Andhra Pradesh News: రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్, కొత్త రూట్‌తో గోవా, బెంగళూరుకు రైట్ రైట్
రైల్వే ప్రయాణికులకు గుడ్‌న్యూస్ వచ్చింది. గుంటూరు - గుంతకల్లు మధ్య రెండో రైలు మార్గంలో ఇదివరకే రాకపోకలను అనుమతించారు. పనులు పూర్తయితే అటు బెంగళూరు, ఇటు గోవాకు రూట్ క్లియర్ అవుతుంది.

Guntur - Guntakal Train Route | ఏపీలోని రైల్వే ప్రయాణికులకు శుభవార్త. త్వరలోనే మరో రైలు మార్గం అందుబాటులోకి రానుంది. గుంటూరు - గుంతకల్లు మధ్య రెండో రైలు మార్గం పనులు పూర్తికావొచ్చాయి. డబ్లింగ్, విద్యుదీకరణ పనుల కోసం 41 కిలోమీటర్ల కుగానూ 3631 కోట్లు ఖర్చు చేయడానికి ఐదేళ్ల కిందట కేంద్ర ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఈ ప్రాజెక్టుకు అయ్యే ఖర్చులో రాష్ట్ర ప్రభుత్వం సగం, కేంద్ర రైల్వే శాఖ సగం చొప్పున భరించాలని ఒప్పందం చేసుకున్నాయి.
ఇప్పటివరకు దాదాపు 350 కిలోమీటర్ల మేర పని పూర్తయింది. మరోవైపు రైళ్ల రాకపోకలను అనుమతించారు. ఒకవేళ మొత్తం 401 కిలోమీటర్ల పనులు పూర్తయితే అటు బెంగళూరుతో పాటు రాయలసీమ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి కోస్తాంధ్రకు, రాజధాని అమరావతికి, టారిస్ట్ ప్రాంతం గోవాకు వేగంగా చేరుకోవడానికి ఈ మార్గం ఉపయోగపడుతుంది. గుంటూరు గుంతకల్లు మధ్య ఈ రెండు రైలు మార్గంలో ప్రయాణానికి గంటన్నర సమయం ఆదా అవుతుంది. దేశంలో తూర్పు పడమర ప్రాంతాల మధ్య అనుసంధానం మరింత పెరగనుంది. తద్వారా మరిన్ని కొత్త రైళ్లు ప్రారంభించే అవకాశం ఏర్పడుతుంది. కొత్త రైలు మార్గం అందుబాటులోకి వస్తే గోవా నుంచి మచిలీపట్నం వరకు పలు వాణిజ్య కార్యకలాపాలు విస్తరించడానికి అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
సొరంగ మార్గాలతో పనులలో జాప్యం..
బొగడ వద్ద 1.6 కిలోమీటర్ల టన్నెల్ పనులు ప్రారంభించాల్సి ఉంది. మరోవైపు చలమ వద్ద ప్రారంభించిన 0.34 కిలోమీటర్ల సొరంగం పనులు పూర్తి చేయాల్సి ఉంది. ఇందుకోసం అధికారులు అటవీశాఖ అనుమతి సైతం తీసుకున్నారు. 2026 డిసెంబర్ నాటికి ఈ పనులు పూర్తయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేశారు. దిగువమెట్ల- నంద్యాల మార్గంలో 40 కిలోమీటర్ల మేర పనులు చేయాల్సి ఉంది. ఇందులో దిగువ మెట్ల నుంచి గాజులపల్లి మధ్య రెండు సొరంగాల పనుల కారణంగా 27 కిలోమీటర్ల పనులలో జాప్యం జరుగుతోందని అధికారులు చెబుతున్నారు. మరోవైపు నంద్యాల -గాజులపల్లి మార్గంలో 13 కిలోమీటర్ల పనులు మొదలుపెట్టారు.. మరో ఆరు నెలల్లో ఈ పనులు పూర్తి చేయాలని లక్ష్యంగా పెట్టుకుని పనులు చేస్తున్నారు. నంద్యాల- పాణ్యం మధ్య 14 కిలోమీటర్ల పనులను వచ్చే ఏడాది జూన్ వరకు పూర్తి చేసేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. ఓవరాల్ గా ఈ ప్రాజెక్టు పూర్తయితే చాలా ప్రాంతాల వారికి ప్రయాణం ఈజీ కానుంది. దూరం తగ్గడంతో పాటు ప్రయాణించే సమయం కలిసొస్తుంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు

