Sanju Samson: సంజూపై పగబట్టేశారా? వివాదాస్పద అవుట్ ఇవ్వడమే కాదు ఫీజులో కోత! బాసటగా నెటిజన్లు
IPL 2024: దిల్లీతో మంగళవారం జరిగిన మ్యచ్‌లో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ వివాదాస్పదంగా అవుట్ అయ్యాడు. దీనిపై అంపైర్‌తో వాదులాడినందుకు ఫిజులో కోత పడింది.
ఆటతీరుతో మెప్పించిన ఆటగాడికి బహుమతిగా మ్యాచ్ ఫీజులో కోత విధిస్తే..? రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్ సంజూ శాంసన్ విషయంలో కచ్చితంగా ఇదే జరిగింది. మంగళవారం తన పించ్ హిట్టింగ్‌తో ఫ్యాన్స్‌ని ఉర్రూతలూగించిన అతను చేసిన పాపం ఏంటంటే... వివాదాస్పదమైన తన డిస్మిసల్‌పై అంపైర్‌తో వాగ్వాదానికి దిగడం.
దిల్లీ కేపిటల్స్‌తో మంగళవారం జరిగిన మ్యాచ్‌లో రాజస్థాన్ రాయల్స్ ఓటమి పాలై, దిల్లీ తమ ప్లేఆఫ్ ఆశలు సజీవంగా ఉంచుకున్నప్పటికీ.. ఆట మొత్తంలో రాజస్థాన్ కెప్టెన్ సంజూ శాంసన్ ఇన్నింగ్సే హైలైట్‌గా నిలిచింది. తన అద్భుతమైన ఆటతీరుతో 46 బంతుల్లో 86 పరుగులు చేసి, దాదాపు మ్యాచ్‌లో రాజస్థాన్‌ను గెలిపించినంత పనిచేసిన శాంసన్ ఔటయిన తీరు క్రికెట్ అభిమానులను కలిచి వేసింది. అయితే.. శాంసన్ పై తాజాగా ఐపీఎల్ నిర్వాహకులు క్రమశిక్షణా చర్యలు తీసుకోవడం తీవ్ర దుమారానికి తెరలేపింది.
అసలేమైందంటే..
దిల్లీ విధించిన 221 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన రాజస్థాన్.. సంజూ శాంసన్ వీర విహారంతో విజయానికి చేరువగా వచ్చింది. అయితే రాజస్థాన్ ఇన్నింగ్స్ 16వ ఓవర్లో.. దిల్లీ బౌలర్ ముకేష్ కుమార్ వేసిన షార్ట్ పిచ్ బంతిని సంజూ శాంసన్ లాంగాన్ మీదుగా సిక్సర్‌గా మలిచేందుకు ప్రయత్నించాడు. కచ్చితంగా బౌండరీపై ఆ బంతిని హోప్ క్యాచ్ అందుకున్నాడు. అయితే క్యాచ్ పట్టాక హోప్ కాలు బౌండరీకి తాకినట్లుగా టీవీ రీప్లేలో కనిపించింది. హోప్ షూకి బౌండరీకి మధ్య గ్యాప్ అసలు కనిపించలేదు. కానీ ఆ రీప్లే పరిశీలించాకే శాంసన్ ఔటనట్లుగా థర్డ్ అంపైర్ ప్రకటించాడు. కాలు బౌండరీకి తాకిందనేందుకు సైతం స్పష్టమైన ఆధారం లేదనే కారణంతో థర్డ్ అంపైర్ ఈ పని చేశాడు.
అంపైర్ నిర్ణయంతో అందరూ అప్‌సెట్
సంజూ శాంసన్ ఔటయినట్లు ప్రకటించడంపై మొత్తం దిల్లీలోని అరుణ్ జైట్లీ స్టేడియం అంతా దిగ్భ్రాంతికి గురైంది. టీవీ రీప్లేలో హోప్ షూ బౌండరీకి తాకుతున్నట్లు కనిపించడంతో అందరూ ఈ నిర్ణయంతో అసంతృప్తితో తలలు అడ్డందగా ఊపడం కనిపించింది. అప్పటి వరకూ మంచి ఊపు మీదున్న శాంసన్ ఇన్నింగ్స్‌కి తెరపడటంతో దీల్లీ క్రౌడ్ ఎక్కువగా ఉన్న స్టేడియంలోనూ శాంసన్‌కే ఎక్కుువ మద్దతు ప్రకటించడం కనిపించింది.
శాంసన్ వాగ్వాదం.. అందుకే పనిష్మెంట్
టీవీ రీప్లేలో తాను నాటౌట్ గా కనిపిస్తున్నా.. థర్డ్ అంపైర్ ఔట్‌గా ప్రకటించారంటూ.. శాంసన్ అంపైర్ల వద్దకెళ్లి వాగ్వాదానికి దిగాడు. నిర్ణయంపై పునరాలోచించాలని కోరినా ఫలితం లేకుండా పోయింది. ఇలా అంపైర్లతో వాగ్వాదానికి దిగడమేంటని ఐపీఎల్ నిర్వాహకులు శాంసన్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకున్నారు. శాంసన్ మ్యాచ్ ఫీజులో 30 శాతం కోత విధించారు.
శాంసన్‌కు బాసటగా క్రికెట్ ఫ్యాన్స్
మ్యాచ్లో సంజూ శాంసన్ ఔటైన తీరుపై నెటిజన్లు తీవ్రమైన ట్రోలింగ్ చేస్తున్నారు. ఇక సంజూ శాంసన్‌పై క్రమశిక్షణా చర్యలు తీసుకోవడంపై మండిపడుతున్నారు. స్పష్టంగా నాటౌట్ అని కనపిస్తున్నా.. ఔటిచ్చిన థర్డ్ అంపైర్‌కు ఈ మ్యాచ్ ఫీజు మొత్తం కోత విధించాలని కోరుతున్నారు. శాంసన్ తప్పుడు నిర్ణయానికి బలవ్వకపోతే కచ్చితంగా రాజస్థాన్ గెలిచేదంటూ కామెంట్లు చేస్తున్నారు. ఐపీఎల్ ఫిక్సిగ్ అంటూ మండిపడుతున్నారు.