New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2026 స్వాగత సంబరాల్లో విషాదం; వివిధ కారణాలతో ముగ్గురు మృతి
New Year Celebration Tragedy: ఆనందంగా సాగాల్సిన న్యూ ఇయర్ వేడుకల్లో విషాదం చోటు చేసుకుంది. తెలుగు రాష్ట్రాల్లో జరిగిన ఉత్సవాల్లో వివిధ కారణాలతో ముగ్గురు చనిపోయారు.

New Year Celebration Tragedy: తెలుగు రాష్ట్రాల్లో 2025కు వీడ్కోలు పలుకుతూ, 2026కు స్వాగతం పలికే క్రమంలో జరిగిన నూతన సంవత్సర వేడుకల్లో విషాదాలు చోటు చేసుకున్నాయి. పల్లె నుంచి పట్టణం వరకు సామాన్యులు, సెలబ్రిటీలు అంతా ఉత్సాహంగా వేడుకల్లో మునిగిపోయారు. పలు చోట్ల జరిగిన ఘోర ప్రమాదాలు, ఘర్షణలు పండగ పూట తీరని దుఃఖాన్ని నింపాయి.
అనంతపురంలో అమానవీయ ఘటన
అనంతపురం జిల్లా రాప్తాడు మండల పరిధిలోని హార్మోనీ సిటీలో అమానవీయ ఘటన జరిగింది. కొత్త సంవత్సరం సందర్భంగా ప్రముఖ ప్లే బ్యాక్ సింగర్ మంగ్లీ సహా ఇతర సెలబ్రిటీలు భారీ ఈవెంట్ నిర్వహించారు. ఈ ఈవెంట్ పనుల కోసం వెళ్లిన షౌకత్ అనే కుర్రాడు విద్యుత్ షాక్‌తో ప్రాణాలు కోల్పోయాడు. జనరేటర్ పవర్ సప్లైలో తలెత్తిన లోపం కారణంగా యువకుడు మృతి చెందాడు. అయితే దీన్ని పట్టించుకోకుండా ఈవెంట్ నిర్వాహకులు సెలబ్రేషన్స్‌లో మునిగిపోయారు. ఈవెంట్ వద్దకు మృతదేహాన్ని తీసుకెళ్లాలని చూసినా పోలీసులు వారిని అడ్డుకున్నారు. ఈవెంట్ కోసం వెయ్యి నుంచి పాతిక వందల వరకు వసూలు చేసిన నిర్వాహకులు భద్రతను గాలికి వదిలేశారని మృతుడి బంధువులు ఆరోపించారు.
జగద్గిరిగుట్టలో బిర్యానీ విషాదం
మేడ్చల్ జిల్లా జగద్గిరి గుట్ట పోలీస్ స్టేషన్ పరిధిలోని భవానీ నగర్‌లో స్నేహితులంతా కలిసి ఏర్పాటు చేసుకున్న విందు ప్రాణాంతకంగా మారింది. 31వ తేదీ రాత్రి మద్యం సేవించి, బిర్యానీ తిన్న మొత్తం 17 మంది తీవ్ర అస్వస్థతకు గురయ్యారు.
వీరిలో పాండు అనే 53ఏళ్ల వ్యక్తి మృతి చెందాడు. మరో 15 మంది అపస్మారక స్థితిలోకి వెళ్లారు. వేడుకల వేళ ఆహార నాణ్యత, మద్యంలో కల్తీ జరిగే అవకాశం ఉన్నందున ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
అంతర్వేది బీచ్‌లో విషాదం
కోస్తాంధ్రలో వేడుల కోసం యువతకు సముద్రం మృత్యు పాశమైంది. కాకినాడకు చెందిన ముగ్గురు యువకులు అంతర్వేది బీచ్‌కు తమ థార్ కారులో వెళ్లారు. రాత్రి 1 గంటల తర్వాత బీచ్‌లో డ్రైవ్ చేస్తుండగా అన్నా చెల్లెళ్ల గట్టు వద్ద మలుపును గమనించక పోవడంతో కారు నేరుగా సముద్రంలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదం నుంచి ఒక యువకుడు చాకచక్యంగా కారు నుంచి బయటకు దూకి ప్రాణాలు కాపాడుకున్నాడు. మరో యువకుడు కారుతో సహా సముద్రంలో మునిగిపోయాడు.
జగ్గయ్యపేటలో కేక్ కటింగ్ వివాదం
ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేట వేడుకల ఉత్సాహం హింసకు దారి తీసింది. తొర్రగుంటపాలెం రోడ్డుపై కొందరు యువకులు నడిరోడ్డుపై కేక్ కట్ చేయడానికి ప్రయత్నించారు. అదే సమయంలో కారులో వచ్చిన యువకులు వారితో ఘర్షణ పడ్డారు. ఈ వివాదం ముదిరింది. కారులో ఉన్న యువకులపై దాడి చేశారు. తీవ్ర గాయాలతో వారంతా ఆసుపత్రిలో చేరారు.



















