(Source: ECI/ABP News/ABP Majha)
Polavaram Stop Work : పోలవరం పనులకు "స్టాప్ వర్క్ ఆర్డర్" టెన్షన్..!
పోలవరం పనులపై ఎన్జీటీ ఇచ్చిన"స్టాప్ వర్క్ ఆర్డర్" పై స్టే పొడిగించునేందుకు ఏపీ ప్రభుత్వం ఆసక్తి చూపించలేదు. దీంతో పనులు నిలిపివేయాలని ఒరిస్సా అధికారులు కోరుతున్నారు.
పోలవరం ప్రాజెక్ట్‌కు సంబంధించి "స్టాప్ వర్క్ ఆర్డర్స్"పై ఉన్న స్టేను రాష్ట్ర ప్రభుత్వం పొడిగించుకోలేదు. దీంతో ఈ ఆదేశాలు అమలు చేయాలని కేంద్రం నిర్ణయించింది. అంటే పోలవరం ప్రాజక్టు పనులను ఎక్కడివక్కడ ఆపేయాలన్న మాట. 2015 చివరిలో పోలవరం పనులపై జాతీయ హరిత ట్రైబ్యునల్ "స్టాప్ వర్క్ ఆర్డర్" ఇచ్చింది. దీనిపై కేంద్ర పర్యావరణ శాఖ ప్రత్యేక అనుమతితో ప్రభుత్వం పనులు చేస్తోంది. తమ రాష్ట్రాల్లోని ముంపు ప్రాంతాల్లో సరిగ్గా ప్రజాభిప్రాయ సేకరణ చేయలేదంటూ ఒరిస్సాతో పాటు ఛత్తీస్‌గఢ్ ప్రభుత్వాలు జాతీయ హరిత ట్రైబ్యునల్ లో పిటిషన్ వేశాయి. దీనిపై విచారణ జరిపిన ఎన్జీటీ 2015 చివరిలో స్టాప్ వర్క్ ఆర్డర్ ఆదేశాలిచ్చింది.
Also Read : మోసం కేసులోవిశాఖ మాజీ ఎమ్మెల్యే అరెస్ట్
పోలవరం ప్రాజెక్ట్‌కు జాతీయ హోదా ఇవ్వడం పనులు ప్రారంభించి ఉండటంతో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆనాటి కేంద్ర అటవీ పర్యావరణ మంత్రిగా ఉన్న ప్రకాశ్ జవదేకర్‌తో మాట్లాడారు. ఆ ఆదేశాలపై 2016లో ఆయన స్టే ఉత్తర్వులిచ్చారు. వాటిని ఏడాదికోసారి ప్రభుత్వం పొడిగించుకుంటూ వస్తోంది. ఈ ఆర్డర్ నుంచి వెసులుబాటు కల్పిస్తూ పనులు నిరభ్యంతరంగా కొనసాగించుకోవడానికి కేంద్ర పర్యావరణ శాఖ ఇచ్చిన గడువు ఈ ఏడాది జూలైతోనే ముగిసింది. ఈ వెసులుబాటును పునరుద్ధరించుకోవడానికి రాష్ట్ర సర్కారు ప్రయత్నాలు చేయకపోవడంతో.. ఇప్పుడు స్టాప్ వర్క్‌ను అమలు చేసేందుకు కేంద్ర అటవీ పర్యావరణ శాఖ సిద్ధమైంది. ప్రాజెక్టు పనులపై నిషేధం ఉన్నందున.. వాటిని తక్షణమే నిలిపివేయాల్సిందిగా రాష్ట్రాన్ని ఆదేశించాలని నిర్ణయించినట్లుగా ప్రచారం జరుగుతోంది. చివరిగా ఇచ్చిన స్టే ఆర్డర్ 2019 జూలైలో ఇచ్చారు. రెండేళ్ల గడువు స్టే ముగిసిపోయింది.
Also Read : విశాఖలో వంద కోట్ల భూమిపై ఎమ్మెల్యే కుమారుడి కన్ను !
రెండు తెలుగు రాష్ట్రాల్లోని నీటి ప్రాజెక్టులు నదీ యాజమాన్య బోర్డుల పరిధిలోకి వచ్చాయి. అక్టోబరు 14 నుంచి గెజిట్ అమలు కానుంది. ఈ సందర్భంగా కేంద్ర అధికారులు నిర్వహించిన సమావేశంలో పాల్గొన్న ఒరిస్సా అధికారులు పోలవరం ప్రాజెక్టు పనులపై స్టాప్‌వర్క్ ఆదేశాలు అమల్లో ఉన్న విషయాన్ని గుర్తు చేశారు. పనుల కొనసాగింపు ఆదేశాలకు కాలం చెల్లినా నిర్మాణ పనులు యథావిధిగా ఎలా కొనసాగిస్తారని అభ్యంతరం వ్యక్తం చేసినట్లుగా తెలుస్తోంది. పనులు నిలిపివేయాలంటూ ఒరిస్సా ప్రభుత్వం చాలా కాలంగా డిమాండ్ చేస్తోంది. ఒరిస్సా సీఎం నవీన్ పట్నాయక్ కేంద్రంతో సఖ్యతగా వ్యవహరిస్తున్నారు.
Also Read : వైసీపీ కీలక నేతను అరెస్ట్ చేసి తీసుకెళ్లిన ఒరిస్సా పోలీసులు
ప్రభుత్వం అధికారికంగా స్టాప్ వర్క్ ఆర్డర్‌పై స్టేను పొడిగించుకోకపోతే పనులు చేయలేని పరిస్థితి ఏర్పడుతుంది. ఒక వేళ చేపట్టినా అది ఎన్జీటీ ఉత్తర్వుల ఉల్లంఘన అవుతుందన్న అభిప్రాయ ఉంది. వర్షాకాలం ప్రారంభం కావడం.. పోలవరం చుట్టూ పెద్ద ఎత్తున వరద చేరడంతో పనులేమీ పెద్దగా సాగడం లేదు. మళ్లీ పనులు ప్రారంభమయ్యే సరికి ఈ స్టాప్ వర్క్ ఆర్డర్‌పై స్టే తెస్తే సరిపోతుందని ఏపీ అధికారుల భావిస్తున్నారు.