Bonalu 2021:అమ్మా బైలెల్లింది...ఘనంగా సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాలు….తొలిబోనం సమర్పించిన మంత్రి తలసాని
ఆదివారం తెల్లవారుజామునే సికింద్రాబాద్ లష్కర్ బోనాల జాతర ఘనంగా ప్రారంభమైంది. ప్రభుత్వం తరపున మంత్రి తలసాని శ్రీనివాసయాదవ్ అమ్మవారికి తొలిబోనం సమర్పించారు. సోమవారం రంగం వేడుక నిర్వహించనున్నారు.
అమ్మా బైలెల్లింది.. సల్లంగా చూడమ్మా.. అంటూ భక్తులు బోనంతో బారులు తీరారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల జాతరకి ప్రభుత్వం తరఫున మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ తొలి బోనం సమర్పించారు. తెల్లవారుజామున 4 గంటల సమయంలో మంత్రి తలసాని కుటుంబసభ్యులతో కలిసి అమ్మవారికి బంగారు బోనం సమర్పించారు.
బోనాల జాతరకు ప్రభుత్వం ఘనంగా ఏర్పాట్లు చేసింది. ఉత్సవాలకు హాజరయ్యే భక్తులు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా తగిన ఏర్పాట్లు చేసింది. వేడుకలు తిలకించేందుకు ప్రధాన ప్రాంతాల్లో ఎల్‌ఈడీ స్క్రీన్‌లు ఏర్పాటు చేసింది. రాష్ట్ర ప్రజలను సల్లంగా చూడాలని…కరోనా బారి నుంచి కాపాడాలని అమ్మను వేడుకున్నా అన్నారు తలసాని శ్రీనివాస్ యాదవ్. కరోనా నిబంధనలు పాటిస్తూ.. మహంకాళి అమ్మవారి బోనాల ఏర్పాట్లను చేశామన్నారు.
తెలంగాణ సీఎం కేసీఆర్, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి సహా నగరంలో పలువురు ప్రజా ప్రతినిధులు అమ్మవారిని దర్శించుకున్నారు. సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారి బోనాల సందర్భంగా పోలీసులు గట్టి బందోబస్తు ఏర్పాటు చేశారు. తెల్లవారుజామున 3 గంటల నుంచే భక్తులు క్యూలైన్లలో నిల్చునున్నారు. బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు చేశారు. ఆలయ ప్రాంగణంలో అమ్మవారి దర్శనానికి వచ్చే భక్తులందరికీ మాస్కులు అందజేస్తున్నారు.
రెండు వందల సంవత్సరాల చరిత్ర కలిగిన లష్కర్ బోనాలకు చారిత్రక నేపథ్యం ఉంది. కలరా , ప్లేగు వంటి వ్యాధులతో ప్రజలు మృతి చెందుతుండటంతో మహంకాళి అమ్మవారిని తమ గ్రామ దేవతగా ప్రజలు కొలవటం ప్రారంభించారు. నగరంలో గోల్కొండ బోనాల తరువాత అంతే స్థాయిలో సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారి బోనాల జాతర జరుగుతుంది. బ్రిటిష్ కాలంలో కాంట్రాక్టర్‌గా ఉన్న నగరవాసి ఉజ్జాయినిలో పనులు నిర్వహించేవాడు ఈ క్రమంలో తమ ప్రాంతంలో కలర, మసూచి, ప్లేగు వంటి రోగాలు వచ్చి ప్రజలు చనిపోతూ ఉంటే తమ గ్రామ ప్రజల ప్రాణాలను కాపాడితే తమ గ్రామ దేవతగా కొలుస్తామని మొక్కుకున్నాడట. ఉజ్జయినిలో అమ్మవారికి మొక్కుకున్నాడు కాబట్టి ఆదే పేరుతో ఉజ్జ0యిని మహంకాళిగా పూజలు చేయడం మొదలు పెట్టారు.
అప్పట్లో హైదరాబాద్ సంస్థానానికి ఆమడ దూరంలో లష్కర్ ఓ చిన్న గ్రామంగా ఉండేది. కాలక్రమంలో హైదరాబాద్,లష్కర్‌లు కలిసిపోయాయి. కోరిన కోర్కెలు తీర్చే అమ్మవారిగా భక్తులు బోనాలు సమర్పిస్తుంటారు. బెజవాడ కనకదుర్గ, వరంగల్ భద్రకాళి ఎంత విశిష్టత ఉందే అంతే మహిమలు, శక్తి ఉజ్జాయిని మహంకాళికి ఉన్నాయని భక్తులు నమ్ముతారు. రాష్ట్రం నలుమూల నుంచి లక్షలాది భక్తులు మహంకాళి అమ్మవారి దర్శనార్థం తరలివస్తుంటారు.
సాయంత్రం అమ్మవారి పలహారం బండి ఊరేగింపు జరుగుతుంది. ఊరేగింపులో అమ్మవారిని సుందరంగా అలంకరించి బండిలో కూర్చొబెట్టి పోతురాజుల నృత్యాల మధ్య ఆలయ పరసరాల్లో ఊరేగిస్తారు. దీంతో మొదటిరోజు వేడుకలు ముగుస్తాయి. రెండో రోజు అంటే…సోమవారం రంగం కార్యక్రమం జరుగుతుంది. భవిష్యవాణి వినేందుకు భక్తులు భారీగా తరలివస్తారు…