కాంగ్రెస్ ప్రభుత్వంలో ఆటోడ్రైవర్లుకు అన్యాయం జరుగుతోందా.. వాస్తవాలేంటి..!?
తెలంగాణ వ్యాప్తంగా 8లక్షల మంది ఆటోడ్రైవర్లున్నారు. వీరిలో రెండున్నర లక్షల మంది ఒక్క హైదరాబాద్ నగరంలోనే ఆటోలు నడుపుతున్నారు. ఫ్రీ బస్సు ప్రభావం వల్ల తెలంగాణలో 161 మంది ఆటోడ్రైవర్లు బల్వన్మరణానికి పాల్పడ్డారంటూ ఇటీవల బీఆర్ ఎస్ పార్టీ ముఖ్యనేతలు, మాజీ మంత్రులు ఆటోలో తిరుగుతూ నిరసనలు చేపట్టిన విషయం తెలిసిందే. అయితే బీఆర్ ఎస్ ఆరోపిస్తున్నట్లు 161 మంది ఆటోడ్రైవర్లు బల్వన్మరణానికి పాల్పడం వాస్తవం కాదంటున్నాయి ఏఐటీయూసీ వంటి మిగతా ఆటోయూనియన్లు.ఫ్రీ బస్సు ప్రభావం ఆటోడ్రైవర్లపై ఉన్నమాట వాస్తవమే కానీ, కేవలం ఫ్రీ బస్సు పథకం వల్లనే అంతమంది ప్రాణాలు తీసుకోలేదంటున్నాయి.
తెలంగాణలో గత రెండేళ్లుగా అధికారంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం , ఎన్నికల మ్యానిఫెస్టోలో ఆటోడ్రైవర్లకు సైతం అనేక హామీలు ఇచ్చింది. ప్రతీ ఏడాది ఆటోడ్రైవర్లకు 15వేల రుపాయలు ఆర్దికసహాయం చేస్తామన్నారు. ఇదే విషయాన్ని గత ఎన్నికల మ్యానిఫెస్టోలో పెట్టడంతోపాటు, మీడియా సమక్షంలో ప్రకటించారు. రెండేళ్లు కావొస్తన్నా నేటికీ ఆటోడ్రైవర్లకు ఒక్క పైసా ఇవ్వలేదు. పొరుగున్న ఆంధ్రప్రదేశ్ లో గత నెలలో చంద్రబాబు సైతం ఆటోడ్రైవర్లకు ఇచ్చిన హామీ నిలబెట్టుకున్నారు.కానీ తెలంగాణలో మాత్రం ఆటోడ్రైవర్లను పట్టించుకోవడంలేదనేది ప్రధాన ఆవేదన.





















