World Cup 2025 Winner India | విశ్వవిజేత భారత్.. ప్రపంచకప్ విజేతగా టీమిండియా మహిళా టీమ్ | ABP Desam
టీమిండియా విశ్వవిజేతగా అవతరించింది. విమెన్స్ వన్డే వరల్డ్ కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో సౌతాఫ్రికాను 52 పరుగుల తేడాతో మట్టికరిపించి. దశాబ్దాలుగా కలగా మిగిలిపోయిన ప్రపంచ కప్‌ని సొంతం చేసుకుంది. ఓపెనింగ్‌లో 87 రన్స్‌తో షెఫాలీ వర్మ బౌండరీల మోత మోగిస్తే.. మిడిలార్డర్‌లో దీప్తి శర్మ 57 రన్స్‌తో మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్సింగ్స్ ఆడి స్కోర్ బోర్డుని 298 వరకు తీసుకెళ్లింది. ఇంత స్కోరు చేయడంతో టీమిండియా గెలవడం పక్కా అనిపించింది. దానికి తోడు సౌతాఫ్రికా ఛేజింగ్‌లో అంత స్ట్రాంగ్ టీమ్ కాకపోవడంతో మనదే గెలుపింక అనుకున్నాం. కానీ.. సఫారీలు అంత ఈజీగా ఓటమిని ఒప్పుకోలేదు. ముఖ్యంగా ఓపెనర్‌గా వచ్చిన లోరా వోల్‌వార్డ్‌ట్ అస్సలు ఒప్పుకోలేదు. ఒకపక్క మిగిలిన బ్యాటర్లంతా అవుట్ అవుతున్నా.. ఇంకో ఎండ్‌లో పాతుకుపోయి.. ఏకంగా సెంచరీ బాదేసింది. దీంతో మన ప్లేయర్లపై కూడా ప్రెజర్ పెరిగిపోవడంతో.. ఫీల్డింగ్ తడపడింది. ఈజీగా చేతుల్లోకొచ్చిన లడ్డూ ల్లాంటి క్యాచ్‌లని కూడా వదిలేయడంతో పాటు.. ఆపగలిగే బౌండరీలను కూడా ఆపలేకపోయారు. ఇంకేముంది సౌతాఫ్రికా గెలిచేస్తుందేమో అని ఇండియన్ ఫ్యాన్స్‌లో టెన్షన్ మొదలైంది. కానీ స్కోర్ ఎక్కువగా ఉండటంతో.. నెమ్మదిగా రిక్వైర్డ్ రన్‌రేట్ పెరుగుతూ పోయింది. అదే టైంలో 101 రన్స్ చేసిన లోరా.. దీప్తి శర్మ బౌలింగ్‌లో లాంగాఫ్ మీదుగా భారీ షాట్ ఆడబోయి.. అమన్‌జోత్ సింగ్‌కి క్యాచ్ ఇచ్చి అవుటైపోయింది. ఆ వికెట్‌తో ఇండియా విజయం ఖాయమైపోయింది. ఇక మిగిలిన ముగ్గురు బ్యాటర్లు కొంచెం సేపు ఫైట్ చేసినా.. దీప్తి శర్మ మరో రెండు వికెట్లు తీయడంతో పాటు.. ఓ రనౌట్ చేయడంతో సౌతాఫ్రికా ఫైట్‌కి తెరపడింది. ఇండియా విశ్వవిజేతగా నిలిచింది.





















