(Source: ECI/ABP News/ABP Majha)
Bypoll Politics : ఉపఎన్నిక వాయిదా వెనుక రాజకీయం ! టీఆర్ఎస్, బీజేపీల్లో ఎవరికి లాభం ?
హుజురాబాద్ ఉపఎన్నికల వాయిదాకు టీఆర్ఎస్‌నే కారణమని బీజేపీ చెబుతోంది. ఓటమి భయమని విమర్శిస్తోంది. బీజేపీకి పరిస్థితులు బాగుంటే కేంద్రంలో అధికారంలో ఉండి కూడా ఎందుకు ఎన్నికలు పెట్టలేదని టీఆర్ఎస్ వాదన.
తెలంగాణ ప్రభుత్వాన్ని ఉపఎన్నికలు పెట్టాలా? వద్దా ? అని ఎన్నికల సంఘం అడిగింది. అంటే ఉపఎన్నికలు నిర్వహించాలా వద్దా అన్న అంశం నేరుగా టీఆర్ఎస్ చేతుల్లోకి ఇంకా చెప్పాలంటే కేసీఆర్ చేతుల్లోకి వచ్చిందన్నమాట. అయితే కేసీఆర్ మాత్రం వాయిదాకే మొగ్గు చూపారు. పండగ సీజన్ అయిపోయిన తర్వాతే ఉపఎన్నికల గురించి ఆలోచించాలని ప్రభుత్వం తరపున అధికారికంగా సమాచారం పంపారు. ఈ సమాచారం మేరకు ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం సిద్ధంగా లేనందున హుజురాబాద్ ఉపఎన్నికను ఈసీ వాయిదా వేసింది. ఇదే ఇప్పుడు రాజకీయ ప్రకంపనలకు కారణం అవుతోంది. కేసీఆర్ భయపడ్డారని బీజేపీ విమర్శలు ప్రారంభించింది. ఇంతకీ కేసీఆర్ వ్యూహం ఏమిటి..? ఏ ఉద్దేశంతో ఎన్నికల వాయిదాకు మొగ్గు చూపారు..? నెగెటివ్ ప్రచారం జరుగుతుందని తెలిసినా ఎందుకు వాయిదాకే మొగ్గు చూపారు..?
ఎన్నికల ఏర్పాట్లన్నీ చేసుకుని మరీ వాయిదాకే మొగ్గు చూపిన టీఆర్ఎస్
తెంలగాణ సీఎం కేసీఆర్ ప్రభుత్వం తరపున వాయిదా వేయాలనే సమాచారాన్ని పంపారని ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. అయితే కేసీఆర్ అడుగులు చూస్తే గత కొన్నాళ్లుగా నేడో రేపో షెడ్యూల్ అన్నట్లుగా పరుగులు పెడుతున్నారు. ఆగస్టు 16వ తేదీన దళిత బంధు పథకాన్ని హుజురాబాద్‌లో ప్రారంభించాలని ఆయన అనుకున్నారు. కానీ అంతకు ముందే ఎన్నికల నోటిఫికేషన్ వస్తుందన్న సమాచారం అందడంతో ఒక్క రోజులోనే దత్తత గ్రామం వాసాలమర్రిలో ప్రారంభించడానికి ఏర్పాట్లు చేసి ప్రారంభించేశారు. ఎన్నికల కోడ్ రాక ముందే ప్రారంభించడం వల్ల ఆ పథకం అమలుకు నోటిఫికేషన్ వచ్చినా ఇబ్బంది రాదన్న కారణంగా ఆయన అ పథకాన్ని వాసాలమర్రిలో ఓపెనింగ్ చేశారు. అప్పటికప్పుడు ఎన్నికలు జరుగుతాయని టీఆర్ఎస్ అధినేతలో అంత నమ్మకం ఉండేది.
Also Read : తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు ఎప్పుడంటే..?
వెంటనే ఎన్నికలు వస్తాయనే సర్వశక్తులు ఒడ్డుతున్న ఈటల..!
కేసీఆర్ వెంటనే ఎన్నికలు జరుగుతాయని అనుకోవడానికి మరో కారణం బీజేపీ. ఈటల రాజేందర్ బీజేపీలో చేరిన మొదటి రోజు నుంచే హుజురాబాద్‌లో ప్రచారం ప్రారంభించారు. ఉపఎన్నికలు వెంటనే జరుగుతాయని బీజేపీ హైకమాండ్ ఆయనకు సంకేతాలివ్వడంతోనే రంగంలోగి దిగినట్లుగా ప్రచారం జరిగింది. పైగా అప్పుడే ఈటలపై పోలీసుల కేసు.. ఆయన ఆస్తులపై దాడులు లాంటివి జరుగుతున్నాయి. దాంతో ఆయనపై సానుభూతి కూడా పెరిగింది. అదే సమయంలో నాగార్జున సాగర్‌తో పాటు ఎమ్మెల్సీ ఎన్నికలు, మిని మున్సిపల్ ఎన్నికల ఫలితాలతో దుబ్బాకతో వచ్చిన క్రేజ్ అడుగంటిపోవడంతో బీజేపీ కూడా హుజురాబాద్‌లో గెలిచి మళ్లీ ప్రత్యామ్నాయం సీటు కోసం పోటీ వస్తుందని అంచనా వేశారు. కానీ బీజేపీ అధినాయకత్వం ఏం ఆలోచించిందో కానీ ఉపఎన్నిక మాత్రం జరగడం లేదు.
