TS Politics : సెప్టెంబర్ 17 హైవోల్టెజ్ డే ! అదే రోజు తెలంగాణలో రాహుల్, అమిత్ షా టూర్స్ !
తెలంగాణపై జాతీయ పార్టీలు ప్రత్యేక దృష్టి సారించాయి. సెప్టెంబర్ 17వ తేదీన రాహుల్ గాంధీ, అమిత్ షా తమ తమ పార్టీ సభల్లో పాల్గొనేందుకు తెలంగాణకు వస్తున్నారు.
సెప్టెంబర్ 17 తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా భారతీయ జనతా పార్టీ ప్రత్యేక కార్యక్రమాలకు రూపకల్పన చేసింది. ఆ రోజున అమిత్ షాను తెలంగాణ పర్యటనకు ఆహ్వానించారు. ఆయన కూడా అంగీకరించడంతో పర్యటన ఖరారైంది. నిర్మల్ జిల్లా వెయ్యి ఊడల మర్రి వద్ద భారీ సభకు ఏర్పాట్లు ప్రారంభించారు. నిజాంకు వ్యతిరేకంగా పోరాడిన వెయ్యి మందిని ఇదే మర్రిచెట్టు వద్ద రజాకార్లు ఊచకోత కోశారు. అందుకే అక్కడ సభ పెట్టాలని నిర్ణయించారు. అమిత్ షా పర్యటన రోజు బండి సంజయ్ పాదయాత్రకు విరామమిచ్చి బహిరంగ సభలో పాల్గొంటారు.
Also Read : కేసీఆర్ ఢిల్లీ రాజకీయంతో టీ బీజేపీలో గందరగోళం
తెలంగాణ విమోచన దినోత్సవాన్ని అధికారికంగా నిర్వహించాలని బీజేపీ మొదటి నుంచి డిమాండ్ చేస్తోంది. తెలంగాణ రాష్ట్ర సమితి కూడా తెలంగాణ ఉద్యమంలో అదే డిమాండ్ చేసింది. సెప్టెంబర్ 17న ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాలు ఎగురవేసే ఉద్యమాలు చేపట్టారు. అయితే తెలంగాణ ఏర్పడిన తర్వాత మాత్రం అధికారికంగా నిర్వహించేందుకు ఇష్టపడలేదు. దీంతో బీజేపీ రాజకీయ అవకాశంగా తీసుకుని ఉద్యమాలు చేస్తోంది. అమిత్ షా పర్యటనకు వస్తే పార్టీ శ్రేణుల్లో మరింత ఊపు వస్తుందన్న ఉద్దేశంతో ఆయనను ఒప్పించారు.
Also Read : పోలవరం పనులకు "స్టాప్ వర్క్ ఆర్డర్" టెన్షన్..!
అయితే అదే రోజు కాంగ్రెస్ పార్టీ నేత రాహుల్ గాంధీ కూడా తెలంగాణ పర్యటనకు వస్తున్నారు. వరంగల్‌లో దళిత, గిరిజన దండోరా సభలో రాహుల్ గాంధీ పాల్గొంటారని కాంగ్రెస్ పార్టీ తెలంగాణ వ్యవహారాల ఇంచార్జ్ మాణిగం ఠాగూర్ ప్రకటించారు. రాహుల్‌ను ప్రత్యేకంగా ఆహ్వానించేందుకు రేవంత్ రెడ్డి నేతృత్వంలో పీసీసీ టీమ్ బుధవారం ఢిల్లీకి వెళ్తోంది. రేవంత్ రెడ్డి పీసీసీ చీఫ్ అయిన తర్వాత తొలి సారిగా రాహుల్ గాంధీ తెలంగాణకు వస్తున్నందున బలప్రదర్శన తరహాలో సభను విజయవంతం చేయాలని పట్టుదలగా ఉన్నారు.
Also Read : చీటింగ్ కేసులో వైసీపీ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
తెలంగాణలో రాజకీయం హైవోల్టేజ్ ఏర్పడుతోంది. ఓ వైపు బీజేపీ, మరో వైపు కాంగ్రెస్ అగ్రనేతలు ఒకే రోజు తెలంగాణ పర్యటన పెట్టుకోవడం రాజకీయంగా ఆసక్తి రేపుతోంది. ఓ వైపు హుజురాబాద్ ఉపఎన్నిక మరో వైపు వచ్చే అసెంబ్లీ ఎన్నికల కోసం ఇప్పటి నుండే పార్టీలు కసరత్తు ప్రారంభించడమే దీనికి కారణం. జాతీయ పార్టీలైన కాంగ్రెస్, బీజేపీ ఈ సారి తెలంగాణపై ఎన్నో ఆశలు పెట్టుకున్నాయి. ఈ క్రమంలో ఆ పార్టీ అగ్రనేతలు తెలంగాణలో రాజకీయ కార్యక్రమాలపై తమ నేతలకు దిశానిర్దేశం చేస్తున్నాయి. పార్టీ నేతలకు కావాల్సినప్పుడల్లా అందుబాటులో ఉంటున్నారు. అలాగే కార్యక్రమాల్లో ఎప్పుడు కావాలంటే అప్పుడు పాల్గొనేందుకు సమయం ఇస్తున్నారు. 17వ తేదీన అగ్రనేతల పర్యటనలతో తెలంగాణ రాజకీయంలో మరింత వేడి రాజుకోనుంది.