CM Revanth Reddy: 'ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలి' - వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధికి కృషి చేశారన్న సీఎం రేవంత్ రెడ్డి
Telangana News: రాష్ట్రంలో పెట్టుబడిదారులు, పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని సీఎం రేవంత్ తెలిపారు. సీఐఐ సదస్సుకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు.
CM Revanth Comments in CII Meeting: ఆర్థిక ప్రగతికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని.. ప్రపంచ దేశాలతో తెలంగాణ పోటీ పడాలనేదే తమ విధానమని సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) అన్నారు. హైదరాబాద్ (Hyderabad)లో 'సీఐఐ తెలంగాణ' (CII Telangana) ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. పెట్టుబడిదారులకు, పారిశ్రామిక వేత్తలకు అన్ని విధాలా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పెట్టుబడులకు రక్షణ కల్పించడమే కాకుండా.. లాభదాయకంగా ఉండేలా నిర్ణయాలు తీసుకుంటామని చెప్పారు. రాజకీయాలు ఎలా ఉన్నా.. వైఎస్, చంద్రబాబు, కేసీఆర్ హైదరాబాద్ అభివృద్ధిని కొనసాగించారని.. అభివృద్ధి విషయంలో తమ ప్రభుత్వానికి ఎలాంటి భేషజాలు లేవని అన్నారు. నగర అభివృద్ధి కోసం గత పాలకులు తీసుకున్న మంచి నిర్ణయాలను కొనసాగిస్తామని.. రాష్ట్రంలో విద్య, ఉపాధి అవకాశాల కల్పనలో సీఐఐతో కలిసి ముందుకు నడుస్తామని స్పష్టం చేశారు.
'ఆ నిర్ణయంతోనే ఫార్మా రంగం వృద్ధి'
ఈ సందర్భంగా 'విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవస్థాపక అవకాశాలు' అనే అంశంపై సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగించారు. గత పాలకుల నిర్ణయాల వల్లే హైదరాబాద్ ఐటీ హబ్ గా మారిందని అన్నారు. ఇందిరాగాంధీ విధానపరమైన నిర్ణయం తీసుకుని ఐడీపీఎల్ ను ప్రారంభించినందునే ఫార్మా రంగంలో హైదరాబాద్ మెరుగైన స్థితిలో ఉందని గుర్తు చేశారు. పాలకుల నిర్ణయాలు, విధానాలు రాష్ట్ర ఆర్థిక పురోగతికి తోడ్పడుతాయని చెప్పారు. అవుటర్ రింగ్ రోడ్డు (ఓఆర్ఆర్) గురించి గతంలో మాట్లాడితే అవన్నీ అవసరమా అన్నారని.. ఇప్పుడు అదే తెలంగాణకు లైఫ్ లైన్ గా మారిందని అన్నారు. ఐటీఐల్లో స్కిల్ డెవలప్ మెంట్ కోసం టాటా సంస్థతో ఒప్పందం చేసుకున్నామని వెల్లడించారు.
రూ.2 వేల కోట్లతో స్కిల్ సెంటర్లు
రాష్ట్రంలో 64 ఐటీఐలను స్కిల్ డెవలప్ మెంట్ సెంటర్లుగా రూ.2 వేల కోట్లతో డెవలప్ చేస్తామని సీఎం రేవంత్ చెప్పారు. స్కిల్లింగ్ యూనివర్సిటీల ఏర్పాటు కోసం సంప్రదింపులు జరుపుతున్నామని అన్నారు. స్కిల్ డెవలప్ మెంట్ లో జాయిన్ అయిన విద్యార్థులకు డిగ్రీ సర్టిపికెట్స్ ఇవ్వబోతున్నట్లు వెల్లడించారు.
మరోవైపు, సీఎం రేవంత్ బుధవారం కొడంగల్ లో పర్యటించనున్నారు. సీఎం హోదాలో ఆయన తొలిసారి కొడంగల్ నియోజకవర్గానికి వెళ్లనున్నారు. ఈ సందర్భంగా నారాయణ పేట్ - కొడంగల్ ఎత్తిపోతల పథకానికి శంకుస్థాపన చేయనున్నారు. అలాగే, కొడంగల్ లో వైద్య, నర్సింగ్, ఫిజియోథెరపీ కళాశాలల పనులకు శ్రీకారం చుట్టనున్నారు. నియోజకవర్గంలో మొత్తం రూ.4,369 కోట్ల అభివృద్ధి పనులకు సీఎం శంకుస్థాపన చేయనున్నారు.