గంటలో భారీ నుంచి అతి భారీ వర్షాలు
ఆంధ్రప్రదేశ్, తెలంగాణ సహా దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 6న జరిగే తాజా వార్తలు ఎప్పటికప్పుడు ఇక్కడ చూడొచ్చు. ఈ పేజీ అప్ డేట్ అవుతుంటుంది. బ్రేకింగ్ న్యూస్ కోసం ఈ పేజీని రీఫ్రెష్ చేస్తూ ఉండండి.

Background
తెలంగాణ రాష్ట్రం సిద్దిపేట జిల్లా గజ్వేల్ మండలం ప్రజ్ఞాపూర్ రాజీవ్ రహదారిపై ఘోర రోడ్డు ప్రమాదం తప్పింది. వేములవాడ ఆర్టీసీ డిపోకు చెందిన సూపర్ లగ్జరీ బస్సు సోమవారం తెల్లవారుజామున 4 గంటలకు వేములవాడ నుంచి సిరిసిల్ల, సిద్ధిపేట మీదుగా హైదరాబాద్‌కు వస్తుంది. ప్రజ్ఞాపూర్ వద్దకు చేరుకోగానే రాజీవ్ రహదారి నుంచి జగదేవపూర్ వైపు వెళ్తున్న కంటైనర్‌ను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న 20 మందికి గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో గజ్వేల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.
వైసీసీ నేతల ధనదాహానికి వ్యవస్థలు కూలిపోతున్నాయి.. టీడీపీ నేత సోమిరెడ్డి
సర్వేపల్లిలో ప్రభుత్వ భూమి మాయమవుతోందని.. అధికార పార్టీ వైసీసీ నేతల ధనదాహానికి వ్యవస్థలు సైతం కూలిపోతున్నాయని టీడీపీ నేత, మాజీ మంత్రి సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి ఆరోపించారు. చిల్లకూరులో 250 ఎకరాల ప్రభుత్వ భూమి, నెల్లూరు కాకుటూరులో రూ.60 కోట్ల విలువైన భూమి ఎలా మాయమైందో చెప్పాలని వైసీపీ నేతలను ఆయన ప్రశ్నించారు. ఎమ్మార్వోలు ఫిర్యాదు చేసినా ఏపీలో కేసులు నమోదు కావడం లేదన్నారు.
హైదరాబాద్‌కు రెడ్ అలర్ట్
హైదరాబాద్ నగరానికి వాతావరణ అధికారులు అతి భారీ వర్ష హెచ్చరిక జారీ చేశారు. మరో గంటలో భారీ వర్షం పడుతుందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు. నగరంలో రెడ్ అలర్ట్ జారీ చేశారు. వాతావరణ అధికారుల సూచనతో జీహెచ్ఎంసీ అధికారులు కూడా అప్రమత్తమయ్యారు. విరామం లేకుండా 6 నుంచి 8 గంటల పాటు వర్షం పడే అవకాశం ఉందని అధికారులు హెచ్చరించారు. ప్రజలు ఇళ్లనే ఉండాలని అధికారులు సూచించారు. సహాయం కోసం 040 – 2955 5500 నంబర్‌ను సంప్రదించాలని జీహెచ్ఎంసీ అధికారులు సూచించారు.





















