Chilkur Balaji Priest Case: చిలుకూరు బాలాజీ పూజారిపై దాడి, ప్రధాన నిందితుడికి కోర్టులో ఊరట
Chilkur Balaji Priest Rangarajan | చిలుకూరు బాలాజీ ఆలయ ప్రధాన పూజారి రంగరాజన్‌పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవరెడ్డికి రాజేంద్రనగర్ కోర్టులో ఊరట లభించింది.

Chilkur Balaji priest Rangarajan Attack Case | మొయినాబాద్: చిలుకూరు బాలాజీ ప్రధాన అర్చకులు రంగరాజన్ పై దాడి కేసులో ప్రధాన నిందితుడు వీర రాఘవ.రెడ్డి (KV Reddy)కి కోర్టు నుంచి ఊరట లభించింది. నిందితుడు కేవీ రెడ్డికి రాజేంద్రనగర్ కోర్టు ఎట్టకేలకు బెయిల్ మంజూరు చేసింది. రూ. 15 వేలతో రెండు పూచీకత్తులు సమర్పించాలని నిందితుడ్ని కోర్టు ఆదేశించింది. ఈ ఏడాది ఫిబ్రవరి 8న నిందితుడు వీర రాఘవరెడ్డిని మొయినాబాద్ పోలీసులు అరెస్ట్ చేయడం తెలిసిందే.
ఫిబ్రవరిలో ఆలయానికి వెళ్లి చిలుకూరు ప్రధాన పూజారి రంగరాజన్ పై తన అనుచరులతో కలిసి నిందితుడు వీర రాఘవరెడ్డి దాడి చేశాడు. ఈ ఘటనపై తెలంగాణ ప్రభుత్వం సీరియస్ అయింది. ప్రతిపక్ష బీఆర్ఎస్ నేతలతో పాటు బీజేపీ నేతలు రంగరాజన్ పై దాడిని తీవ్రంగా ఖండించారు.
ఎవరీ వీరరాఘవ రెడ్డి..
చిలుకూరు పూజారి రంగరాజన్ మీద దాడి కేసులో ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డి స్వస్థలం ఆంధ్రప్రదేశ్‌లోని తూర్పుగోదావరి జిల్లా అనపర్తి మండలం కొప్పవరం. అతడు హైదరాబాద్ వేదికగా తన కార్యకలాపాలు కొనసాగిస్తున్నాడు అని పోలీసులు తెలిపారు. నగరంలో ఉంటున్న వీరరాఘవరెడ్డి 2022లో ‘రామరాజ్యం’ అనే సంస్థను స్థాపించి అనుచరులను పెంచుకుంటూ పోతున్నారు. హిందూధర్మ రక్షణకు రామరాజ్యం ఆర్మీలో చేరాలంటూ యువతను రెచ్చగొట్టడంలో వీర రాఘవరెడ్డి దిట్ట. వారిని నమ్మించేందుకు తాను శ్లోకాలు చదువుతూ సనాతన ధర్మం, రామరాజ్యం గురించి సోషల్ మీడియాలో పోస్టులు షేర్ చేస్తుండేవాడు. ప్రతినెలా రూ.20 వేల జీతం ఇస్తానని, రామరాజ్యం కోసం పనిచేస్తే స్వామి కార్యంతో పాటు స్వకార్యం అవుతుందని నమ్మించి వేలాది మందిని అనుచరులుగా చేసుకున్నాడు.
గతంలోనూ దాడులు, కేసులు
గతంలో పలుచోట్ల ఆలయాలకు చెందిన వారిపై బెదిరింపులకు దిగాడని వీరరాఘవరెడ్డిపై ఆరోపణలున్నాయి. కొన్ని కేసుల్లో నిందితుడిగా ఉన్నాడు. ఈ క్రమంలో ఫిబ్రవరి నెలలో తన అనుచరులతో కలిసి వెళ్లి చిలుకూరు బాలాజీ పూజారి రంగరాజన్ పై దాడికి పాల్పడ్డాడు. తాను రాముడి ఇక్వాకు వంశానికి చెందినవాడినని, రామరాజ్యం స్థాపనకు కృషి చేస్తున్నట్లు చిలుకూరు పూజారికి చెప్పాడు. తనకు ధన రూపేణా, లేక అనుచరుల రూపేణా సహకారం అందించాలని రంగరాజన్‌ను కోరాడు. రామరాజ్య స్థాపన కోసం కొత్త సభ్యులను తన అనుచరులుగా చేర్పించాలని ఒత్తిడి తేవడంతో అందుకు పూజారి నిరాకరించారు. దాంతో వీరరాఘవరెడ్డి, ఆయన అనుచరులు పూజారి రంగరాజన్‌పై దాడి చేశారు. రంగరాజన్ కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు మొయినాబాద్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మొదట ప్రధాన నిందితుడు వీరరాఘవరెడ్డిని అరెస్ట్ చేశారు. ఆ తరువాత మరో ఐదుగురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో మొత్తం 14 మంది అరెస్ట్ చేసి విచారణ చేపట్టినట్లు రాజేంద్రనగర్ డీసీపీ గతంలోనే వెల్లడించారు. దాదాపు రెండు నెలల అనంతరం ప్రధాన నిందితుడు వీరరాఘవ రెడ్డికి రాజేంద్రనగర్ కోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. తనను సైతం వీరరాఘవ రెడ్డి గతంలో టార్గెట్ చేశాడని చినజీయర్ స్వామి సైతం వెల్లడించడంతో పోలీసులు అతడి దుర్మార్గాలపై దర్యాప్తు వేగవంతం చేశారు.






















