Jogi Ramesh Remand: నకిలీ మద్యం కేసు- ఈ 13 వరకు మాజీ మంత్రి జోగి రమేష్‌కు రిమాండ్
Jogi Ramesh: వైసీపీ నేత, ఏపీ మాజీ మంత్రి జోగి రమేశ్‌కు, ఆయన సోదరుడు జోగి రాముకు నవంబర్ 13 వరకు రిమాండ్ విధించారు.

AP Fake Liquor Scam | విజయవాడ: నకిలీ మద్యం తయారీ కేసులో ఏపీ మాజీ మంత్రి, వైఎస్సార్‌సీపీ (YSRCP) నేత జోగి రమేశ్, ఆయన సోదరుడు జోగి రాముకు నవంబర్ 13 వరకు రిమాండ్ విధించారు. న్యాయమూర్తి రిమాండ్ విధించిన తరువాత జోగి రమేశ్, జోగి రాములను విజయవాడ జైలుకు తరలించారు. అర్థరాత్రి దాటిన తరువాత న్యాయమూర్తి ఎదుట నిందితులను ప్రవేశపెట్టగా సోమవారం ఉదయం 5 గంటలకు న్యాయమూర్తి రిమాండ్ విధించారు.
12 గంటలపాటు విచారణ
సిట్ అధికారులు ఆదివారం ఉదయం జోగి రమేశ్‌ను, ఆయన సోదరుడు జోగి రామును అరెస్ట్ చేశారు. ఎన్టీఆర్ జిల్లా ఇబ్రహీంపట్నంలోని ఆయన నివాసంలో అదుపులోకి తీసుకున్న అధికారులు, అనంతరం జోగి రమేష్‌ను విజయవాడలోని ఎక్సైజ్ కార్యాలయానికి తరలించి దాదాపు 12 గంటలపాటు విచారణ జరిపారు. జోగి రమేశ్‌తో పాటు ఆయన సోదరుడు రాముని వేర్వేరుగా ప్రశ్నించారు. ఏ1 జనార్ధనరావుతో జోగి రమేశ్‌కు ఉన్న లింకులపై ఆరా తీశారు.
ఫోన్లు, సీసీటీవీ ఫుటేజీ స్వాధీనం
అరెస్ట్ తర్వాత జోగి రమేశ్ నివాసంలో అధికారులు తనిఖీలు నిర్వహించారు. జోగి రమేశ్‌తో పాటు ఆయన భార్య ఫోన్లను సీజ్ చేశారు. ఆయన నివాసంలో సీసీటీవీ ఫుటేజీని కూడా స్వాధీనం చేసుకున్నారు. ఈ ఫుటేజీతో పాటు సీజ్ చేసిన ఫోన్లలో ఏపీ నకిలీ మద్యం కేసు సంబంధిత కీలక ఆధారాలు లభించే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షలు చేయించారు. విజయవాడ గవర్నమెంట్ హాస్పటల్ వద్ద పోలీసులకు, జోగి రమేష్ అనుచరులు మధ్య వాగ్వాదం జరిగింది. తరువాత జోగి రమేశ్‌ను న్యాయమూర్తి ఎదుట హాజరు పరిచారు.
కల్తీ మద్యం కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న అద్దేపల్లి జనార్దనరావు (ఏ1) ఇటీవల పోలీసులకు ఇచ్చిన వాంగ్మూలంలో జోగి రమేశ్ పాత్ర గురించి వెల్లడించాడు. జోగి రమేశ్ ప్రోద్బలంతోనే తాను నకిలీ మద్యం తయారు చేసినట్లు జనార్దనరావు ఓ వీడియోలో తెలిపాడు. తనకు దాదాపు రూ. 3 కోట్లు సాయం చేస్తానని, ఆ డబ్బుతో ఆఫ్రికాలో డిస్టిలరీ ఏర్పాటు చేసుకోవచ్చని ఆశపెట్టడంతోనే ఈ నకిలీ మద్యం తయారీలోకి దిగానని జనార్దనరావు తన వాంగ్మూలంలో పేర్కొన్నాడు. ఏప్రిల్‌లో జోగి రమేశ్ తనను సంప్రదించి, జయచంద్రారెడ్డి సాయం తీసుకుని నకిలీ మద్యం తయారు చేయాలని సూచించారని చెప్పాడు. ఇబ్రహీంపట్నంలో స్టార్ట్ చేయాల్సిన యూనిట్‌ను తంబళ్లపల్లికి మార్చాలని చెప్పినట్లు కీలక విషయాలు వెల్లడించడం కలకలం రేపింది.
కాగా, విజయవాడ ఎక్సైజ్ కార్యాలయంలో విచారణ పూర్తి చేసిన సిట్ అధికారులు, జోగి రమేశ్‌కు విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి వైద్య పరీక్షలు నిర్వహించారు. వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను న్యాయమూర్తి ఎదుట హాజరుపర్చగా.. ఈ 13 వరకు రిమాండ్ విధిస్తూ తీర్పిచ్చారు.






