Also Read : హైదరాబాద్ మెట్రో టైం టేబుల్ మారింది..!
ఎదురుగాలి వీస్తున్నందునే వాయిదాకు కేసీఆర్ మొగ్గు అని బీజేపీ విమర్శలు
ఉపఎన్నిక ఇప్పుడే వద్దని లేఖ రాయడం వల్ల కేసీఆర్ రాజకీయంగా నెగెటివ్ ప్రచారం ఎదుర్కునే అవకాశం ఎక్కువగా కనిపిస్తోంది. కేసీఆర్ హుజురాబాద్ విషయంలో చాలా ఎక్కువ దృష్టి పెట్టడం, వేల కోట్లు పంచడానికి వెనుకాడక పోతూండటం, ఆ నియోజకవర్గానికి చెందిన నేతలకు హుటాబుటిన పదవులు కట్టబెట్టడం వంటి కారణాలతో టీఆర్ఎస్‌కు అక్కడ అంత ఈజీ కాదన్న అభిప్రాయం ప్రజల్లో ఏర్పడుతోంది. హుజురాబాద్‌లో టీఆర్ఎస్ పరిస్థితి బాగోలేదని ఇప్పటి వరకూ అంతర్గత ప్రచారం జరగడానికి కారణం టీఆర్ఎస్ అధినేత దూకుడుగా తీసుకున్న నిర్ణయాలే. ఇప్పుడు ఆ ప్రచారం మరింతగా పెరడానికి కూడా ప్రభుత్వం ఉపఎన్నికను వాయిదా కోరడం కారణం అవుతుంది. ఓటమి భయంతోనే ఉపఎన్నికలను వాయిదా వేయించారని ఇప్పటికే బీజేపీ నేతలు విమర్శలు ప్రారంభించారు.
Also Read : తెలుగు రాష్ట్రాల్లో కరోనా కొత్త రూపం
బీజేపీ పరిస్థితి బాగుంటే ఎన్నికలు పెట్టడానికి ఇబ్బందేంటి ?
అయితే ఒక్క టీఆర్ఎస్ వైపే కాదు బీజేపీ వైపు కూడా అలాంటి విమర్శలే రావడానికి అవకాశం ఉంది. ఎందుకంటే కేంద్ర ఎన్నికల సంఘాన్ని పరోక్షంగా అయినా ప్రభావితం చేయగలిగిన పరిస్థితిలో బీజేపీ ఉంది . బీజేపీ ఎప్పుడు అనుకుంటే అప్పుడు హుజురాబాద్ ఎన్నికలు నిర్వహించగలదు. దేశంలో కరోనా పరిస్థితులు తగ్గిపోయాక.. మూడో వేవ్ ఆందోలన మాత్రమే కనిపిస్తోంది. పైగా తెలంగాణలో కరోనా ఎప్పుడూ తీవ్రంగా లేదని ప్రభుత్వం చెబుతూనే ఉంది. అదే సమయంలో రాజ్యాంగ నియమాలనూ గుర్తుంచుకోవాలి. ఎలా చూసినా ఎన్నికలు నిర్వహించడానికి తగ్గ పరిస్థితులు ఉన్నా బీజేపీ వెనక్కి తగ్గిందన్న ఓ చర్చ కూడా ఇతర రాజకీయవర్గాల్లో వస్తుంది. దీన్ని బీజేపీ నేతలు ఎలా సమర్థించుకుంటారో చూడాల్సి ఉంది.
రెండు పార్టీలూ ఇప్పుడు ఉపఎన్నికల్ని వద్దనుకున్నట్లే..!
కారణం ఏదైనా అటు బీజేపీ నేతలు కానీ ఇటు టీఆర్ఎస్ నేతలు కానీ ఇప్పుడు ఎన్నికలు ఎదుర్కోవడానికి సిద్ధంగా లేరని అనుకోవాలి. ఎన్నికలు పెట్టగలిగే పరిస్థితిలో ఉన్నా బీజేపీ లైట్ తీసుకుంది. పెట్టాల్సిందేనని పట్టు బట్టే పరిస్థితిలో ఉన్నా టీఆర్ఎస్ కూడా అంతే తేలికగా తీసుకుంది. అయితే ఈ ఇద్దరిలో ఒకరికి మాత్రమే ఈ నిర్ణయం కలసి వస్తుంది. అది ఎవరికనేది ఎన్నికల ఫలితం వచ్చిన తర్వాతనే స్పష్టమవుతుంది.