Ola కు గోవా రవాణా శాఖ షాక్ - సర్వీస్ సమస్యలతో ఎలక్ట్రిక్ స్కూటర్‌లకు అమ్మకాలు నిలిపివేత
Ola Electric Scooter Sales: ఓలా ఎలక్ట్రిక్ స్కూటర్‌లపై ఫిర్యాదులతో, గోవా రవాణా శాఖ రంగంలోకి దిగింది. కొత్త రిజిస్ట్రేషన్లు నిలిపి, సర్వీస్ సపోర్ట్ పరంగా స్పష్టత ఇవ్వమని ఆ కంపెనీని ఆదేశించింది.

Ola Electric Scooter Sales Stopped: గోవా రవాణా శాఖ ఓలా ఎలక్ట్రిక్‌పై కఠిన చర్య తీసుకుంది. ఆ రాష్ట్రవ్యాప్తంగా స్కూటర్ యజమానుల వద్ద నెలలుగా వస్తున్న ఫిర్యాదులు, సర్వీస్ ఆలస్యాలు, మరమ్మతుల లోపాలు, స్పేర్‌పార్ట్‌లు లేకపోవడం లాంటి సమస్యలు ఈ నిర్ణయం వెనుక ఉన్నాయి.
రవాణా శాఖ ఓలా ఎలక్ట్రిక్ కంపెనీ ట్రేడ్ సర్టిఫికేట్‌ను సస్పెండ్ చేసి, వాహన్ పోర్టల్‌లో కొత్త రిజిస్ట్రేషన్లను నిలిపివేసింది. దాంతో గోవాలో కొత్త ఓలా స్కూటర్‌ల అమ్మకాలు తాత్కాలికంగా ఆగిపోయాయి. ఇది, అధికారుల వద్ద నుంచి వచ్చిన కఠిన సిగ్నల్‌గా భావిస్తున్నారు.
స్కూటర్లు నెలల తరబడి గారేజ్‌లోనే...
గత కొన్ని వారాలుగా వందలాది ఓలా యజమానులు పాంజిమ్‌లోని TRO ఆఫీస్‌కు క్యూ కట్టి, తమ సమస్యలను వెళ్లబోసుకున్నారు. స్కూటర్‌లు చాలా కాలంగా గారేజ్‌లలో ఉండిపోవడం, సర్వీస్ టీమ్ సరిగ్గా స్పందించకపోవడం, వారంటీ పాలసీలు క్లియర్‌గా లేకపోవడం, రిజిస్ట్రేషన్ సర్టిఫికేట్‌లు రాకపోవడం వంటి సమస్యలు తమకు రోజువారీ ఇబ్బందిగా మారాయని వివరించారు.
“ఓలా కంపెనీ తరఫున స్పష్టమైన చర్యలు లేవంటూ వినియోగదారులు కన్జ్యూమర్ కోర్ట్ వద్ద ఫిర్యాదు చేయాలని మేం సూచించాం. సర్వీస్ సపోర్ట్ బ్రేక్‌డౌన్ తీవ్రంగా ఉందని మేం గమనించాం” - TRO అధికారులు
ముఖ్యమంత్రి కార్యాలయం జోక్యం చేసుకున్నా...
ఓలా తాత్కాలికంగా కొన్ని సర్వీస్ టీమ్‌లను అమర్చినప్పటికీ, సమస్యల భారం తగ్గలేదు. ఈ విషయంలో సాక్షాత్తూ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా జోక్యం చేసుకుంది. అయినప్పటికీ సమస్య తాత్కాలికంగానే తగ్గింది తప్ప పూర్తి పరిష్కారం లభించలేదు.
“ఇప్పటికీ స్థిరమైన పరిష్కారం కనబడటం లేదు. కంపెనీ తరఫున సంఘటిత సేవా నెట్‌వర్క్ (Integrated service network) కావాలి” అని రవాణా శాఖ అధికారి ఒకరు అన్నారు.
ఓలా ట్రేడ్ సర్టిఫికేట్ సస్పెన్షన్ తరువాత, గోవాలో ఎలక్ట్రిక్ వాహన యజమానులు ఏకమయ్యారు. కంపెనీపై చట్టపరమైన చర్యలకు సిద్ధమయ్యారు. వినియోగదారుల హక్కుల రక్షణ కోసం కఠిన నిబంధనలు, కంపెనీలపై బాధ్యత వంటివి తప్పనిసరిగా ఉండాలనే వాదన గట్టిగా వినిపిస్తున్నారు.
ఇతర EV కంపెనీలకు కూడా ఇది హెచ్చరిక
ఈ పరిణామం ఓలా ఎలక్ట్రిక్‌కే కాకుండా ఇతర EV తయారీ కంపెనీలకు కూడా ఒక హెచ్చరికగా మారింది. TRO అధికారులు స్పష్టంగా చెప్పిన మాట ఒకటే - “తగిన ఆఫ్టర్ సేల్స్ సపోర్ట్ కలపకపోతే కొత్త సేల్స్‌కు అనుమతి రాదు”.
ప్రస్తుతం, ఓలా స్కూటర్ యజమానులు వారంటీ, సర్వీస్ రిప్లేస్‌మెంట్‌లపై స్పష్టత కోసం వేచి ఉన్నారు. గోవాలో EV మార్కెట్ పెరుగుతున్న సమయంలో ఈ ఘటన వినియోగదారుల నమ్మకంపై ప్రభావం చూపే అవకాశం ఉంది. ఓలా ఎలక్ట్రిక్ వైపు నుంచి త్వరగా ఇంటిగ్రేటెడ్ సర్వీస్ నెట్‌వర్క్ రూపొందించకపోతే, స్కూటర్ అమ్మకాల నిలిపివేత దీర్ఘకాలికంగా మారే అవకాశం ఉంది.
గోవా రవాణా శాఖ తీసుకున్న ఈ చర్య, ఎలక్ట్రిక్ వాహన రంగంలో “సర్వీస్ ముందు - సేల్స్ తరువాత” అనే సూత్రాన్ని సూచిస్తోంది. ఓలా ఎలక్ట్రిక్ ఇకనైనా వినియోగదారుల నమ్మకాన్ని తిరిగి పొందగలదా అన్నది ప్రధాన ప్రశ్నగా మారింది.
ఇంకా ఇలాంటి ఆటోమొబైల్ వార్తలు & అప్‌డేట్స్ - "ABP దేశం" 'ఆటో' సెక్షన్‌ని ఫాలో అవ్వండి.





















